హైదరాబాద్‌ అస్తిత్వం చౌమహల్లా

ABN , First Publish Date - 2021-07-27T07:13:39+05:30 IST

చౌమహల్లా ప్యాలెస్‌ను ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తిస్తూ 2010లోనే యునెస్కో ప్రతిష్టాత్మకమైన ఆసియా పసిఫిక్‌

హైదరాబాద్‌ అస్తిత్వం చౌమహల్లా
1880లో రాజాదీన్‌దయాళ్‌ తీసిన చౌమహల్లా ప్యాలెస్‌

గరంలో యునెస్కో  ప్రత్యేక అవార్డు దక్కిన ఏకైక చారిత్రక కట్టడం

 2010లోనే  ‘ఆసియా పసిఫిక్‌ మెరిట్‌’ అవార్డు

 భాగ్యనగరంలో తొలి యూరోపియన్‌ నియో క్లాసికల్‌ శైలి కట్టడమంటున్న నిపుణులు


‘‘కాకతీయుల కళావైభవానికి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం దక్కిన వేళ చరిత్ర ప్రియులకు పరవశమే.! అత్యద్భుత శిల్పసంపదకు ఆలవాలమైన రామప్ప దేవాలయం ఖ్యాతి ఖండాంతరాలు దాటడం తెలుగు నేలకే గర్వకారణం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రామప్ప గుడికి గుర్తింపు లభించడం తెలంగాణ చరితకు లభించిన అరుదైన గౌరవం. ఈ సందర్భంగా పదేళ్ల కిందటే హైదరాబాద్‌ అస్తిత్వం చౌమహల్లా ప్యాలెస్‌ యునెస్కో ప్రత్యేక అవార్డును సొంతం చేసుకున్న సంగతినీ చరిత్ర అధ్యయనకారులు గుర్తుచేసుకుంటున్నారు.’’


హైదరాబాద్‌ సిటీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): చౌమహల్లా ప్యాలెస్‌ను ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తిస్తూ 2010లోనే యునెస్కో ప్రతిష్టాత్మకమైన ఆసియా పసిఫిక్‌ మెరిట్‌ అవార్డును ప్రదానం చేసింది. ఏడో నిజాం మనుమడు ముకర్రంజా బహదూర్‌ ఆధీనంలోని ఈ భవనంలోకి 2005 నుంచి సందర్శకులను అనుమతిస్తున్నారు. అందుకు ఐదేళ్లపాటు ముకర్రంజా సతీమణి ఎస్రా ప్రత్యేక నిపుణులతో భవన సముదాయానికి మరమ్మతులు చేయించారు. హైదరాబాద్‌ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన చౌమహల్లా 43 దేశాల్లోని చారిత్రక కట్టడాలతో పోటీపడిమరీ ప్రత్యేక పురస్కారానికి ఎంపికైంది. అలా తెలుగు నేలపై యునెస్కో ప్రత్యేక అవార్డును అందుకున్న తొలి కట్టడం చౌమహల్లా ప్యాలెస్‌ అంటారు ఇన్‌ట్యాక్‌ కన్వీనర్‌ అనూరాధారెడ్డి. 


చౌమహల్లా చరిత్ర..

భాగ్యనగర సిగలో కొలువుదీరిన అరుదైన రాజప్రాసాదం ‘చౌమహల్లా ప్యాలెస్‌’. ఈ నేలపై తొలి యూపోపియన్‌ నియో క్లాసికల్‌ శైలిలో నిర్మితమైన తొలి భవనం ఇదే అంటారు నిపుణులు. రెండో నిజాం సలాబత్‌ జంగ్‌ 1750లో చౌమహల్లా నిర్మానాన్ని ప్రారంభించారని చరిత్ర అధ్యయనకారులు చెబుతుంటారు. టెహ్నాన్‌లోని షాహే ఇరాన్‌ రాజభవనాన్ని పోలివుండే చౌమహల్లా కట్టడానికి చాలా ఏళ్లే పట్టింది. ఐదో నిజాం నాసిర్‌ ఉద్ధౌలా పాలనలో ముఖ్యంగా 1857-1869 మధ్యకాలంలో ప్యాలెస్‌ నిర్మాణం ముగిసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాలుగు మహళ్ల సమూహమే చౌమహల్లా. భవన సముదాయంలోని దక్షిణ ప్రాంగణంలో అఫ్జల్‌ మహల్‌, మహతబ్‌ మహల్‌, తన్వియత్‌ మహల్‌, అఫతబ్‌ మహల్‌ నిర్మాణాలున్నాయి. ఉత్తరం వైపున బారాఇమాంతోపాటు పొడవైన గదుల సమూహం, దాని ముందుర నీటి కొలను దర్శనిమిస్తాయి. నిజాం ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అక్కడే జరిగేవి. చౌమహల్లా కట్టడంలో మొగల్‌, పర్షియన్‌ నిర్మాణశైలిలోని గుమ్మటాలు కనిపిస్తాయి. 


రాజసం ఉట్టిపడే ఖిల్వత్‌..

చౌమహల్లాలోని ఖిల్వత్‌ ముబారక్‌ నిజాం ప్రభువుల రాజసానికి ప్రతీక. ఆసఫ్‌జాహీల అధికారిక కార్యక్రమాలతో పాటు మతాచారాలకు సంబంధించిన ఉత్సవాలనూ ఇదే హాల్లో నిర్వహించేవారు. పాలరాతితో నిర్మితమైన రాజ దర్బారులో నెలవైన తక్తే-నిషాన్‌(సింహాసనం)అదనపు ఆకర్షణ. అందులోని పంతొమ్మిది ఝామర్లను నిజాం ప్రభువులు బెల్జియం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు చారిత్రక అధ్యయనకారులు చెబుతుంటారు. అదే ఆవరణలోని క్లాక్‌టవర్‌, అతిథుల విడిది గదులు కౌన్సిల్‌ హాల్‌, రోషన్‌ బంగ్లా తదితర భవనాల సముదాయంతో కూడిన చౌమహల్లా సోయగాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవని చరిత్ర ప్రియుల అభిప్రాయం. ఈ నేల అస్తిత్వం ఉట్టిపడే చౌమహల్లా వైభవానికి పదేళ్ల కిందటే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రత్యేక అవార్డు దక్కడం నగరవాసులకు గర్వకారణం. 



Updated Date - 2021-07-27T07:13:39+05:30 IST