Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నిత్యమీనన్‌ నైస్‌ పర్సన్‌.. అందుకే ‘ఐ లవ్యూ బంగారం’ అన్నా

twitter-iconwatsapp-iconfb-icon
నిత్యమీనన్‌ నైస్‌ పర్సన్‌.. అందుకే ఐ లవ్యూ బంగారం అన్నా

ఛోటాకేనాయుడు.. దశాబ్దాలుగా తెలుగు తెరపై ‘కెమెరామన్’గా కనిపిస్తున్నారు. తనకున్న టాలెంట్‌తోనే కాబోయే భార్యను బుట్టలో వేసుకున్నానని చెబుతున్నారు. తాను మాట్లాడేంత స్వీట్ కాదనీ.. కెమెరా పట్టుకుంటే రూడ్‌గా ప్రవర్తిస్తానంటున్నారు. చెయ్యి లాగి ముద్దుపెట్టి.. లవ్ ప్రపోజ్ చేశానంటున్నారు. మొదటి అవకాశం ఇస్తానన్న దాసరి ఇవ్వలేదనీ, తర్వాత ఆయనతోనే ఎన్నో సినిమాలు చేశానంటున్నారు. ఎవరినయినా తాను లెక్కచేయనంటున్న ఛోటా కే నాయుడు... 12-06-2016 ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత, సినీ విశేషాలను పంచుకున్నారు.. ఆ వివరాలు..


ఆర్కే : నమస్కారం చోట కె నాయుడు గారు..

చోటా: అయ్యో, నాకు నమస్కారం వద్దు. మీరు చాలా ఫేమస్‌. అన్నిటికంటే మించి మీరు చాలా పవర్‌ఫుల్‌. మీరు కింద నుంచి ఎండీస్థాయికి ఎదిగారు. విత్ ఇన్‌ షార్ట్‌ టైమ్‌.. మీరీ స్థాయికి రావడం నాట్‌ ఎ జోక్‌. మీరంటే మాకు పాసినేషన్‌. కొంతమందిని చూసి ‘వీడు మగాడ్రా’ అనుకుంటాం. అలాంటి వాళ్లలో మీరొకరు. ఇది నిజం.


ఆర్కే : మీ పేరేంటి చోటా.కె.నాయుడు అని పెట్టుకున్నారు..

చోటా : మా అమ్మ పెట్టిందీ పేరు. మేము ఐదుగురం. నేను మూడోవాణ్ణి. నేనే ఆఖరనుకుందేమో ‘చోటా’ అని పెట్టింది అమ్మ. నా తరువాత చెల్లి (సందీప్‌ అమ్మ), తమ్ముడు శ్యామ్‌ కె నాయుడు (కెమెరామెన్‌) ఉన్నారు. నా అసలు పేరు కామిరెడ్డి.


ఆర్కే : మీ అసలు పేరు ఎందుకు వదిలేశారు?

చోటా : ఎందుకో ఆ పేరు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. మా తాతగారిపేరు వీరవెంకటస్వామి నాయుడు. చోటా అంటేనే ఇష్టం. అవకాశం వస్తే భిన్నమైన ఫోటోగ్రాఫర్‌ అవ్వాలనుండేది. నాకు అసిస్టెంట్‌ చక్రీ అని ఉండేవాడు. మౌంట్‌రోడ్‌లో అమెరికన్‌ లైబ్రరీకి తీసుకెళ్లాడు. వాడికి అందులో సభ్యత్వం ఉంది. ఒక పుస్తకంలోని లాస్ట్‌ సప్పర్‌ అనే పెయింటింగ్‌ చూపించాడు. అది నాకు నచ్చింది. చించేసి జేబులో పెట్టుకున్నాను. అది చూసిన నా ఫ్రెండ్‌ భయపడ్డాడు. ఎందుకంటే అది అమెరికన్‌ లైబ్రరీ. భద్రతాసిబ్బంది పట్టుకుంటే జైల్లోపెట్టేసేవాళ్లు. లైబ్రరీలో చూసిన ఆ పెయింటింగ్‌ ఇన్స్‌పిరేషన్‌తోనే .. నేను సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ‘క్రీస్తుజననం’ టీవీ సీరియల్‌లో ప్రజెంట్‌ చేశాను. ఆ టీవీ సీరియల్‌ తీసిన ఒకామె నాకు మరొక అవకాశం వచ్చింది. అప్పట్లో అవకాశం ఇచ్చిన ఆమె ఎవరో కాదు. ఇప్పుడు నా భార్య. పేరు సీతాదేవి.


