Abn logo
Feb 8 2020 @ 01:11AM

అంతరిక్షంలో ఆమె జయకేతనం!

‘‘ఆకాశంలోకి ఎగరాలి... అంతరిక్షాన్ని చుట్టి రావాలి.... ఈ కల కననివారు ఉండరు. కానీ అది అసాధ్యమైన కల. అయితే నా విషయంలో ఆ స్వప్నం నిజమైంది. అంతేకాదు అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపిన మహిళగా నన్ను మరో ఎత్తులో నిలబెట్టింది. అందుకే నా ప్రయాణం  ప్రతి ఒక్కరి ప్రయాణం. వారి కలలనే నేను అంతరిక్షంలోకి మోసుకువెళ్ళాను’’ అంటున్నారు రోదసిలో  దాదాపు 11 నెలలు గడిపి భూమ్మీదకు తిరిగొచ్చిన వ్యోమగామి క్రిస్టినా కోచ్‌ ! 


‘‘అమెరికా మిచిగాన్‌ రాష్ట్రంలోని గ్రాండ్‌ ర్యాపిడ్‌ నేను పుట్టిన ఊరు. పెరిగింది మాత్రం మా నాన్న డాక్టర్‌ రోనాల్డ్‌ హమ్మోక్‌ సొంత ఊరైన ఉత్తర కరోలినాలోని జాక్సన్‌విల్లేలో. అమ్మానాన్న ప్రోత్సాహంతో ఎలక్ర్టానిక్‌ ఇంజనీరింగ్‌, భౌతిక శాస్త్రాల్లో రెండు బ్యాచిలర్‌ డిగ్రీలు చేశాను. గొడ్డార్డ్‌ స్పేస్‌ ఫైట్‌ సెంటర్‌ (జిఎస్‌ఎఫ్‌సి)లోని నాసా అకాడమీ ప్రోగ్రామ్‌లో కూడా గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తరువాత నాసా జిఎస్‌ఎఫ్‌సి లేబరేటరీలో ఎలకా్ట్రనిక్‌ ఇంజనీర్‌గా చేరిపోయా. నాసా చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా. ఆ క్రమంలో యునైటెడ్‌ స్టేట్స్‌ అంటార్కిటిక్‌ ప్రోగ్రామ్‌లో సహాయ పరిశోధకురాలుగా మూడున్నర ఏళ్ళపాటు ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ ఖండాల్లో క్లిష్టమైన వాతావరణాల్లో పని చేయడం నన్ను శారీరకంగానూ, మానసికంగానూ రాటుతేల్చింది. అనంతరం జాన్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీలో, నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్ఫెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఓఎఎ), అమెరికన్‌ సమోవా అబ్జర్వెటరీల్లో వివిధ హోదాల్లో పని చేశా. పరిశోధనలూ, ఉద్యోగ బాధ్యతల మధ్య తీరికలేకుండా ఉన్న నా జీవితం  ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది.


ఒక్కరికే చెప్పాలన్నారు...

నాసా 2011లో అస్ట్రోనాట్‌ గ్రూప్‌-21కుఅభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు 6,300 మంది దరఖాస్తులు పంపారు. అభ్యర్థుల నేపథ్యం, అర్హతలు తదితర అంశాల మీద లోతైన పరిశీలన చేసి, తుది ఎంపిక పూర్తి చేయడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ఆ కాలమంతా ఎంతో ఉత్కంఠ అనుభవించాను. చివరికి ఒక రోజు నాసా నుంచి నేను ఎంపికయ్యానని కాల్‌ వచ్చింది. అయితే ఈ సంగతి ఒక్కరికి మాత్రమే చెప్పాలని షరతు విధించారు. అప్పట్లో నా స్నేహితుడు, ఆ తరువాత నా భర్త అయిన రాబర్ట్‌కు ఈ సంగతి చెప్పాను. ఆ సమయంలో అతడి ముఖంలో కనిపించి ఆశ్చర్యం, ఆనందం నేను ఎప్సటికీ మరచిపోలేను. తుది జాబితాను నాసా అధికారికంగా ప్రకటించడానికి దాదాపు రెండు వారాలు పట్టింది. ఆ లోపు నా ఉద్వేగాన్ని దాచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 


అంత తేలిక కాదు...

