ఖాయమైన పెళ్లి వద్దన్నాడని అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-05T04:39:30+05:30 IST

వరుడు పెళ్లి ఇష్టంలేదని చెప్పడంతో మనస్తాపం చెందిన వధువు మూడు రోజుల క్రితం అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది.

ఖాయమైన పెళ్లి వద్దన్నాడని  అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య
సుష్మతో భరత్‌ (ఫైల్‌ ఫొటో)

కేసు పెట్టిన తల్లిదండ్రులు


చిత్తూరు, మార్చి 4: అమెరికా అల్లుడని అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఆరు నెలలకు ముందే పెళ్లి నిశ్చయం కావడంతో అమ్మాయి కుటుంబీకులు అమెరికా సంబంధం ఖాయమైందని అందరికీ చెప్పుకున్నారు. ఈ నెల 3న వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసి ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. ఇంతలో ఏమైందో కానీ వరుడు ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెప్పడంతో మనస్తాపం చెందిన వధువు మూడు రోజుల క్రితం అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది.చిత్తూరు నగరం పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ(24) అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. పూతలపట్టు మండలం వడ్డేపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన భరత్‌ అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరికీ వివాహం చేసేందుకు ఇరు పక్కల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరు నెలల ముందే నిర్ణయించారు. ఈ నెల 3వ తేదీ ఉదయం 3 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పత్రికలు కూడా ముద్రించి పంచిపెట్టారు. ఇదిలా ఉండగా సుష్మాను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని భరత్‌ తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయమై ఇరు వర్గాల  మధ్య పంచాయితీ జరిగింది. అయినా భరత్‌ పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం అమెరికాలో తాను ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సుష్మ బంధువులు గురువారం చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఆరు నెలలకు ముందే ముహూర్తం నిర్ణయించి వివాహ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో భరత్‌ పెళ్లికి నిరాకరించడంతోనే  సుష్మ  ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.  

Updated Date - 2021-03-05T04:39:30+05:30 IST