ఆర్కే : మీ ఆవిడను ఎలా బుట్టలో వేసుకున్నారు?

చోటా : నాకున్న టాలెంట్‌తో.

 

ఆర్కే : కెమెరా టాలెంటా? బుట్టలో వేసుకునే టాలెంటా?

చోటా : రెండూ. నేను మాట్లాడేంత స్వీట్‌ కాదు. కెమెరా పట్టుకుంటే చాలా రూడ్‌గా ఉంటాను. పని పట్ల ఫోకస్డ్‌గా ఉండేవాణ్ణి. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. సీతాదేవిలో అపారమైన మంచి లక్షణాలు ఉన్నాయి. అందులోను ఆమె ప్రొడ్యూసర్‌. ఆమెను చూశాక లవ్వు పిఫ్టీ, స్వార్థం పిఫ్టీ ఉంటే జీవితంలో స్థిరపడవచ్చు అనుకున్నాను. ఆమె ఒక సీరియల్‌ను పద్మాలయలో తీస్తున్నారు. ఆ సీరియల్‌కు నేను కెమెరామెన్‌ను. ఒక సన్నివేశానికి జూనియర్‌ఆర్టిస్టులు అవసరమయ్యారు. వాళ్లు డబ్బులు ఎక్కువ అవుతాయని.. కూలీలకు బట్టలు వేసి షూట్‌ చేస్తున్నారు. ఆ బట్టలు మురికిగా ఉంటే.. నేను మధ్యలో లైట్‌లు ఫోకస్‌పెట్టాను. అది చూసిన సీతాదేవి ‘చోటా.. ఏంటీ లైటింగ్‌. నాకు లైటింగ్‌ ఏంటో చెప్పే కెపాసిటీ మీకుందా’ అనుకుంటూ సీరియస్‌గా వెళ్లి ‘మీరే చేసుకోండి’ అని కూర్చుంది. ఈగో. ఆ వయసు అలాంటిది మరి. అలా షూటింగ్‌లు చేసుకుని ఆవిడ ఇంటికి వెళ్లిపోయేది. నేను లాడ్జికి వెళ్లేవాణ్ణి.


ఆర్కే : మీ ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది..

చోటా : ఒక రోజు ఇంటికి వెళ్లి ఆవిడకు గుడ్‌నైట్‌ చెప్పి.. అటూఇటూ చూసి ఎవరూ లేరనుకున్నప్పుడు చెయ్యిలాగి.. ముద్దుపెట్టాను. ఐలవ్‌యూ చెప్పి టక్కున తలుపులేసి పారిపోయాను. తలుపులు ఎందుకు వేశానంటే లాగి చెంపదెబ్బ కొడుతుందేమోనని భయపడ్డాను (నవ్వులు). మళ్లీ ఆవిడ రియాక్షన్‌ లేదు. ఇంటికి వెళితే - ‘‘పొయ్యి పొయ్యి ప్రొడ్యూసర్‌కు ముద్దు పెట్టి అవకాశాలు పోగొట్టుకుంటావా?’’ అని తిట్టారు.


ఆర్కే : ఆ తరువాత ఆవిడ రియాక్షన్‌ ఏంటి?

చోటా : ఏమీ అనలేదు. కారులో వెళుతుంటే కాలు తొక్కడం, ఆవిడేమో ‘ఒళ్లు ఎలాగుంది’ అనేది. ఆవిడకు మంచి కబుర్లు చెబితే ఇష్టం. అయితే ఒక రోజు ఆమె అభిప్రాయం చెప్పింది. ‘సినిమావాళ్లు వేరు. మేము వేరు. ఇద్దరం సెట్‌ అవ్వాలంటే ఏడాది పడుతుంది. అదీ నీకు నిజంగా ప్రేమ అనేదే ఉంటే.. అంతవరకు వెయిట్‌ చెయ్యి. వేషాలు వెయ్యకు’’ అంది. ‘ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే.. వాళ్లది గుంటూరు. జాగ్రత్త’ అన్నారు నా స్నేహితులు. ఆఖరికి మా ప్రేమ ఫలించింది. సికింద్రాబాద్‌ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాం.


