ప్రభుత్వ వైద్యం.. ప్రైవేటు ఔషధం..!

ABN , First Publish Date - 2022-05-05T03:21:29+05:30 IST

ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మందుల కొరత వేధిస్తోంది. వైద్యులు రాసిన మందులు బయట తెచ్చుకోవాలని చీటీ రాసి పంపుతున్నారు.

ప్రభుత్వ వైద్యం.. ప్రైవేటు ఔషధం..!
ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం

ఐవీ సెట్లు, ఇన్సులిన్‌ సిరంజ్‌లు, అస్థాలిన్‌ లేక ఇక్కట్లు

సర్జికల్‌ వస్తువులూ కొరతే..

బయట తెచ్చుకోవాలంటూ చీటీలు

వేధిస్తున్న మందుల కొరత

ఇది ఉదయగిరి సీహెచ్‌సీ దుస్థితి 

ఉదయగిరి రూరల్‌, మే 4: ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మందుల కొరత వేధిస్తోంది. వైద్యులు రాసిన మందులు బయట తెచ్చుకోవాలని చీటీ రాసి పంపుతున్నారు. దీంతో రోగులకు ప్రైవేటు షాపులకు పరుగులు తీస్తున్నారు. మెట్ట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఓ పక్క వైద్యుల కొరత, మరో పక్క మందుల కొరత వేధిస్తోంది. ఐవీ సెట్లు, ఇన్సులిన్‌ సిరంజ్‌లు, అస్థాలిన్‌ ద్రావణం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎండలు అధికం కావడంతో పలువురు వడదెబ్బకు గురై వైద్యశాలకు వస్తే సెలైన్‌ కట్టేందుకు ఐవీ సెట్లు లేక బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్‌ వేసేందుకు సిరంజ్‌లు, ఆయాసంతో వైద్యశాలకు వచ్చే రోగులకు నెబలైజర్‌లో వేసే అస్థాలిన్‌ ద్రావణం కూడా లేదు. ఇవన్నీ రోగులకు బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో వైద్యశాలకు రోగుల తాకిడి అధికంగా ఉంది. అయితే వైద్యులు, మందుల కొరత కారణంగా మెరుగైన వైద్యం అందడంలేదు.  

సర్జికల్‌ వస్తువులూ కొరతే...

కాన్పు కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్‌ చేయాల్సి వస్తే అవసరైన మందులు, గ్లౌజలు సైతం బయటే కొనుగోలు చేయాల్సిందే. వాటిని బయట కొనుగోలు చేయాలంటే సుమారు రూ.4 వేలు ఖర్చవుతోంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు సంబంధించిన మందులు సైతం కొంతకాలంగా రావడంలేదని వైద్యులే అంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలంగా కు.ని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. దీంతో మహిళలు ప్రైవేటు వైద్యశాలలో వేల రూపాయలు వెచ్చించి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మెట్ట ప్రాంతంలో ఉన్న వైద్యశాలలో వైద్యుల కొరత తీర్చడంతోపాటు రోగులకు మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.  


కొరత లేకుండా చూస్తాం

వైద్యశాలలో మందుల కొరత లేకుండా చూస్తాం. మార్చి బడ్జెట్‌ ముగియడంతో కొంతమేరకు మందులు, ఐవీ సెట్ల కొరత ఉండవచ్చు. ఇండింట్‌ పెట్టి ఉన్నారు. త్వరలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం. 

- రమే్‌షనాఽథ్‌, డీసీహెచ్‌ఎ్‌స, నెల్లూరు


Read more