చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రికి నిర్లక్ష్యపు జబ్బు

ABN , First Publish Date - 2021-05-01T07:12:50+05:30 IST

చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రిలో వైద్యసేవలపై బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రికి నిర్లక్ష్యపు జబ్బు
చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రి బాత్‌రూం వద్ద పడివున్న మృతదేహం

బాత్‌రూం వద్ద పేషెంట్‌ చనిపోయినా చాలాసేపు పట్టించుకోని సిబ్బంది

ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌, ఇద్దరు జేసీలు


చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 30: చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రిలో వైద్యసేవలపై బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఐదు రోజుల క్రితం పుంగనూరుకు చెందిన అష్రఫ్‌ అలీ(40) ఆస్పత్రిలో చేరాడు.శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు బాత్‌ రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే చనిపోయాడు.అయితే కొన్ని గంటల పాటు వైద్యులు, సిబ్బంది ఆ మృతదేహాన్ని పట్టించుకోలేదు.అదే గదిలో చికిత్స పొంతున్నవారు వైద్య సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు శుక్రవారం ఆస్పత్రికి వచ్చి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.ఇక్కడ వైద్యం సరిగా చేయడం లేదని, రోగి చనిపోతున్నాడని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.సిబ్బంది గేమ్స్‌ ఆడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే అష్రఫ్‌ అలి చనిపోయాడని, చనిపోయిన తర్వాత శవాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.ఈలోపు బాత్‌రూం వద్ద మృతి చెందిన వ్యక్తి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం కలెక్టర్‌ హరినాయణన్‌ దృష్టికొచ్చింది.ఆయన వెంటనే జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌లను చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆదేశించారు.ఆస్పత్రికి చేరుకున్న వారిద్దరూ అక్కడి పరిస్థితులను పరిశీలించారు.కరోనా బాధితులకు సరైన సమయంలో వైద్య సేవలు అందించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని,ఇకపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. డాక్టర్లు, నోడల్‌ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.  అనంతరం కలెక్టర్‌  హరినాయణన్‌  ఆస్పత్రి పర్యవేక్షణకు ముగ్గురు అధికారులను నియమించారు. జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌లను ఆస్పత్రిలో సేవలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి పర్యవేక్షించాలని డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మకు ఆదేశాలిచ్చారు.శుక్రవారం రాత్రి చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రిని కలెక్టరే స్వయంగా తనిఖీ చేశారు.బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా వైద్య సేవలు అందించాలని  అధికారులను ఆదేశించారు.ట్రాయజింగ్‌ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కొవిడ్‌ బాధితుల స్థితిగతులను బట్టి హోమ్‌ ఐసోలేషన్‌ లేదా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆస్పత్రికి సిఫార్సు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం చూపిన అధికారులకు హెచ్చరికలు కూడా చేసినట్లు సమాచారం. ఆయన వెంట డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ, అపోలో చిత్తూరు యూనిట్‌ హెడ్‌ నరే్‌షకుమార్‌ రెడ్డి, ఆస్పత్రి ఎంఎస్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-01T07:12:50+05:30 IST