ఆర్కే : పెళ్లి అయ్యాక జీవితం ఎలా నడిచింది..

చోటా : దాసరినారాయణరావుగారి ‘విశ్వామిత్ర’ సీరియల్‌కు ఆఫర్‌ వచ్చింది. దానికి ఏడుగురు దర్శకులు. అంతమంది దగ్గర పనిచేయడం వల్ల బాగా నలిగాను. వాళ్లు గొప్ప వ్యక్తులు. అయితే ఆ వయసులో నాకు నస అనిపించింది. గునపాలు పెట్టి పెట్టి నలిపేశారు.


ఒక రోజు కోపమొచ్చి కెమెరా వెనకాల కేబుల్‌ కట్‌ చేశాను. సీరియల్‌ అయ్యాక ‘వీడు ఎవడిమాట వినడు’ అని ఎవరో ఫిట్టింగ్‌ పెట్టేశారు. దాంతో సినిమాకు మొదటి అవకాశం ఇస్తానన్న దాసరినారాయణరావుగారు ఇవ్వలేదు. (ఆ తరువాత మళ్లీ ఆయనతోనే ఎన్నో సినిమాలకు చేసే అవకాశం వచ్చింది) ఎందుకంటే అంతకు మునుపు ‘నీకు గురువుగారు సినిమాలో అవకాశం ఇస్తారు’ అని ఆ సీరియల్‌ దర్శకులు చెప్పేవారు. అది నమ్మాను.

 

ఆర్కే : మీ బ్యాగ్‌గ్రౌండ్‌ అంతంత మాత్రమే. అంత పొగరు ఎందుకొచ్చింది..?

చోటా : ఏంటో నా మీద నాకు నమ్మకం. మొండి ధైర్యం. అదేమిటో నాకు తెలియదు. మీ విషయాన్నే తీసుకోండి. మీరడిగిన క్వశ్చన్‌నే మీకు రిపీట్‌ చేస్తున్నాను. మీరు ఎక్కడ ఎలా ఉన్నా డైరెక్ట్‌గా మాట్లాడేస్తారు. అది మీకెలా వచ్చింది. బ్లడ్‌ అయ్యుండొచ్చు. అమ్మానాన్నాల నుంచి వచ్చి ఉండొచ్చు. అది విల్‌పవర్‌ అయ్యుండొచ్చు. నా పర్సనాలిటీ కూడా అలాంటిదే. బహుశా నాది కుర్రవయసేమో అందుకే అలా ఉన్నాను. ఆ టైమ్‌లో దాసరిగారి దగ్గరికి వెళ్లి ‘సార్‌, మీరు నా గురించి ఎవరు ఏమి చెప్పినా వినకండి. నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని. మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించండి’’ అని చెప్పాను.


ఆర్కే : దాసరిగారు మీకు ఎలా పరిచయం?

చోటా : మా నాన్న నాటక రచయిత, దర్శకుడు. దుర్గాఆర్ట్స్‌ బ్యానర్‌తో నాటకాలు వేసేవారు. ఒక చేతిలో సిగరెట్‌, మరొక చేతిలో టీ ఉండేది. రావుగోపాలరావు, నూతనప్రసాద్‌ ఆయనకు మంచి స్నేహితులు. అప్పట్లో వాళ్లిద్దరికంటే మా నాన్న స్థితిమంతుడు. అప్పట్లో నేనొక చెత్త పని చేశాను. టెన్త్‌ అయిన తరువాత కొత్తపేట వెళ్లాను. ‘మరోచరిత్ర’ విడుదల అయ్యింది. సత్యనారాయణ థియేటర్‌లో నేల టికెట్టు కొని చూశాను. సినిమా చూసి బాగా ఫీలయ్యాను. మళ్లీ చూడాలనుకుంటే డబ్బులు లేవు. దాంతో థియేటర్‌ గేట్‌మెన్‌గా జాయినయ్యాను. షోకు యాభై పైసలు ఇచ్చేవారు. ఒక వైపు డబ్బులు, మరోవైపు సినిమా చూసే అవకాశం వచ్చింది. అదే సమయంలో ఎవరో నన్ను చూసి ‘చిట్టిబాబుగారి అబ్బాయేంటి.. థియేటర్‌లో పనిచేయడమేంటి’ అన్నారు. ఆ విషయం నాన్న దృష్టిలో పడింది. దాంతో బెల్టు తీసుకుని నాన్న చితకబాదేశారు. కొన్నాళ్లకు టెన్త్‌ గణితం ఫెయిలయ్యాను.

