ఉత్తమ వీసీల ఎంపిక ముఖ్యం

ABN , First Publish Date - 2020-09-03T08:14:54+05:30 IST

మరో పదిహేను రోజుల్లో విశ్వవిద్యాలయ వైస్ చైర్మన్ల (వీసీల) నియామకాలు జరగబోతున్నాయని వినికిడి. ఈ సందర్భంగా కొన్ని సూచనలు. ఏ ఉన్నత పదవికైనా...

ఉత్తమ వీసీల ఎంపిక ముఖ్యం

మన విశ్వవిద్యాలయాలకు ఒకప్పుడు రాధాకృష్ణన్‌, సి.ఆర్‌.రెడ్డి, లక్ష్మణస్వామి మొదలియార్‌ లాంటి ఉద్దండులు వీసీలుగా ఉండేవారు. ఇపుడేరీ అలాంటి వారు? అలాంటివారు దరఖాస్తులు పెట్టుకోరు వీసీ పోస్టులకు. అసలా దరఖాస్తులు కోరే సంస్కారమే అనుచితం కాదా? గవర్నమెంట్‌ వద్ద యోగ్యుల వివరాలు ఉండాలి, ఉంచాలి, సేకరించాలి, వారినుండి ఎంపిక చేసుకోవాలి కాని దరఖాస్తులు కోరడమేమిటి?


మరో పదిహేను రోజుల్లో విశ్వవిద్యాలయ వైస్ చైర్మన్ల (వీసీల) నియామకాలు జరగబోతున్నాయని వినికిడి. ఈ సందర్భంగా కొన్ని సూచనలు. ఏ ఉన్నత పదవికైనా మూడు అర్హతలు అవసరం. వీసీ లాంటి పదవికి అవి మరీ అత్యవసరం. ఒకటి టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్‌. అంటే ఆ రంగానికి చెందిన సాంకేతిక సారస్వత అర్హత. రెండవది అనుభవం. మూడవది సోషల్‌ ఇమేజ్‌. అంటే సంఘంలో పలుకుబడి, ప్రతిష్ఠ. నీతి నిజాయితీ, నిష్పక్షపాతానికి చెందిన మంచి పేరు. ఈ మూడు ఏ ఉన్నత పదవికైనా అవసరమే కాని ఒక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవికి మరీ అవసరం.


ఈనాటి వీసీలకు ఎండోమెంట్స్‌ ద్వారా, సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోర్సుల ద్వారా వనరులు రాబట్టుకోవడం కూడా ఒక అత్యంత అవసరమైన అర్హతగా భావించాలి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ భాగం ఆర్థిక అవసరాలను ఆ విధంగానే తీర్చుకుంటారు. ప్రభుత్వ నిధులపైన పూర్తిగా ఆధారపడరు. వీసీ పదవికి మరొక అర్హత అతడు మంచి వక్త, రచయిత కావడం. రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా మేధావి అనే కీర్తి గడించడం. విద్యాపరమైన అర్హత, అనుభవం అనేవి కొంతవరకే అక్కరకొస్తాయి. ఇవి రెండు సమపాళ్లో ఉండేవారి సంఖ్య ఎప్పటికీ అరుదే. బాగా చదువుకున్న వాళ్లు చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు. అహం, ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. కాని వ్యవస్థల్లో పని చేసేవారికి చాలా ఓపిక, సంయమనం, నిబ్బరం అవసరం. చాకచక్యం కూడా. ఎప్పుడైతే వారు సమస్యలను ఎదుర్కొంటారో అపుడు అవి బైట పడతాయి– వాటిని పరిష్కరించుకున్న విధి విధానాలను బట్టి.


