ఏయ్‌... ముందు మాస్కు పెట్టుకో!

ABN , First Publish Date - 2021-09-14T06:44:30+05:30 IST

క్రమశిక్షణకు..

ఏయ్‌... ముందు మాస్కు పెట్టుకో!

సీఐ జులుం..!

టీడీపీ నేతలపై దురుసు ప్రవర్తన

ఏయ్‌... ముందు మాస్కు పెట్టుకో అంటూ... వేలెత్తి చూపిన వైనం

సీఐ తీరుపై పరిటాల సునీత, బీకే పార్థసారథి ఆగ్రహం


చెన్నేకొత్తపల్లి(అనంతపురం): క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పనిచేసే ఓ సీఐ.. టీడీపీ నేతల పట్ల వ్యవహరించిన తీరు ఖాకీ జులుంకు దర్పణం పడుతోంది. మాజీ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వకుండా ఆ సీఐ దురుసుగా వ్యవహరించారు. ఆ సీఐ హూంకరించిన తీరు ఆ మాజీ ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. పింఛన్ల తొలగింపును నిరసిస్తూ... ధర్మవరం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి వెళ్లేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారధి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వారి వాహనాల్లో బయల్దేరారు. అక్కడ విధుల్లో ఉన్న రామగిరి సీఐ చిన్నగౌస్‌.. ఆ నేతల వాహనాలను ప్యాదిండి వద్ద అడ్డుకున్నారు. వెళ్లేందుకు వీలులేదని ఆంక్షలు పెట్టారు.


ఇలా అయితే వాహనాలను ఇక్కడే వదిలేసి, కాలినడకన ర్యాలీగా వెళ్లాల్సి వస్తుందని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు అవకాశమివ్వాలని కోరినా.. సీఐ ససేమిరా అన్నారు. ఇక్కడే ఆ సీఐ తన ఖాకీ ప్రతాపాన్ని చూపాలనుకున్నాడో ఏమోగానీ... టీడీపీ హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన పరిటాల సునీత, బీకే పార్థసారథి, గుండుమల తిప్పేస్వామితో వాగ్వాదానికి దిగారు. మాజీ ప్రజాప్రతినిధులన్న కనీస గౌరవమివ్వకుండా వేలు చూపుతూ మాట్లాడటంతోపాటు.. బీకే పార్థసారథి మాస్కు పెట్టుకోకపోవడంతో... ‘ఏయ్‌ మాస్కు పెట్టుకో’ అంటూ ఏకవచనంతో అమర్యాదగా మాట్లాడటం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఆ సీఐ అలా సంబోధించడంతో పరిటాల సునీతతో పాటు బీకే పార్థసారథి, గుండుమల తిప్పేస్వామి, అక్కడున్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా  కోపోద్రిక్తులయ్యారు.


శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే... ఇలా అడ్డుకోవడంతోపాటు దురుసుగా వ్యవహరించడం మంచిది కాదని సీఐకి హితవు పలికారు. అయినా ఆగని ఆ సీఐ ‘రేయ్‌.. వీడియో తీయి’ అంటూ తన సిబ్బందిని ఆదేశించారు. ‘రికార్డు చేయండి... ఏం తప్పు చేశామం’టూ సీఐని నాయకులు నిలదీశారు. ఇదే సందర్భంలో బీకే పార్థసారథి... ‘ముందు మీ సీఎంను మాస్కు పెట్టుకోమని చెప్పండి... మాస్కులు ఎప్పుడు పెట్టుకోవాలో మాకు తెలుసులే’ అంటూ సీఐకి చురకంటించారు. ఇదే క్రమంలో సీఐ వేలెత్తి చూపుతూ మాట్లాడటంతో.. ‘వేలెత్తి చూపితే భయపడతామనుకుంటున్నారా...? మీరు చాలా అత్యుత్పాహం ప్రదర్శిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ’ పరిటాల సునీత వాదనకు దిగారు. దాదాపు వారి మధ్య 20 నిమిషాల పాటు వాగ్వాదం సాగింది. ఇదే సందర్భంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నాయి. సీఐ తీరును నిరసిస్తూ ఆందోళనకుసమాయత్తమయ్యారు. పరిటాల సునీత, పార్థసారధి ఆందోళన వద్దని శ్రేణులను వారించారు. వివాదం సద్దుమనగడంతో అక్కడి నుంచి ధర్మవరానికి బయలుదేరి వెళ్లారు.


ఇక్కడో విషయాన్ని ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో ఏ పోలీసుస్టేషనకు వెళ్లినా... ముందుగా తాటికాయంత అక్షరాలతో ‘మర్యాదగా మాట్లాడుకుందాం’ అనే బోర్డులు కనిపిస్తాయి. అలాంటి సూక్తికి పోలీసులు క్షేత్రస్థాయిలో తిలోదకాలిస్తున్నారనేందుకు సీఐ చిన్నగౌస్‌ వ్యవహారమే నిదర్శనం.


Updated Date - 2021-09-14T06:44:30+05:30 IST