 

అప్పుడు నాన్న ‘ఒరే నువ్వు పాసయితే మద్రాసు పంపిస్తాను’ అన్నారాయన. వెంటనే బాగా చదివి పాసయ్యాను. శీనువైట్ల మేనమామ ప్రొడ్యూసర్‌గా ‘బడాయిబాసు’ తీస్తున్నారప్పుడు. బోయన సుబ్బారావు దర్శకులు. కేఎస్‌ మణి కెమరామెన్‌. మణిగారికి జాండీస్‌ వచ్చి తన అసిస్టెంట్‌ను కెమెరామెన్‌గా పంపించారు. తెలిసిన వాళ్ల ద్వారా ఆ షూటింగ్‌కు పనిచేసే అవకాశం వచ్చింది. ఇరవై రోజులు పనిచేశాను. ఆ తరువాత రావుగోపాలరావుతో మాట్లాడారు నాన్న. ‘శంకరాభరణం’, ‘కలియుగరావణాసురుడు’ వంటి చిత్రాలతో ఆయన పీక్‌ స్టేజ్‌లో ఉన్నారు. ‘‘మీ వాణ్ణి మద్రాసుకు పంపించు. నేను చూసుకుంటాను. బాలు మహేంద్ర దగ్గర వదులుతాలే’’ అన్నారు రావుగోపాలరావుగారు. దాంతో నేను మద్రాసుకు వెళ్లిపోయాను.


ఆర్కే : మద్రాసు వెళ్లిన తరువాత సినిమా కష్టాలు పడ్డారా..

చోటా : మద్రాసు వెళ్లాక రావుగోపాలరావును కలిసే అవకాశమే రాలేదు. ఆయన ఇంటికి వెళితే ‘రాత్రి షూటింగ్‌కు వెళ్లొచ్చారు. ఉదయాన్నే రండి’ అనేవారు. ఉదయాన్నే వెళితే ‘ఇప్పుడే షూటింగ్‌కు వెళ్లిపోయారు’ అనేవారు. మరీ పొద్దున్నే వెళితే ‘ఈ టైమ్‌లో వచ్చారేమిటి’ అనేవాళ్లు. అయితే ఇంట్లో రావుగోపాలరావుగారు ఉన్నారో లేరో కూడా తెలిసేది కాదు. ఆ రోజుల్లో జరిగిన ఆ సంఘటనలను ‘కొత్తబంగారులోకం’ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు రావుగోపాలరావుగారి కొడుకు రావురమేష్‌తో సరదాగా చెప్పాను. మళ్లీ పాతసంగతికి వస్తే - నూతన్‌ప్రసాద్‌గారు వాహినీ స్టూడియోకు రమ్మన్నారు. వెళితే గేటు దగ్గరే ఆపేశారు. సెక్యూరిటీ కళ్లు తప్పించి స్టూడియోలోకి వెళ్లాను. అంత శ్రమపడి వెళితే షూటింగ్‌ క్యాన్సిల్‌ అయ్యింది. సెక్యూరిటీ వ్యక్తి నన్ను అడ్డుకుని గొడవ పడితే బస్సు టికెట్‌ కోసమని ఉంచుకున్న ఇరవై పైసలు వాడికి ఇచ్చేసి.. రూమ్‌కు నడచుకుంటూ వచ్చాను.

ఆర్కే : డబ్బులులేవు కదా! మీకు ఎట్లా గడిచేది..

చోటా : మా అన్నయ్య కన్యాకుమారిలో ఉద్యోగం చేసేవారు. రెండొందలు పంపిచేవారు. అరవై రూపాయలు బ్యాంకులో దాచుకునేవాణ్ణి. ఏడాదిపాటు డబ్బులు పంపించాడు అన్నయ్య.


ఆర్కే : సినిమా అవకాశాల కోసం అన్వేషణ మొదలుపెట్టారా?

