జంతు చర్మాల నిల్వతో ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2021-10-20T05:23:52+05:30 IST

జీవీఎంసీ 79 వార్డు పరిధి లంకెలపాలెం ఇండస్ట్రియల్‌ ఏరియాలోని సర్వే నంబర్‌ 165లో గల స్థలంలో అనధికారికంగా ఓ వ్యక్తి మేకలు, గొర్రెల చర్మాలను నిల్వ చేసి రవాణా చేస్తున్నాడు.

జంతు చర్మాల నిల్వతో ఉక్కిరిబిక్కిరి
పాకలో నిల్వ ఉంచిన జంతు చర్మాలు

దుర్వాసనతో అవస్థలు పడుతున్న కార్మికులు

లంకెలపాలెం ఇండస్ట్రియల్‌ ఏరియాలో అనధికారికంగా నిల్వ చేస్తున్నా పట్టించుకోని అధికారులు

లంకెలపాలెం, అక్టోబరు 19: జీవీఎంసీ 79 వార్డు పరిధి లంకెలపాలెం ఇండస్ట్రియల్‌ ఏరియాలోని సర్వే నంబర్‌  165లో గల స్థలంలో అనధికారికంగా ఓ వ్యక్తి మేకలు, గొర్రెల చర్మాలను నిల్వ చేసి రవాణా చేస్తున్నాడు. వీటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గొల్లపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇండస్ట్రియల్‌ లేఅవుట్‌లో తాత్కాలికంగా పూరి పాకలు ఏర్పాటు చేశాడు. మేకలు, గొర్రెల చర్మాలు నిల్వ చేసుకునే ఓ తోళ్ల వ్యాపారికి అద్దెకిచ్చాడు. ఆ వ్యాపారి గత కొన్ని రోజులుగా ఇక్కడ చర్మాలను నిల్వ చేసి ఎగుమతి చేస్తున్నాడు. నగరంతో పాటు పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, పరిసర ప్రాంత గ్రామాల్లో మాంసం దుకాణాల నుంచి చర్మాలను కొనుగోలు చేసి ఆటోలు, వ్యాన్‌లలో ఇక్కడికి తరలిస్తున్నాడు. దసరా కావడంతో పెద్ద ఎత్తున చర్మాలు కొనుగోలు చేసి పాకలతో పాటు ఖాళీ స్థలంలో నిల్వ చేశాడు. దీంతో ఇక్కడ దుర్వాసన వెదజల్లుతోంది. ఇటుగా రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఆ వ్యాపారి కొనుగోలు చేసిన చర్మాలు రోజుల తరబడి నిల్వ ఉండడంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. చుట్టూ పరిశ్రమలు ఉండడంతో కార్మికులు, ఉద్యోగులు, యజమానులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చర్మాల నిల్వ కారణంగా వస్తున్న వాసన భరించలేకపోతున్నామని, దీని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కార్మికులు, ఉద్యోగులు వాపోతున్నారు. ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా చర్మాలను ఏ విధంగా నిల్వ చేసి రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళతామని చెబుతున్నారు.

Updated Date - 2021-10-20T05:23:52+05:30 IST