అమెరికాలో ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే.. రుజువు చేసుకోవాల్సింది వాళ్లే..

ABN , First Publish Date - 2020-05-19T23:14:50+05:30 IST

చివుకుల ఉపేంద్ర: నెల్లూరులో పుట్టాను. నాన్న ట్రాన్స్‌ఫర్‌ కావడంతో చెన్నై వెళ్లాను. చదువుకోసం ముంబై.. ఆ తర్వాత అమెరికా వెళ్లాను. అక్కడే సెటిలయ్యాను.

అమెరికాలో ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే.. రుజువు చేసుకోవాల్సింది వాళ్లే..

భారత్‌లో అరాచకం ఎక్కువైపోయింది

సాయం చేద్దామన్నా ప్రభుత్వమే అడ్డు

ఓటును ఆయుధంగా మార్చుకోవాలి

07-01-2013న ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ చివుకుల ఉపేంద్ర


ఆర్కే: నెల్లూరు నుంచి న్యూజెర్సీకి ఎలా వెళ్లారు? 

చివుకుల ఉపేంద్ర: నెల్లూరులో పుట్టాను. నాన్న ట్రాన్స్‌ఫర్‌ కావడంతో చెన్నై వెళ్లాను. చదువుకోసం ముంబై.. ఆ తర్వాత అమెరికా వెళ్లాను. అక్కడే సెటిలయ్యాను.


ఆర్కే: అమెరికా రాజకీయాల్లోకి...?

చివుకుల ఉపేంద్ర: అమెరికాలో మనవాళ్లు చాలా మంది ఉన్నారు. మనవాళ్లకు రాజకీయ మద్దతు అవసరమనే ఉద్దేశంతో డెమొక్రటిక్‌ పార్టీలో చేరాను. 1997లో మొదటిసారిగా ట్రైంక్లిన్‌ టౌన్‌షిప్‌లో కౌన్సిల్‌మెన్‌గా ఎంపికయ్యాను. 2000లో ఆ టౌన్‌కు మేయర్‌గా గెలిచాను. 2001లో న్యూజెర్సీ సాధారణ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచాను. 2007లో డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యాను.


ఆర్కే: ఎన్నికల్లో పోటీకి ఎంత ఖర్చవుతుంది?

చివుకుల ఉపేంద్ర: లక్ష డాలర్ల (రూ.50 లక్షలు) దాకా ఖర్చవుతుంది. ఎదుటి పార్టీవారు ఎక్కువగా ఖర్చు పెట్టే స్థితిలో ఉంటే.. అది మరింత పెరుగుతుంది. నిబంధనల మేరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, స్నేహితుల ద్వారా విరాళాలను సేకరిస్తారు. ఇక్కడిలాగే అక్కడా విరాళాలు ఇచ్చిన వారు పని చేసిపెట్టాలని కోరుతారు. కానీ.. వారికి ఏ పనీ చేసిపెట్టలేం. తేడా వస్తే జైలుకే. కొన్ని నిబంధనల మేరకు చిన్న చిన్న పనులు చేయొచ్చు.


ఆర్కే: అమెరికాలో పేదరికం పెరుగుతోందేం?

చివుకుల ఉపేంద్ర: దేశంలో జీవన వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) బాగా పెరుగుతోంది. కానీ, ఆదాయం పెరగడం లేదు. దాంతో పేదరికం కూడా పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావం వల్ల..అమెరికాలో పరిస్థితి దిగజారింది. పేద, ధనిక బేధాలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. అఫ్ఘానిస్థాన్‌, ఇరాక్‌తో చేసిన యుద్ధాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం.. ప్రపంచ బ్యాంకు నుంచి అత్యంత ఎక్కువ అప్పు తీసుకున్న దేశం అమెరికాయే. కానీ, అక్కడున్న వనరులతో త్వరలోనే తిరిగి కోలుకోగలదు.


ఆర్కే: అసెంబ్లీ సభ్యుడిగా సౌకర్యాలేముంటాయి?