చోటా : మద్రాసులో రావుగోపాలరావు, నూతన్‌ప్రసాద్‌లు దొరకలేదు. దాంతో దాసరినారాయణరావుగారి ఇంటికి వెళ్లాను. ఆ ఇంటికి ఎదురుగ్గానే ఎన్టీఆర్‌ ఇల్లు ఉండేది. ఆ రోడ్డు రాత్రిపూట కూడా సందడిగా ఉండేది. దాసరిగారు మూడింటి వరకు పడుకునేవారు కాదు. ఎన్టీఆర్‌ అదే మూడింటికి నిద్ర లేచేవారు. ఆయన ఇంటిముందు తిరుపతి బస్సులు కనిపించేవి. దాసరిగారిని కలిసి పరిస్థితి చెప్పాను. దేవర ఫిలిమ్స్‌లో అవకాశం ఇప్పించారాయన. మా నాన్నగారి నాటకాల్లో వేషాలు వేసే ఒకామె సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు వచ్చింది. ఆమె ఇంట్లోనే కొన్నాళ్లు ఉండేవాణ్ణి. సినిమా వర్కర్ల యూనియన్‌లో మెంబర్‌షిప్‌ వచ్చింది. లక్కీగా బాలు మహేంద్రతో పనిచేసే అవకాశం వచ్చింది.

 

ఆర్కే : హేమాహేమీల సినిమాలకు చేశారు కదా! టెన్షన్‌ ఫీలయ్యారా..?

చోటా : ఎటువంటి టెన్షన్‌ ఫీలవ్వలేదు. దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ అందరి సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశాను. నా అదృష్టం. 24 క్రాఫ్ట్స్‌ మీద కమాండ్‌ తీసుకుంటాను.


ఆర్కే: దుందుడుకు స్వభావానికి ఎదురుదెబ్బలు తగల్లేదా?

చోటా: తగిలాయి కానీ అవి నన్నెంతో ఎత్తుకు ఎదిగేట్లు చేశాయి. జయభేరి కిషోర్‌, మురళీమోహన్‌ గారు నాకు క్లోజ్‌. వారి బ్యానర్‌లో ‘వారసుడు’ సినిమా షూటింగ్‌ చేస్తున్నా. సెకండ్‌ షెడ్యూల్‌ టైంలో బి.గోపాల్‌ గారి బ్రదర్‌ మేనేజర్‌గా వచ్చారు. ఆ బ్యానర్‌కి ఆయన భక్తుడు. ‘వారసుడు’ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో జరుగుతోంది.


మంటల మధ్యల్లో నాగార్జున గారు చిక్కుకున్న సీన్‌ తీయటం కోసం ఓ లెన్స్‌ కావాలని సుబ్బారావుగారిని అడిగాను. ఏమాత్రం ఆలోచించకుండా లేదన్నారు. వెంకటేష్‌ షూటింగ్‌లో ఉన్న ఆ లెన్స్‌ పగలు ఖాళీగా ఉందని తెల్సుకున్నా. ఆ విషయం మేనేజర్‌తో చెప్తే తన ఇగో హర్టయ్యింది. మా ఇద్దరికీ ఘర్షణ. ఆయన్ని కొట్టబోయాను. ఇంతలో నిర్మాత కిషోర్‌గారి కారొచ్చి మా ముందు ఆగింది. ఆయనకు సిచ్యువేషన్‌ అర్థమై కూల్‌గా మేనేజ్‌ చేశారు. ఆ సినిమా రిలీజ్‌ అయింది.

 

ఎవరి పనిలో వారున్నాం. పోకూరి బాబూరావు గారొచ్చి సినిమా చేసి పెట్టమన్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. వారంరోజుల తర్వాత పోకూరి బాబూరావు గారు కాల్‌ చేసి ‘కెమెరామన్‌ను మార్చమని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ఇంకోసినిమాకు పనిచేద్దాం’ అన్నారు. ‘అలాగే’ అంటున్న మనసులో మాత్రం ఎలకి్ట్రకల్‌ రైల్లు పరిగెడుతున్నాయి. చివరికి తేలిందేంటంటే సుబ్బారావుగారు పోకూరి బాబూరావు గారి ఆఫీసుకు వెళ్లారట. ‘చోటాకు నోటి దురుసెక్కువ’ అన్నారట. నన్ను ఆ సినిమా నుంచి తీసేయటానికి కారణమదే. ఆయనతో గొడవపడటం వల్ల అలా జరిగింది. మూడురోజులు ఫీలయ్యాను. ఆ తర్వాత ఖాళీగాలేను. రాఘవేంద్రరావు, కాంత్రికుమార్‌ గారి సినిమాలు చేశాను.

 

ఆర్కే: మాటపారేసుకునే మీకు ఇదంతా సుడే అనమాట?

చోటా: సుడే అనుకోవచ్చు. నా హంబుల్‌నెస్‌, సిన్సియారిటీ కావొచ్చు.

 

ఆర్కే: నోరుజారితే కష్టమే కదా?

చోటా: ఓసారి ‘ఠాగూర్‌’ మధు ‘ఇది చెత్తబాస్‌’ అన్నాడు. నాలుకను చెత్త అన్నాడు. ఆరోజు ఆయన సరదాగా అన్నారు. అప్పటినుంచీ చెత్త మాట్లాడటం తగ్గించా. 70 శాతం కోపం తగ్గింది.

 

ఆర్కే: హిపోక్రసీ ఇండస్ట్రీలో ఎక్కువ కదా?

చోటా: అదొక్కటే నాకు నచ్చనిది. బాంబేకు వెళ్లకపోవటానికి రీజనదే. ఏమి చేసినా వారు ‘మైండ్‌ బ్లోయింగ్‌’ అంటారు. షూటింగ్‌ తర్వాత రాజు ఎవరో, రెడ్డి ఎవరో. మనం ఫోన్‌ చేస్తే వాళ్లింటికి తీసుకెళ్లరు. వారి హాస్పిటాలిటీ కూడా నచ్చదు. ఇక్కడ అలాంటి వారు తగిలారు. అలాంటి వారు అర్థమవుతారు. అలాంటి వారితో ట్రావెల్‌ చేయను. నాకు నచ్చితే ప్రేమిస్తాను.

 

ఆర్కే: కొన్నిచోట్ల తగ్గాలనిపిస్తే తగ్గాలి కదా?

చోటా: ఆ విషయంలో నేను గొప్ప మ్యాన్‌ప్లేటరన్‌. అక్కడ కోపం వస్తుందంటే, ఆగి చెబుతా.

ఆర్కే: మిమ్మల్ని హీరోయిన్లు కూడా ఇష్టపడతారట?

చోటా: అమ్మాయిలంటే ఇష్టంలేని ఎవరుంటారు చెప్పండి. హీరోయిన్లు ఎక్కువగా మిస్టేక్స్‌ చేస్తుంటారు. ఆలస్యంగా షూటింగ్‌ వస్తుంటారు. ఫ్యామిలీనంతా వదిలేసి ఓ ఆడపిల్ల బతకాడినికి వచ్చింది కదా అనుకుంటా. అందుకే కోపం తగ్గుతుంది. ఎండతగలడం, గాలి వీచినపుడు జుట్టు పాడైపోతుందేమోనని ముందే జాగ్రత్తలు చెప్పటం.. ఇలా హీరోయిన్స్‌ గురించి ఎక్కువగా కేర్‌ తీసుకుంటా. అది చూసి కొందరు అలా మాట్లాడి ఉండొచ్చు.. వాస్తవానికి హీరోపైనే నా కాన్సన్‌ట్రేషన్‌ ఎక్కువ. సరైన సమయానికి నిద్రపోయి, లేస్తున్నారా అని అడిగి తెల్సుకుంటా. వారు నటించే సన్నివేశాల్లో రిస్క్‌ ఉంటే ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటా. హిడెన్‌కేర్‌ అనమాట. ఇలా ఏ కెమెరామన్‌ చేయడు. నేను పనిలోకి దిగితే సుపీరియారిటీ కాంప్లెక్స్‌, నేను పుడింగి అని ఫీలవ్వను.

 

ఆర్కే: నిత్యమీనన్‌ను ఓ ఫంక్షన్‌లో లవ్‌ యూ బంగారం అన్నారు కదా?