విశ్వవిద్యాలయాలకు తగినన్ని వనరులు సమకూర్చుకోవడం ఒక సమస్య. ఇపుడు అదే అతి పెద్ద సమస్యగా మారుతోంది. ఒకప్పుడు తగినన్ని వనరులు ప్రభుత్వం సమకూర్చేది. వీసీలు వనరుల కోసం సెక్రెటేరియట్‌ చుట్టూ తిరగవలసిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఆ అవసరం చాలా పెరిగిపోయింది. వీసీలు ప్రభుత్వం చుట్టూ తిరిగి ఆదాయం పెంచుకోవటమే ప్రధానమైన పనిగా మారుతోంది. రెండవది, విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండేలా చూడటం. అలాగే స్టాఫ్‌లో క్రమశిక్షణ కూడా. ఇరు వర్గాలకు శక్తివంతమైన యూనియన్‌ నేపథ్యం ఉంటుంది కనుక, విద్యాభివృద్ధి, పరిశోధనాభివృద్ధి వంటి అసలు పనుల కన్నా ఈ పనులు ఎక్కువైపోతున్నాయి. అందుకే విశ్వవిద్యాలయాలు ఎంత మేరకు విద్యా వికాస, పరిశోధన అభివృద్ధికి పాటుపడాలో అంతగా పాటుపడలేకపోతున్నాయి. వీసీ అనేవాడు ఒక నాయకుడు కావడానికి బదులు ఒక మేనేజర్‌ లాంటివాడైపోతున్నాడు. విద్యాసంబంధమైన మేధో సంబంధమైన పనులు కొరవడుతున్నాయి. ఫలితంగా విశ్వవిద్యాలయాలు వాటి ప్రతిష్ఠ కోల్పోతున్నాయి. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలో చాలాచోట్ల అకడమిక్‌ విభాగానికి ఒక వీసీ ఉంటాడు. పరిపాలానా విభాగానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. వీసీ విద్యాసంబంధమైన విషయాలను మాత్రమే చూసుకుంటాడు. పరిపాలానా విభాగం అధ్యక్షుడు పాలనాపరమైన అంశాలను చూసుకుంటాడు. మన దగ్గర కూడా రిజిష్ట్రార్ విశ్వవిద్యాలయాల నిర్వహణ అంశాలను చూసుకోవచ్చు. వీసీని వాటినుంచి విముక్తుణ్ణి చేయవచ్చు. ఈసీ పదవి ఉంటుంది కనుక ఇరువురి మధ్య ఏమైనా బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవచ్చు. లేక రెక్టార్‌ అనే పదవిని సృష్టించి అతడికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పవచ్చు. వీసీ మీద పరిపాలనా పరమైన ఒత్తిడి తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది.


ఒకనాడు మన విశ్వవిద్యాలయాలకు రాధాకృష్ణన్‌, సి.ఆర్‌.రెడ్డి, లక్ష్మణస్వామి మొదలియార్‌ వంటి ఉద్దండులు వీసీలుగా ఉండేవారు. అలాంటి వారు ఇపుడేరీ? అటువంటి వారికోసం ఇంటా బైటా వెతకాల్సి వస్తోంది, అలాంటివారు వీసీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోరు కనుక. అసలు అలాంటి వారి నుంచి దరఖాస్తులు కోరే సంస్కారమే అనుచితం కాదా? ఇది ఎక్కడా లేని పద్ధతి. ప్రభుత్వం వద్ద యోగ్యుల వివరాలు ఉండాలి, ఉంచాలి, సేకరించాలి, వారినుంచి వీసీని ఎంపిక చేయాలి కానీ, దరఖాస్తులు కోరడమేమిటి? మంచివారి డేటాబ్యాంక్‌ ఒకటి రూపొందించుకోవాలి. వారికి చెందిన అనుభవాలు, అర్హతలు విద్యా విభాగంలో భద్రపరచాలి. అలాంటివేవీ?


పైన చెప్పినటువంటి వారు పట్టుమని పదిమంది కనబడని రోజుల్లో వందలకు వందలు దరఖాస్తు చేయడమేమిటి? చేసి పైరవీలకు దిగడం ఏమిటి? అన్ని ప్రాంతాలలో, అన్ని కులాలలో మంచివారు  దొరుకుతారు. అసలు మంచివారంటే ఎవరో నిక్కచ్చిగా చెప్పగలిగితే, వారినే నియమించదలస్తే, ప్రతి ప్రాంతం నుంచి లభ్యమవుతారు. అలా లభ్యం కాకపోతే deviate అవాలి తప్పదు. 


వీసీ నియామకాలు ఎంత పటిష్ఠంగా ఉండాలో, ఈసీల నియామకాలు కూడా అలాగే పకడ్బందీగా ఉండాలి. మంచి ఈసీ ఉంటే వీసీలకు ఎంతగానో తోడ్పడుతారు. వీసీలపై భారం కూడా ఎంతో తగ్గించగలుగుతారు. వీసీలను నియమించబోతున్న ఈ సమయంలో ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి. వీసీల పదవీకాల పరిమితి కూడా అయిదేళ్ళకు పెంచాలి. అపుడు రెండవ టర్మ్‌ కావాలనే పైరవీకి కూడా ఆస్కారముండదు. ఒకప్పుడు ఈ పద్ధతే ఉండేది. ఇతర స్వదేశీ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో అవలంబిస్తున్న పద్ధతులనే మనం కూడా అవలంబించాలి.

డా. వెల్చాల కొండలరావు,

పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమి

Updated Date - 2020-09-03T08:14:54+05:30 IST