Abn logo
Jan 24 2021 @ 01:00AM

ఎలా మొదలుపెట్టాలో మరి

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టేందుకు అధికారుల పాట్లు


తిరుపతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1412 గ్రామ పంచాయతీలుండగా వాటి పరిధిలో 13574 వార్డులున్నాయి. కోర్టుల్లో న్యాయపరమైన వివాదాల కారణంగా వీటిలో 43 పంచాయతీలకు, వాటి పరిధిలోని 404 వార్డులకు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. మిగిలిన 1360 పంచాయతీలకు, వాటిల్లోని 13170 వార్డులకు ఎన్నికలు జరగాల్సి వుంది. వాస్తవానికి ఎస్‌ఈసీ ముందుగానే ఎన్నికల షెడ్యూలు ప్రకటించేసినందున  జిల్లా యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదలైనా ఎన్నికలు జరిపేందుకు సన్నద్ధంగా వుండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి విముఖంగా వుండడంతో జిల్లా యంత్రాంగం కూడా అదే ధోరణిలో పడిపోయి ఎన్నికలకు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లూ చేసుకోలేదు. నిర్లిప్తంగా వుండిపోయింది. అసలు ఎస్‌ఈసీ షెడ్యూలు ప్రకటించగానే ముందుగా పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. అయితే జిల్లాలో ఆ ప్రక్రియ శుక్రవారం వరకూ మొదలు కాలేదని సమాచారం. అసలు ఎన్నికలు జరిపే పరిస్థితే ఉత్పన్నం కాదన్నంత ధీమాగా యంత్రాంగం వుండిపోయింది. జిల్లా యంత్రాంగం తీరును పలువురు తప్పుపడుతున్నారు. ఒకవేళ, న్యాయపరమైన చిక్కులు పెరిగి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఎన్నికలకు అంగీకరించాల్సి రావచ్చు. లేదా న్యాయస్థానాలే ఎన్నికలకు ఆదేశాలు జారీ చేసే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇదే జరిగితే జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర చిక్కుల్లో పడుతుందని అంటున్నారు.


ముందు నుయ్యి, వెనుక గొయ్యి

   తలబొప్పికట్టే పరిస్థితి రాకుండా ఎన్నికల ప్రక్రియ మొదలు పెడదామనుకున్నా, ప్రభుత్వం తమ పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో అనే భయం అధికార వర్గంలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తానా అంటే తందానా అంటున్నారంటూ అధికారుల పట్ల కింది స్థాయి ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. ఇటు ప్రజలు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నారు. పెద్ద చదువులు చదువుకుని, పోటీ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగాల్లో ఉన్నవారు ఇంత నిస్తేజంగా ఉండడం గతంలో ఎన్నడూ చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో చాలామంది అధికారులు తీవ్ర అభద్రతా భావానికి లోనవుతున్నారు.చివరికి ఎస్‌ఈసీ ఆగ్రహించినా, న్యాయస్థానాలు తప్పుబట్టినా పట్టుదలకు పోయిన నాయకులకు ఏమీ కాదుగానీ తాము బలవుతామనే ఆందోళన అధికారవర్గాల్లో పెరుగుతోందంటున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆదేశాలను గుడ్డిగా అమలు చేసినందున గతంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవాలు జిల్లా అధికారులను భయపెడుతున్నాయి.


భయం భయంగానే పనులు

 మిగిలిన జిల్లాలతో పోలిస్తే చిత్తూరు జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తాయి. కలెక్టర్‌ను గతేడాది మార్చిలోనే ఎస్‌ఈసీ బదిలీకి ఆదేశించింది. ఇటీవలి దాకా అవి అమలు కాలేదు. శుక్రవారం మరోసారి ఎస్‌ఈసీ కలెక్టర్‌ బదిలీకి ఆదేశాలిచ్చింది. అవి సైతం శనివారం సాయంత్రం దాకా అమలుకు నోచుకోలేదు. ఎస్‌ఈసీ ఆగ్రహానికి గురైనందున ప్రస్తుత కలెక్టర్‌ ఎన్నికల బాధ్యతలు నిర్వహించలేరు. అలాగని ఆయన స్థానంలో ఇప్పటిదాకా ఎన్నికల బాధ్యతను మరెవ్వరికీ అప్పగించలేదు. దీంతో జిల్లాలో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది.  ఎందుకైనా మంచిదని లోపల్లోపల రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించినట్టు సమాచారం. శనివారం తిరుపతిలో సమావేశమైన అధికారుల బృందం రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఇతర అంశాలపై కూడా కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. ఎన్నికలు వాయిదా పడితే పరవాలేదు. అలా కాకుండా సోమవారం జిల్లాస్థాయిలో నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం అసాధ్యం. కాబట్టే శని, ఆదివారాల్లో ఈ తతంగమంతా ముగించి సిద్ధంగా వుండాలని జిల్లా అధికారులు ఆ పనుల్లో నిమగ్నమైనట్టు ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది. అయితే అక్కడా అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదని సమాచారం. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారి పంచాయతీరాజ్‌ శాఖతో ఏమాత్రం సంబంధం లేని వ్యవసాయ సంబంధ శాఖ నుంచీ ఇటేవలే డెప్యుటేషన్‌పై రావడంతో ఆ అధికారికి  సరైన అవగాహన లేకపోవడం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా పరిణమించిందని చెబుతున్నారు. కాకపోతే రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి వున్నందున అందరికీ జరిగేదే తమకూ జరుగుతుందన్న వైరాగ్య భావన ఒక్కటే జిల్లా అధికారులకు ఊరటనిస్తోందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement