జేసీ మార్కండేయులుకు కలెక్టర్‌ బాధ్యతలు

ABN , First Publish Date - 2021-01-27T06:17:13+05:30 IST

ఎన్నికల విధులనుంచి కలెక్టర్‌ భరత్‌గుప్తాను తప్పించాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమల్లోకొచ్చాయి.మంగళవారం ఉదయం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న భరత్‌గుప్తా తర్వాత జేసీ మార్కండేయులుకు బాధ్యతలప్పగించి రిలీవయ్యారు.

జేసీ మార్కండేయులుకు  కలెక్టర్‌ బాధ్యతలు

ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు రిలీవైన భరత్‌ గుప్తా


చిత్తూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):ఎన్నికల విధులనుంచి కలెక్టర్‌ భరత్‌గుప్తాను తప్పించాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమల్లోకొచ్చాయి.మంగళవారం ఉదయం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న భరత్‌గుప్తా తర్వాత జేసీ మార్కండేయులుకు బాధ్యతలప్పగించి రిలీవయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్‌ 6వ తేదీన కలెక్టర్‌గా భరత్‌గుప్తా జిల్లాకొచ్చారు. అంతకుముందు మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా, చిత్తూరు జేసీగా పనిచేసివుండడంతో జిల్లా ప్రగతిని పరుగులు పెట్టిస్తారని జనం ఆశించారు.అయితే అధికార పార్టీ నాయకుల మాటలు విని క్షేత్రస్థాయి అధికారులను ఇబ్బంది పెట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.నాయకుల మాట వినని కొంతమంది తహసీల్దార్లను ఏడాదిలో నాలుగుసార్లు బదిలీ చేయడం, అర్హత ఉన్న తహసీల్దార్లకు పోస్టింగ్‌ ఇవ్వకుండా నాయకుల సిఫార్సుల మేరకు డీటీలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. జిల్లాకు విడుదలైన కరోనా నిధులు పక్కదారి పట్టడం,కారుణ్య నియామకాల్లో వసూళ్లు తదితరాలపై  భరత్‌గుప్తా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ జేసీ దృష్టికి రాకుండానే తిరుపతి పరిధిలోని భూముల వ్యవహారాలు చక్కదిద్దారని, ఇంటి పట్టాల కోసం కొన్న భూములకు అధికార పార్టీ నాయకుల సిఫార్సు మేరకు అధిక మొత్తం విడుదల చేశారనే విమర్శలూ ఎదుర్కొన్నారు.


పరిశీలనలో ముగ్గురి పేర్లు


 చిత్తూరు కలెక్టర్‌గా ఎన్నికల కమిషన్‌ వద్ద ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కార్తికేయ మిశ్రా, సూర్య కుమారి, హరినారాయణల్లో ఒకర్ని కమిషనర్‌ నిమ్మగడ్డ ఎంపిక చేయనున్నట్లు సమాచారం.వీరిలో మిశ్రా వైద్యఆరోద్యశాఖ డైరెక్టర్‌గా పని చేస్తుండగా సూర్యకుమారి  సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. హరినారాయణ సీసీఎల్‌ఏలో స్పెషల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.


 తిరుపతి ఎస్పీ రమేష్‌రెడ్డి బదిలీ


తిరుపతి(నేరవిభాగం), జనవరి 26: తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పీ రమేష్‌రెడ్డి సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ)కు బదిలీ అయ్యారు. ఎన్నికల విధులనుంచి తప్పించాలన్న ఎస్‌ఈసీ సూచనలతో ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది.ఆయన స్థానంలో చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

Updated Date - 2021-01-27T06:17:13+05:30 IST