లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో.. యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ (A Kasi) తెరకెక్కిస్తున్న చిత్రం ‘చిత్తం మహారాణి’ (Chittam Maharani). జెఎస్ మణికంఠ (JS Manikanta), ప్రసాద్ రెడ్డి టిఆర్ (Prasad Reddy TR) నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి.. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) విడుదల చేసిన ఫస్ట్ లుక్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) విడుదల చేసిన లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ విడుదల అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది.. సినిమా పెద్ద విజయం సాధించి, టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన JS మణికంఠ మాట్లాడుతూ.. ‘‘మేము నిర్మిస్తున్న ‘చిత్తం మహారాణి’ సినిమా అద్భుతంగా వస్తోంది. కథా కథనాలు చాలా బాగా కుదిరాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే అంశాలు మా సినిమాలో చాలా ఉన్నాయి. ఫస్ట్ లుక్ వదిలిన సుకుమార్ గారికి, లిరికల్ సాంగ్ విడుదల చేసిన రష్మిక గారికి, అలాగే ఇప్పుడు టీజర్ విడుదల చేసిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాము. త్వరలో చిత్రానికి సంబంధించిన విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.