మహిళ పట్ల సీఐ అనుచిత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-08T05:45:10+05:30 IST

ఓ మహిళ పట్ల అనంతపురం వన టౌన సీఐ ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయింది. విచారణ పేరిట తనను స్టేషనకు పిలిచి.. ‘తన భర్త ప్రియురాలి సమక్షంలో’ బూతులు తిట్టాడని బాధితురాలు డయల్‌ 100కు ఫోన చేసింది.

మహిళ పట్ల సీఐ అనుచిత వ్యాఖ్యలు

బూతు పురాణం

డయల్‌ 100, స్పందన 1902కు ఫిర్యాదు 

ఫలితం లేక.. ఎస్పీని కలిసిన బాధితురాలు

అయినా.. న్యాయం అనుమానమే..!

దిశకు వెళ్లినా..నాన్చుతున్న పోలీసులు


అనంతపురం క్రైం, అక్టోబరు 7: ఓ మహిళ పట్ల అనంతపురం వన టౌన సీఐ ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయింది. విచారణ పేరిట తనను స్టేషనకు పిలిచి.. ‘తన భర్త ప్రియురాలి సమక్షంలో’ బూతులు తిట్టాడని బాధితురాలు డయల్‌ 100కు ఫోన చేసింది. వారు చేతులు ఎత్తేయడంతో 1902కు ఫోన చేసింది. ఆ తరువాత ఎస్పీ ఫక్కీరప్పను కలిసి ఫిర్యాదు చేసింది. డీఎస్పీకి రెఫర్‌ చేయడంతో.. దిశ పోలీస్‌ స్టేషనకు బాధితురాలిని పిలిపించారు. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా.. ‘ఏం చేయమంటారు..? మీకేం కావాలి..? అయినా.. సీఐ ఎందుకు తిడతారు..?’ అని ఎదురు ప్రశ్నలు వేశారట. అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు వ్యవహరించారని సమాచారం. ఇంతకూ ఆమె చేసిన నేరం ఏమిటంటే.. తన భర్త, ఆయన ప్రియురాలు కలిసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టడం. ఆ తరువాత మనసు మార్చుకుని అరగంట తరువాత తొలగించడం..!


స్టేషనలో బూతుపురాణం

బుక్కరాయసముద్రం జనచైతన్య కాలనీకి చెందిన గుమ్మేపల్లి రమీజ తనకు జరిగిన అవమానం, అన్యాయం గురించి ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పకు ఈ నెల 6న ఫిర్యాదు చేసింది. అందులో ఉన్న వివరాల మేరకు, రమీజ భర్తకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై అత్తమామలకు చెప్పినా, ఆధారాలు చూపించినా పట్టించుకోలేదు. దీంతో భర్త, అతని ప్రియురాలు, అత్తమామలపై బుక్కరాయసముద్రం పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. ఆ కేసు రెండేళ్ల నుంచి కోర్టులో నడుస్తోంది. ఐదు నెలల క్రితం తన భర్త, ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టి.. అరగంట తరువాత తొలగించింది. ఈ విషయమై ఈ నెల 3వ తేదీ వనటౌన పోలీసులు స్టేషనకు రమీజాను పిలిపించారు.  అక్కడికి తన భర్త ప్రియురాలు కూడా వచ్చిందని రమీజ పేర్కొంది. ఫేస్‌బుక్‌లో ఫొటో పెట్టిన విషయమై వనటౌన సీఐ ఆరా తీశారని, ‘నువ్వూ అమ్మాయివే కదా.. వారు సన్నిహితంగా ఉన్న ఫొటో ఫేస్‌బుక్‌లో ఎందుకు పెట్టావ్‌..?’ అని ప్రశ్నించారని పేర్కొంది. దీంతో తనకు అన్యాయం జరిగిందని, ఆ బాధతోనే ఫేస్‌బుక్‌లో పెట్టానని, కానీ వెంటనే డిలీట్‌ చేశానని సీఐకి ఆమె వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో సీఐ బూతు పురాణం అందుకున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాసేపటి తరువాత తన భర్త ఎక్కడున్నాడని సీఐ అడిగారని, కేసు పెట్టినప్పటి నుంచి అందుబాటులో లేరని చెబితే ‘వాడు మొగుడా కాదా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది. తాను బూతులు వినలేక.. ‘బుక్కరాయసముద్రం సీఐకు సంబంధం కదా..? మీరెందుకు పిలిపించారు..?’ అని అడిగితే.. తనను అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. తాను వెళతానని బతిమాలితే.. వెళ్లిపో అని చెప్పడానికి సైతం బూతు మాట పలికారని ఫిర్యాదులో పేర్కొంది. 


అబ్బో సీఐనా.. అయితే పైకి చెప్పుకోండి..

