Abn logo
Jan 24 2021 @ 01:03AM

వీసీకి హాజరుకాని అధికారులు

అమలుకాని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు


చిత్తూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల  నిర్వహణ విషయంగా చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు  ఎన్నికల కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు జిల్లాలోని అధికారులెవ్వరూ హాజరుకాలేదు. అంతేకాకుండా ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ జిల్లా కలెక్టర్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ సహా మరో ముగ్గురు అధికారులను ఉద్దేశించి ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలు కూడా జిల్లాలో అమలు కాలేదు. ఇందుకు సంబంధించి చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ నుంచి ఎలాంటి ఆదేశాలు జిల్లాకు అందకపోవడంతో వేటు పడిన అధికారులు పట్టించుకోలేదు. వాస్తవానికి ఎన్నికల విధుల్లో కలెక్టర్‌ భరత్‌గుప్తా స్థానంలో జేసీ మార్కండేయులుకు బాధ్యతలు అప్పగించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. శనివారం జరిగిన వీడియో సమావేశానికి కూడా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీ హాజరు కాకూడదనేది ఎస్‌ఈసీ ఉద్దేశం. కానీ వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరూ హాజరుకాలేదు. కలెక్టర్‌ భరత్‌గుప్తా పుట్టినరోజు కావడంతో  శనివారం ఉదయం కలెక్టరేట్‌లో అధికారులు, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు ఆయన్ను సన్మానించారు.అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బంగ్లాకు వెళ్లిపోయారు. సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్‌కు వచ్చి రెగ్యులర్‌ పనులు చేసుకున్నారు. వీసీకి హాజరయ్యేందుకు ప్రయత్నించలేదు. జేసీ మార్కండేయులు వీసీకి హాజరయ్యేందుకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఆయన కూడా బంగ్లాకు పరిమితమయ్యారు. మంగళవారం గణతంత్ర దిన వేడుకల నిర్వహణలో మరికొంత అధికారులు నిమగ్నమయ్యారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ కాణిపాకం దేవస్థానంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి స్వాగతం పలికే పనిలో పడిపోయారు. 


అమలులో కోడ్‌, పట్టనట్టుగా అధికారులు

మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ దిశగా ఏర్పాట్లు, హడావిడి జిల్లాలో ఎక్కడా కనిపించలేదు. ఈ నెల 25వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించి, ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్‌ జరపాల్సి ఉంది. శనివారం పల్లెపోరుకు ప్రకటన విడుదల చేయాల్సి ఉండగా.. ఆ జాడే జిల్లాలో కనిపించలేదు. ఎస్‌ఈసీ నుంచే కాకుండా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు ముందడుగు వేసేందుకు సంకోచిస్తున్నారు. ఎస్‌ఈసీ ఆదేశాల ప్రకారం జిల్లాలో శనివారం నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.


40వేల మందికి ఓటు హక్కు దూరం

2021నాటి ఓటరు జాబితాను అధికారులు  ఇవ్వకపోవడంతో 2019 జాబితా ప్రకారమే ఎన్నికలు జరుపుతున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 3.5 లక్షల మంది కొత్త ఓటర్లు ఈ ఎన్నికలకు దూరం కానున్నారని కమిషనర్‌ చెప్పారు. ఈ క్రమంలో మన జిల్లాలోనూ సుమారు 40 వేల మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. జిల్లాలో 2019 ఓటరు జాబితా ప్రకారం 23.94 లక్షల మంది గ్రామీణ ఓటర్లుండగా.. 2021 జాబితా ప్రకారం సుమారు 24.34 లక్షల మంది ఉన్నారు. అంటే వారిలో 23.94 లక్షల మందికి మాత్రమే ఓటు వేసే హక్కు లభించనుంది.


తొలుత తిరుపతిలో..

అంతాసవ్యంగా జరిగితే జిల్లాలోనూ నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెవెన్యూ డివిజన్లవారీగా ఎన్నికలను నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తొలి దశలో తిరుపతి, రెండో దశలో చిత్తూరు, మూడు, నాలుగు దశల్లో మదనపల్లె డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి.

తొలి దశలో ఎన్నికలు జరిగే మండలాలు: తిరుపతి డివిజన్‌లోని బీఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, కేవీబీపురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచెర్ల, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి, వరదయ్యపాళ్యం, ఏర్పేడు  

రెండవ దశ: చిత్తూరు డివిజన్‌లోని బంగారుపాళ్యం, చిత్తూరు, జీడీనెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్‌సీపురం, ఎస్‌ఆర్‌పురం, తవణంపల్లె, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యాదమరి.

మూడవ దశ: మదనపల్లె డివిజన్‌లోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళ్యం, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, గుర్రంకొండ, కేవీపల్లె, కలకడ, కలికిరి, పీలేరు, వాల్మీకిపురం, బి.కొత్తకోట, కురబలకోట, ములకలచెరువు, పీటీఎం, పెద్దమండ్యం, తంబళ్లపల్లె.

నాల్గవ దశ: గుడుపల్లె, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, పుంగనూరు, రొంపిచెర్ల, సోమల, సదుం, చౌడేపల్లె, బైరెడ్డిపల్లె, గంగవరం, పలమనేరు, పెద్దపంజాణి, వి.కోట 

Advertisement
Advertisement
Advertisement