నూలు బిల్లుంటేనే.. నేస్తం!

ABN , First Publish Date - 2022-08-06T05:06:00+05:30 IST

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు రివర్స్‌ గిఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది.

నూలు బిల్లుంటేనే.. నేస్తం!
చేనేత కార్మికుల వర్క్‌ షెడ్‌

ఈసారి చేనేత దినోత్సవానికి రివర్స్‌ కానుక

నూలు కొనుగోలు బిల్లు కావాలని ఆదేశాలు

దీంతో భారీగా తగ్గనున్న లబ్ధిదారులు

సగానికి సగం మందికి కోతపడే అవకాశం!

మూడు జిల్లాల్లో 50 వేల చేనేత కుటుంబాలు

ప్రస్తుతం  8 వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం

ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ఎత్తుగడ 

  

సంక్షేమ పథకాల కుదింపే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకంలో భారీ కోతలకు రంగం సిద్ధం చేసింది. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద చేనేత కార్మికులకు ఇచ్చే నేతన్న నేస్తాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత మూడేళ్లలో నిబంధనల వడపోతతో వేలాదిమందికి నేతన్న నేస్తాన్ని ఎగవేసిన ప్రభుత్వం మరోమారు కఠినమైన నిబంధనలను తెరమీదకి తెచ్చింది. ఈ ఏడాది నేతన్న నేస్తం రావాలంటే నూలు కొనుగోలు బిల్లులు ఉండాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. ఈ కారణంగా ఒక్కరికి కూడా నేతన్న నేస్తం వచ్చే అవకాశం లేదు. దీంతో కార్మికుల్లో ఆందోళన అలముకుంటోంది. 

 

గుంటూరు, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు రివర్స్‌ గిఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది. సవాలక్ష నిబంధనలతో నేతన్నలకు రావాల్సిన నేతన్న నేస్తంలో భారీగా కోతలు పెడుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 20 నుంచి 30 శాతం మంది ఈ ఏడాది నేతన్న నేస్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 16వేల చేనేత మగ్గాలు ఉన్నాయి. విభజిత గుంటూరు జిల్లాలోని మంగళగిరి, ఎర్రబాలెం, ఆత్మకూరు, తెనాలి, పొన్నూరులతోపాటు, పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, గణపవరం, సత్తెనపల్లి, బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు, పేటేరు, ఐలవరం, కనగాల, చెరుకుపల్లి, ఇసుకపల్లి, రాజోలులో పెద్దసంఖ్యలో చేనేత మగ్గాలు ఉన్నాయి. దీంతోపాటు బాపట్ల జిల్లాలో కలిసిన చీరాల డివిజన్‌లోని ఈపూరుపాలెం, వేటపాలెం, జాండ్రపేట, పందిళ్లపల్లి, చీరాల పరిసర ప్రాంతాల్లో మరో 20 వేల మగ్గాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో వీటిపై ప్రత్యక్షంగా ఆధారపడి సుమారు 40 వేల కుటుంబాలు, పరోక్షంగా ఆధారపడి మరో 10 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మాత్రమే నేతన్న నేస్తం దక్కుతోంది. 


ఆది నుంచి కోతలు.. కొర్రీలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరో వంతు మంది చేనేత కార్మికులకు మాత్రమే నేతన్న నేస్తం దక్కుతోంది. 2019లో పథకాన్ని ప్రారంభించిననాడు ఉమ్మడి గుంటూరులోని 17 వేల మంది నేతన్నలు ఉండగా 3,169 మందికి మాత్రమే నేతన్న నేస్తం అందించారు. పాత ప్రకాశం జిల్లాలో 25 వేల మంది చేనేత కార్మికులు ఉండగా వారిలో 7,451 మందికి మాత్రమే నేతన్న నేస్తం దక్కింది. ఆ మరుసటి ఏడాది నుంచి ఈ సంఖ్యను కూడా ప్రభుత్వం కుదించే పనిలో పడింది. ఏటేటా పెరగాల్సిన లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం ఏటా 10 నుంచి 15 శాతం తగ్గిస్తూ వస్తోంది. 300 యూనిట్ల కరెంటు వినియోగం ఉండకూడదు, షెడ్డులో మగ్గం నేయకూడదు అంటూ మెలికలు పెట్టి 2021 నాటికి ఈ సంఖ్యను భారీగా తగ్గించింది. ఫలితంగా అట్టడుగు చేనేత కార్మికులు, అసలైన లబ్ధిదారులు పథకానికి దూరమైపోయారు. దీంతో 2019లో 3,169గా ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2021 నాటికి 2,338కి తగ్గింది. ప్రకాశం జిల్లాలో కూడా ఈ సంఖ్య తగ్గడంతో లబ్ధిదారుల సంఖ్య ఐదువేలకు పడిపోయింది. ప్రస్తుతం మూడు జిల్లాల్లో ఉన్న 50 వేల చేనేత కుటుంబాలకుగానూ 8 వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం అందుతోంది. ఈ సంఖ్యను కూడా కుదించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది మరో కొత్త నిబంధనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 


నూలు కొనుగోలు బిల్లులు ఉండాలంటూ మెలిక

ఈ ఏడాది నేతన్న నేస్తం రావాలంటే నూలు కొనుగోలు బిల్లులు ఉండాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. ఈ కారణంగా ఒక్కరికి కూడా నేతన్న నేస్తం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చేనేత కార్మికులు అందరూ మాస్టర్‌ వీవర్స్‌(షావుకార్లు) వద్ద కూలీకి పనిచేస్తారు. వారికి యజమానులే పడుగు, పేక, నూలు, జరీ, మజూరీ(కూలీ) ఇస్తారు. దీంతో నూలు కొనాల్సిన అవసరంగానీ, కొనగల స్తోమతగానీ ఉండదు. అలాంటివారు నూలు కొనుగోలు బిల్లులు తీసుకురావడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగా నేతన్నలకు నేస్తం దాదాపు దక్కకపోవచ్చు. అయితే ఈ నిబంధన కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పాత లబ్ధిదారులు కూడా నూలు కొనుగోలు బిల్లు పెట్టాలని వలంటీర్లు, సచివాలయ సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేసే ఈ నిర్వాకం కారణంగా ఈ ఏడాది పాత లబ్ధిదారులు అనేక మంది నేతన్న నేస్తానికి దూరంకాక తప్పదని తెలుస్తోంది.  


నేతన్నలకు పొగపెడుతున్న ప్రభుత్వం..

ప్రభుత్వ తలకిందుల నిర్ణయాల కారణంగా అట్టడుగు పొరల్లో ఉన్న నిరుపేద చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే 80శాతం మందికి నేతన్న నేస్తం రావడం లేదు. ఇప్పుడు నూలు కొనుగోలు బిల్లు కావాలనడం చాలా దుర్మార్గం. యజమాని వద్ద కూలీకి నేసుకునేవాళ్ల దగ్గర నూలు బిల్లులు ఎలా వస్తాయి. ఈ నిబంధన కారణంగా నూటికి తొంభ్లై మంది నేతన్న నేస్తానికి దూరమవుతారు. ప్రభుత్వం నేతన్నలకు పొగపెడుతోంది. 

- పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఏపీ చేనేత కార్మిక సంఘం





Updated Date - 2022-08-06T05:06:00+05:30 IST