చోటా: హీరోయిన్లను నేను డార్లింగ్‌ అని పిలుస్తుంటా. అదో ఎంకరేజ్‌మెంట్‌. ఓసారి నిత్యమీనన్‌కు నీ ఫ్యాన్‌అని కింద నాపేరు రాసి మెసేజ్‌ పెట్టా. ఆమె స్పందించలేదు. నాకు కాలింది. ‘అల్లుడుశీను’ షూటింగ్‌ జరుగుతోంది. పక్కన గుణశేఖర్‌ షూటింగ్‌ ‘రుద్రమదేవి’ జరుగుతోంది. నిత్యతో మాట్లాడలేదు. వెంటనే గుణశేఖర్‌ ‘చోటూ.. నిత్యతో మాట్లాడలేదేం. అమ్మాయిలతో నువ్వు బాగా మాట్లాడతావు కదా’ అన్నాడు. ‘నిత్యకు పొగరు’ అన్నాను. గుణశేఖర్‌ పరిచయం చేస్తే ‘హాయ్‌’ అంది నిత్య. ఆమె నా ముందు నిలబడనందుకు నాకు కోపమొచ్చింది. ఆమె తప్పుకూడా లేదు, తన పనిలో తనుంది. ఆ తర్వాత ‘ఒక అమ్మాయి తప్ప’ సినిమాకు నిత్య డేట్స్‌ ఇచ్చింది. నాకు నచ్చలేదు కాబట్టి ఆమెతో కలిసి పనిచేయనన్నాను. లొకేషన్‌లోకి వచ్చాక ఆమె మాటలకు, ఆటిట్యూడ్‌కు ఫ్లాటయ్యాను. ‘ఓకే బంగారం’ సినిమా చూసి నిత్యను ఫ్యానయ్యాను. ఆమెతో మా సినిమాకు షూటింగ్‌ చేసినన్నాళ్లు హ్యాపీగా ప్రయాణం సాగింది. నిత్య నైస్‌ పర్సన్‌. అందుకే ‘ఐ లవ్యూ బంగారం’ అన్నాను. పెళ్లై ముప్పయేళ్లు అయ్యాక అలా అంటే తప్పేంటీ?

 

ఆర్కే: మీ ఆవిడకు అభ్యంతరం లేకుంటే, నాకెందుకు?

చోటా: ఒకటి రెండుసార్లయితే పర్లేదు. అలాగే మాట్లాడుతుంటే నా నైజం అనుకుని వదిలేస్తుందంతే. ఆవిడకు అన్యాయం జరగనంత వరకూ సమస్యలేదు. ఆమె గూఢాచారి 116. నా బాడీలాంగ్వేజ్‌ను బట్టి నేను ఎక్కడికి వెళ్తున్నానో చెబుతుంది (నవ్వులు).


ఆర్కే: సందీప్‌కిషన్‌ను ఎందుకు తెచ్చారు?

చోటా: నా తమ్ముడు సెటిలయ్యాడు. మాకు వారసుడు కావాలి కదా అని సందీప్‌ కిషన్‌ను తీసుకొచ్చా. ‘మామా’ ఎవరోకరిని కలిపించమని మేనల్లుడు అడుగుతుంటే, కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. ముందువన్నీ తెలిసొస్తున్నాయి.


ఆర్కే: మీరు దర్శకత్వం చేయచ్చు కదా? 

చోటా: గోపాల్‌రెడ్డి, పీసీ శ్రీరామ్‌, సంతోష్‌ శివన్‌.. లాంటి కెమెరామెన్స్‌ డైరక్టర్‌గా పని చేశారు. ఎవరూ నిలబడలేదు. తేజ డైరక్టర్‌గా నిలబడుతున్నాడనే ముందు అలా అయ్యాడు. పొరబాటున నేను డైరక్షన్‌ సినిమా చేసి ఫ్లాపయితే నన్నెవరూ పట్టించుకోరు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. కెమెరామన్‌గా చేయటం వల్ల కొత్తకొత్త దర్శకులతో పనిచేసే అవకాశాలు వస్తున్నాయి కదా.

 

ఆర్కే: మీ లక్ష్యం డైరక్టర్‌ కాదనమాట?

చోటా: దర్శకుడు కన్న కలను, ఫీల్‌ను.. ఆయన అనుకున్నట్లు సెల్యూలాయిడ్‌పై చూపించటం మా పని. నాకెలాంటి అశల్లేవు. భవిష్యత్తులో ఇంకా మంచి కెమెరామన్‌ అనిపించుకోవాలంతే. ‘చోటా’ రిలాక్సయిపోయాడని ఎవరూ అనకూడదు. ఇపుడెంత టెక్నాలజీ వచ్చినా, స్కిల్స్‌ ముందు అన్నీ దిగదుడుపే. తెలుగునేల మీద కెమెరామన్‌గా చోటాను కొట్టే మగాడు ఇంకా రాలేదు. వస్తే చూస్తా.