చివుకుల ఉపేంద్ర: ఒక ఆఫీసు, అందులో పనిచేసేందుకు ఇద్దరు ఉద్యోగులు ఉంటారు. వాహనం, సెక్యూరిటీ ఉండవు. ఆఫీసు టేబుల్‌, కుర్చీ కూడా సొంతంగా శుభ్రం చేసుకోవాల్సిందే. అయితే.. బయట పని చేసుకునే అవకాశం ఉంటుంది. భారత్‌లో లాగా ఏ మాత్రం దారి తప్పినా వెళ్లేది జైలుకే! ఇక్కడిలా జైల్లో ఉండి రాజకీయాలు చేసే నాయకులను చూస్తే.. ప్రజలపై జాలేస్తుంది.


ఆర్కే: ప్రజాసేవ చేయాలని ఎందుకనిపించింది?

చివుకుల ఉపేంద్ర: నాకు డబ్బు లేనప్పుడు.. పడ్డ కష్టాలు గుర్తున్నాయి. అందువల్ల ఇతరులకు సేవ చేయాలన్న ఆలోచన కలిగిం ది. మరికొందరు స్నేహితులతో కలిసి.. నల్లగొండ జిల్లా లో ఫ్లోరోసిస్‌ బాధితులకు సాయం అందించడానికి కృషి చేశాం. ఇక్కడి వాళ్లకు సాయం చేయడానికి ఎన్నారైలు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ, ఇక్కడి ప్రభుత్వాలతోనే సమస్యలు ఎదురవుతున్నాయి. అనుమతుల నుం చి పనులదాకా ప్రతీ చోటా అడ్డుపడుతూనే ఉంటుంది.


ఆర్కే: అమెరికాలో నేర్చుకోవాల్సిన మంచి ఏమిటి?

చివుకుల ఉపేంద్ర: సొంతంగా పనిచేసి, కష్టపడి సంపాదించుకోవాలనే తత్వం.. స్వీయ నిజాయితీ అమెరికన్ల నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు. అక్కడి న్యాయ, విద్యా వ్యవస్థలు చాలా చక్కగా పనిచేస్తాయి. భారత్‌లో కేవలం బట్టీ పట్టడాన్నే నేర్పుతున్నారు. పరిశోధన, సృజనాత్మకతలకు స్థానం ఉండడం లేదు. విద్యా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలి. అమెరికాలో పరిశుభ్రతను పాటించడం, సివిక్‌ సెన్స్‌ ఎక్కువ. ఇక్కడైతే.. మనదికాని ఆస్తిని కాపాడడమేమోగానీ, చెడగొట్టకపోతే చాలు.


ఆర్కే: విచారణకు ప్రభుత్వ అనుమతి ఉంటుందా?

చివుకుల ఉపేంద్ర: అలాంటి ఆరోపణలు రాగానే.. ముందుగా సంబంధింత ఏజెన్సీలు సొంతంగానే విచారణ మొదలుపెడతాయి. ఇక్కడిలా ప్రభుత్వం చెప్పాలనో.. ఎవరైనా ఫిర్యాదు చేయాలనో ఉండదు. దాంతో పాటు ప్రతీ నాయకుడిపై ప్రత్యర్థి పార్టీలు ఓ కన్ను వేసి ఉంచుతాయి. వారి నేపథ్యం, వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాయి. అవినీతికి పాల్పడ్డా, మరేదైనా తప్పు చేసినా.. వాటి చేతికి దొరికినట్లే. అక్కడ అందుకే అవినీతి అంటే.. అనుక్షణం భయమే.


ఆర్కే: ఇక్కడి వ్యవస్థను చూస్తే ఏమనిపిస్తోంది?

చివుకుల ఉపేంద్ర: ఇక్కడ అరాచకం ఎక్కువైపోయింది. దేశం ఏమైపోతుందోనని బాధేస్తుంది. ప్రజల్లో మార్పు రావాల్సి ఉంది. ఓటును ఆయుధంగా చేసుకుని.. వ్యవస్థను సరిదిద్దుకోవాలి. విద్యా విధానంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. ముందు ప్రజలు నిజాయితీగా ఉండి.. నిజాయితీగా డిమాండ్‌ చేయాలి.

Updated Date - 2020-05-19T23:14:50+05:30 IST