మరో విశేషం ఏమిటంటే పురుషులతో సమానంగా మహిళలు ఎక్కువగా ఎంపికైన గ్రూప్‌ మాదే. క్లాస్‌-2-13లో నలుగురు పురుషులు, నలుగురు మహిళలం ఎంపికయ్యాం. అనంతరం రెండేళ్ళ శిక్షణ మాకు చాలా విషయాలు నేర్పింది. సీనియర్‌ వ్యోమగాములతో కలిసి పనిచేస్తూ, వారి అనుభవాలను తెలుసుకున్నాం. అంతరిక్షంలోకి వెళ్లడానికి అవసరమైన నిర్దిష్ట ప్రమాణాలు అందుకోవడానికి శ్రమించాం. మా శిక్షణ 2015లో పూర్తయింది. ఈ శిక్షణలో నాకు బాగా నచ్చిన అంశం స్పేస్‌ వాక్‌. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు. పూర్తి స్పేస్‌ షూట్‌ వేసుకొని ప్రాక్టీస్‌ చెయ్యడం భలేగా ఉంటుంది! అయితే అది అనుకున్నంత తేలిక కాదు. శారీరకంగా చాలా కష్టం. అలాగే అంతరిక్ష వాతావరణంలో మన శరీరంలో వచ్చే మార్పులను సమన్వయం చేసుకోవడం కూడా సవాలే!


ఇది ఊహించలేదు!

శిక్షణ పూర్తి చేసుకున్నాక ఎప్పుడెప్పుడు అంతరిక్షంలోకి వెళ్తానా? అని ఎదురు చూశాను. చివరకు అనుకున్న రోజు రానే వచ్చింది. చిన్నప్పటి నుంచీ నేను వ్యోమగామి కావాలనుకున్నాను. నా గదిలో స్పేస్‌ పోస్టర్లు అతికించుకొని రోజూ చూస్తూ ఉండేదాన్ని. ఆ కోరిక తీరబోతోందన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే ఎక్స్‌పిడిషన్‌ 59 బృందానికి నేను ఎంపికయ్యాను. లాంఛనాలన్నీ పూర్తయ్యాక, 2019 మార్చి 14న సోయుజ్‌ ఎంఎస్‌-12 స్పేస్‌ క్రాఫ్ట్‌ నింగిలోకి ఎగిరింది. నాతోపాటు మరో  ఇద్దరు ఉన్నారు. అంతరిక్ష కేంద్రంలో మాతోపాటు ఎక్స్‌పిడిషన్‌ 58కి చెందిన మరో ముగ్గురు కలిశారు. అంతరిక్ష కేంద్రంలో మేము అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేశాం. అంతరిక్షంలో మంటల వ్యాప్తి ఎలా ఉంటుంది, అక్కడ ఆహారం, నీటిని ఎలా సంరక్షించాలి, కాయగూర మొక్కలు ఎలా పెరుగుతాయి... మైక్రోగ్రావిటీ, అంతరిక్ష ప్రయాణాల ప్రభావం మూత్రపిండాలపై ఎలా ఉంటుంది తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. మాలో కొందరు గత ఏడాది జూన్‌లో భూమి మీదకు వచ్చారు. నేను ఎక్స్‌పిడిషన్‌ 60లో కొనసాగాను. ఎక్స్‌పిడిషన్‌ 61లో అంతరిక్ష కేంద్రానికి వచ్చిన మరో నాసా మహిళా వ్యోమగామి జెస్సికా మెయిర్‌, నేనూ కలిసి గత అక్టోబరులో స్పేస్‌ వాక్‌ చేశాం. అంతరిక్ష చరిత్రలో ఇద్దరు మహిళలు కలిసి ఒకేసారి స్పేస్‌ వాక్‌చేయడం అదే మొదటిసారి. మొత్తం ఆరుసార్లు- మొత్తం 42 గంటల 15 నిమిషాలపాటు స్పేస్‌ వాక్‌ చేశాను. మొదట ఆరునెలలు అనుకుంటే, దాదాపు 11 నెలలు నేను అంతరిక్షంలో ఉన్నాను. ఒకే మిషన్‌లో 328 రోజులు అంతరిక్షంలో ఉన్న తొలి మహిళ వ్యోమగామిగా నిలవడం అనేది నేను ఎన్నడూ ఊహించలేదు. దీని ద్వారా పెగ్గీ విట్సన్‌ రికార్డు అధిగమించడం కూడా ఆనందంగానే ఉంది. ఎందుకంటే వ్యోమగామిగా అనేక విషయాల్లో పెగ్గీ విట్సన్‌ నాకు మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత. ఈ గురువారం (ఫిబ్రవరి 7) భూమి మీదకు అడుగు పెట్టిన తరువాత అందరూ నన్ను అభినందిస్తూ ఉంటే నోట మాట రావడం లేదు. ఇన్నాళ్ళూ భూమిని మిస్‌ అయినందుకు బెంగగా ఉంటే, ఇప్పుడు అంతరిక్షాన్ని మిస్‌ అయినందుకు వెలితిగా అనిపిస్తోంది.’’


ఇదీ రికార్డు

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా సోవియట్‌ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరెష్కోవా (1963) చరిత్రకు ఎక్కారు. ఒకే విడతలో అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపిన వ్యోమగామిగా పెగ్గీ విట్సన్‌ (288) 2017లో నెలకొల్పిన రికార్డును 41 ఏళ్ళ క్రిస్టినా కోచ్‌ (328) అధిగమించానాన్‌వెజ్‌... పచ్చడి కావాల్సిందే!

ప్రత్యేకం మరిన్ని...