Abn logo
Aug 2 2021 @ 07:18AM

చిత్తూరు అడవిలో జంట మృతదేహాలు

చిత్తూరు: రామచంద్రాపురం మండలం చిటత్తూరు అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి జంట మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తిరుత్తణికి చెందిన సంజీవరెడ్డి(70), మాల(60) గత నెల 29వ తేదీన తప్పిపోయినట్టు అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో అనుమానితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించడంతోపాటు చిటత్తూరు అడవిలో హత్యా స్థలాన్ని తిరుత్తణి పోలీసులకు చూపించాడు. ఈ సమాచారాన్ని ఆర్సీపురం పోలీసులకు తిరుత్తణి పోలీసులు తెలియజేశారు. దాంతో రేణిగుంట సీఐ అమరనాథరెడ్డి, ఆర్సీపురం ఎస్‌ఐ ఎర్రిస్వామి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలు కుళ్లిపోవడంతో పోస్టుమార్టం చేసేందుకు వీలుకాలేదు. రెవెన్యూ, వైద్యసిబ్బంది ఆదివారం అందుబాటులో లేకపోవడంతో సోమవారం సంఘటనా స్థలంలోనే శవపంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న పరిసర గ్రామప్రజలు, మీడియా ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు అందరినీ వెనక్కి పంపేశారు. హత్యకు సంబంధించిన కారణాలు వెల్లడించేందుకు తిరుత్తణి, ఆర్సీపురం పోలీసులు నిరాకరించారు. నిందితుడిని తిరుత్తణి పోలీసులు తీసుకుని కారులో వెనక్కి తీసుకెళ్లారు. ఆర్సీపురం ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాల వద్ద కాపలా కాస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...