‘అమ్మా రాజీనామా’ సినిమాకు ఆర్ట్‌ డైరక్టర్‌ భాస్కరరాజు పనిచేశారు. ఆయన లెజెండ్‌. గ్రే కలర్‌లో సెట్టింగ్‌ ఉండాలని చెప్పాను. తీరా షూటింగ్‌ రోజు వెళ్లిచూస్తూ వేరే రంగుఉంది. చిన్నాపెద్దా చూసుకోకుండా ఆ పెద్దాయనమీద కయ్యుమన్నా. అశ్వినీదత్తుగారు ‘ఏమిటి నీ సమస్య’ అని అడిగారు. ‘నేను అడిగిన కలర్‌ వేయలేదు సర్‌’ అన్నారు.

 

గ్రేలో పధ్నాలుగు రకాల కలర్స్‌ ఉన్నాయి. ఆ కలర్‌ను అప్పట్లో మెర్జ్‌ చేయటం రాలేదాయనకు. ఇప్పుడు గ్రాఫిక్స్‌లో అయితే ఏమైనా చేసుకోవచ్చు. మొత్తానికి అప్పటి ఆయన ఎక్స్‌పీరియన్స్‌కు అది కరెక్ట్‌, నేనపుడు యంగ్‌ జనరేషన్‌ కాబట్టి అదే కావాలని, ప్రయోగం చేద్దామని నా వరకూ అది కరెక్ట్‌. అలా గ్రే కలర్‌పై గొడవ జరిగింది.

 

నా బెడ్‌రూమ్‌ నాకు బెస్ట్‌ హోమ్‌థియోటర్‌.


నాకు లగ్జరీ కార్లంటే ఇష్టం. ఆడి కారు వాడతాను. జిమ్‌ తర్వాత నా కారును నేనే క్లీన్‌ చేసుకుంటాను.


మా కూతురు పెళ్లయ్యింది. తనది ప్రేమపెళ్లి. మా అల్లుడు బిల్డర్‌. కుటుంబపరంగా హ్యాపీ.

 

సందీప్‌కిషన్‌ నా మేనల్లుడని ఏ కథవస్తే ఆ కథ తనతో చేయించాలనుకోను. ఆ కథ శర్వానంద్‌కు నప్పుతుందనుకుంటే అతనికి ఫోన్‌ చేసి చెబుతాను. పనిలో మాత్రం మేనల్లుడైనా ఆలస్యంగా వస్తే మాత్రం క్షమించను. తప్పు తప్పే కదా!


‘‘ ఒక రోజు షూటింగ్‌లో ఉన్నప్పుడు సాయికుమార్‌ తల్లి నన్ను పిలిచి ‘‘నీది ఏ ఊరు బాబూ’’ అంది. ‘‘కాకినాడ దగ్గర పల్లెటూరు’’ అని చెప్పాను. ‘ భవిష్యత్తులో నువ్వు చాలా పెద్దోడివి అవుతావు’ అంది. వెంటనే ఆమె కాళ్లమీద పడ్డాను. ఇది నా కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన అనుభవం’’


‘‘ఎన్టీఆర్‌, ప్రతాప్‌ సి రెడ్డి, మా మామ (భార్య నాన్న) గారు చెన్నైలోని స్టాలినీ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు రూమ్‌మేట్స్‌. మా ఆవిడ చిన్నప్పటి నుంచి వీళ్లందరినీ చూసింది. ప్రతాప్‌ సి రెడ్డి లాగ నా పేరు కూడా ఉండాలని ఒక రోజు ఎయిర్‌పోర్టులో చోటా కె నాయుడు అన్న పేరు రాసింది. పెళ్లి కాక ముందు జరిగిన సంఘటన ఇది. నా తొలి ఫ్లయిట్‌ టికెట్‌ కూడా ఆవిడ కొనిపెట్టిందే. ఆ రోజు ఎయిర్‌పోర్టులో రాసిన పేరే ఆ తరువాత స్థిరపడింది.’’

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకం Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.