చిత్తూరు జిల్లా టీడీపీకి నూతన జవసత్వాలు

ABN , First Publish Date - 2020-09-28T18:29:21+05:30 IST

జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతన జవసత్వాలు సమకూర్చే దిశగా అధిష్ఠానం..

చిత్తూరు జిల్లా టీడీపీకి నూతన జవసత్వాలు

పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తల నియామకం 


తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతన జవసత్వాలు సమకూర్చే దిశగా అధిష్ఠానం తాజా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపది కన కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో ఇప్పటినుంచే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంటు నియోజక వర్గాలకు అధ్యక్షులను నియమించింది.


కొత్త జిల్లాలు ఏర్పడ్డాక అప్పటికప్పుడు ఆయా జిల్లాలకు కార్యవర్గాలను నియమించడం వల్ల చాలా సమస్యలే తలెత్తుతాయి. తిరుపతి, రాజంపేట వంటి నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రత్యేక జిల్లాలైతే రెండు వేర్వేరు జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్త జిల్లాలో భాగమవుతాయి. అప్పుడు నియమించే కార్యవర్గాలు కొత్త ప్రాంతాలతో కూడుకున్నవి కావడంతో శ్రేణుల్లో, ద్వితీయ శ్రేణి నేతల్లో అయోమయాన్ని కలిగిస్తాయి. అందుకని కొత్త జిల్లాలు ఎప్పుడు ఏర్పాటైనా అప్పటికి పార్టీ సంస్థాగతంగానూ, నాయకత్వపరంగానూ బలం గా ఉండలా ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది.


పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన కార్యవర్గాలు ఏర్పాటు చేస్తోంది. తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ను నియమించింది. తిరుపతికి చెందిన ఆయన జిల్లా అంతా సుపరిచితుడు. తిరుపతి ప్రత్యేక జిల్లా అయితే దాని పరిధిలోకి నెల్లూరు జిల్లాకు చెందిన సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలు చేరుతాయి. ఆ ప్రాంత ప్రజలకు, టీడీపీ శ్రేణులకు నరసింహయాదవ్‌ కొత్త. ఇప్పుడే అధ్యక్షుడిగా నియమించడం వల్ల కొత్త జిల్లా ఏర్పడే నాటికి ఆయన ఆ ప్రాంతవాసులకు సుపరిచితుడిగా మారతారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోకి కడప జిల్లా రాజంపేట, కోడూరు, రాయచోటి, ఈ జిల్లాకు చెందిన తంబళ్ళపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి.


దీనికి కడప జిల్లాకు చెందిన రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఆయన జిల్లావాసులకు కొత్త. కానీ అధ్యక్షుడుగా నియమితులైనందున కొత్త జిల్లా ఏర్పడే లోపు ఈ ప్రాంత పార్టీ శ్రేణులకు పరిచయం అవుతారు. కొత్త అధ్యక్షులు కొత్త ప్రాంతాల్లో పర్యటించి గ్రామ, మండల, పట్టణ, నగర, నియోజకవర్గాల కమిటీలను నియమించడం ద్వారా ఆ ప్రాంతాలపై పట్టును, శ్రేణులతో పరిచయాన్ని పెంచుకుంటారు. 


సామాజిక సమతుల్యత భేష్‌!

కొత్త అధ్యక్షులు, సమన్వయకర్తల నియామకంలో అధిష్ఠానం సామాజిక సమతుల్యత పాటించింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సహా కీలక నియోజక వర్గాలున్నాయి. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా వున్న ఉనన పులివర్తి నానికి జిల్లా అంతటా విస్తృత పరిచయాలు న్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి కూడా దీని పరిధిలోనే ఉంది. పార్లమెంటు పరిధిలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు వంటి సీనియర్లున్నా వారు చాలా ఏళ్ళ కిందటే జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు కూడా.మిగిలిన వారిలో విస్తృత పరిచయాలు, చొరవగా శ్రేణులను కలుపుకుపోగలిన నాయకుడు నానీ మా త్రమే. అందుకే ఆయనకు బాధ్యత అప్పగించింది. 


నరసింహ యాదవ్‌ ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి.ఆయన ఎలాగూ తిరుపతిలో ఉంటున్నారు. సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె సెగ్మెంట్లు భౌగోళికంగా తిరుపతికి చేరువ. దీనికి తోడు తిరుపతి పార్లమెంటు పరధిలో నాలుగు సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. అందుకే బీసీ సామాజికవర్గం నుంచీ ఆయన్ను ఎంచుకుంది. ఇలా పార్లమెంటు అధ్యక్ష పదవుల్లో ఒకటి కమ్మ, మరొకటి బీసీ వర్గాలకు కేటాయించడం ద్వారా టీడీపీకి సంప్రదాయంగా మద్దతిస్తున్న వర్గాలకు న్యాయం చేసినట్టయింది. 


రెడ్డి సామాజికవర్గంలో అత్యధికులు వైసీపీ పక్షాన ఉన్నందున వారిని ఆకర్షించే చర్యల్లో భాగంగా ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకూ సమన్వ యకర్తగా ప్రకాశం జిల్లాకు చెందిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని నియమించారు.రాజంపేట పార్ల మెంటు పరిధిలో రెడ్డి సామాజికవర్గం కీలకం కావడంతో అక్కడ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, సమన్వయకర్తగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని నియమించారు. 


పరిధి తగ్గడంతో.. 

జిల్లా నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు తొలినుంచీ టీడీపీలో ఎవరూ ఉత్సాహంగా ముందు కు రాని పరిస్థితి. కారణం జిల్లా పరిధి ఎక్కువగా ఉండటం, తరచూ పర్యటించడం కష్టం కావడం దీనికి కారణాలు. తాజా నిర్ణయంతో పార్లమెంటు పరిధి.. కేవలం ఏడు సెగ్మెంట్లకు మాత్రమే పరిమితం కానుండడంతో పార్టీ అధ్యక్షులు తరచూ పర్యటించడానికి  వెసులుబాటు కలగనుంది. 




Updated Date - 2020-09-28T18:29:21+05:30 IST