తన భర్త ప్రియురాలి సమక్షంలోనే స్టేషనలో అవమానం జరగడంతో బాధితురాలు తీవ్ర మనోవేదన చెందింది. వనటౌన స్టేషన నుంచి బయటకు వచ్చిన ఆమె, ఆవేదనతో డయల్‌-100కు కాల్‌ చేసింది. ఫోనలో విషయం చెప్పగానే.. అవతలి నుంచి ‘అబ్బో సీఐనా..? ఏమీ చేయలేం. పై అధికారులకు చెప్పుకోండి..’ అని సలహా  ఇచ్చారని బాధితురాలు వాపోయింది. ఆ తరువాత 1902కు స్పందన ఫోన చేసి విషయం తెలియజేసింది. మరుసటిరోజు బుక్కరాయసముద్రం పోలీసులు ఆమెను స్టేషనకు పిలిపించారు. ఏం జరిగిందో ఫిర్యాదు రాయించుకున్నా రు. ఈ సమయంలో ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌.. జోక్యం చేసుకుంది. ‘కోపంలో సారోళ్లు ఏమైనా అంటే ఫిర్యాదు చేయాలా?’ అని హితబోధ చేశారట. అంతే.! ఆ స్టేషన పోలీసులు విచారించలేదు. 


ఎస్పీకి ఫిర్యాదు

న్యాయం కోసం తిరుగుతున్న రమీజా, ఎస్పీ కోసం రెండురోజుల పాటు ఎదురు చూసింది. ఈ నెల 6న ఎస్పీని కలిసి గోడు వినిపించి, ఫిర్యాదు చేసింది. ఆయన డీఎస్పీకి రెఫర్‌ చేస్తానని చెప్పి పంపించారు. ఈ క్రమంలో సీఐ సూర్యనారాయణ పిలుస్తున్నారని శుక్రవారం దిశ పోలీ్‌సస్టేషన నుంచి సమాచారం అందింది. అక్కడ కూడా బాధితురాలు జరిగిన విషయమంతా చెప్పుకొచ్చింది. అంతా విన్న ఆ సీఐ, మహిళను సీఐ ఎలా దుర్భాషలాడతారని ఎదురు ప్రశ్న వేశారట. చివరకు ‘నీకేం కావాలో చెప్పు.. చేస్తాం..’ అని అన్నారట. వనటౌన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరితే.. విచారిస్తామని చెప్పి పంపించారట. కాగా తాను ఎవరినీ తిట్టలేదని వనటౌన సీఐ రవిశంకర్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. తిట్టాల్సిన అవసరం తనకు ఏముందని, ఇరువర్గాలు వచ్చినప్పుడు ఇద్దరికీ న్యాయం చేయలేమని అన్నారు. అందుకే అలా చెబుతుంటారని అన్నారు.



మహిళ ఆత్మహత్యాయత్నం 

వైసీపీ నాయకుడి వేధింపులే కారణం

దాడి చేసి.. బాధిత కుటుంబంపైనే ఫిర్యాదు


గుంతకల్లు టౌన, అక్టోబరు 7: పట్టణంలోని రాజేంద్ర నగర్‌లో ఇస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను వైసీపీ నాయకుడు, అతని భార్య వేధించారు. దీంతో ఆమె శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి భర్త, కుమారులు తెలిపిన మేరకు, రాజేంద్రనగర్‌లోని ఛత్రపతి శివాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల వద్ద రాముడు, చిట్టెమ్మ దంపతులు కొన్నేళ్లుగా ఇస్త్రీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. చిట్టెమ్మ వద్దకు వైసీపీ నాయకుడు ముని భార్య నారాయణమ్మ గురువారం వెళ్లింది. రోజూ తన భర్తకు సైగలు చేస్తున్నావంటూ గొడవ పడింది. దీంతో చిట్టెమ్మ కొడుకు గణేష్‌ అక్కడికి వచ్చి, ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు. నీ కూతురు గురించి ఇలాగే మాట్లాడితే ఊరికే ఉంటావా అని ప్రశ్నించాడు. దీంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ముని, అతని భార్య, కుటుంబ సభ్యులు కట్టెలతో చిట్టెమ్మ దంపతులు, ఆమె కుమారుడు గణేష్‌పై దాడి చేశారు. ఆ తరువాత టూటౌన పోలీసు స్టేషనలో బాధిత కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన చిట్టెమ్మ, శుక్రవారం మధ్యాహ్నం విష రసాయనం తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు, బాధితురాలిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్త్రీ షాపు ఖాళీ చేయాలని తమను బెదిరిస్తున్నారని బాధిత కుటుంబం వాపోతోంది. ఐటీఐ, ఇంటర్‌, 9వ తరగతి చదువుతున్న తమ పిల్లలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని చిట్టెమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముని, అతని భార్య, కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించామని, కేసు ఇంకా నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-10-08T05:45:10+05:30 IST