చిట్స్‌ పేరిట మరో మోసం

ABN , First Publish Date - 2021-01-24T06:41:35+05:30 IST

అవసరానికి పనికి వస్తాయని, అష్టకష్టాలు పడి చిట్టీలు కడితే ఓ మహిళ సుమా రు రూ. 15 కోట్లు వసూలు చేసి, రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది.

చిట్స్‌ పేరిట మరో మోసం

రూ. 15 కోట్లతో ఉడాయించిన మహిళ

సీసీఎ్‌సలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

న్యాయం చేయాలని బాధితుల గోడు

పంజాగుట్ట, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అవసరానికి పనికి వస్తాయని, అష్టకష్టాలు పడి చిట్టీలు కడితే ఓ మహిళ సుమా రు రూ. 15 కోట్లు వసూలు చేసి, రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. ఈ విషయంలో తాము పోలీసులకు, సీసీఎ్‌సలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండ్లగూడ పటేల్‌నగర్‌కు చెందిన బాధితులు ధ్రువ్‌కుమార్‌ పాండే, అనసూయ, ప్రేమలత తదితరులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీలోని ఒంగోలు జిల్లా చీరాలకు చెందిన అంజనీదేవీ, బాబురావు దంపతులు ఉద్యోగరీత్యా 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి చంద్రాయణగుట్ట పటేల్‌నగర్‌లో ఉండేవారని తెలి పారు. బాబురావు మాజీ సైనికోద్యోగి, సీఆర్పీఎ్‌ఫలో పని చేశా డు. అంజలీదేవి అంజలి చిట్స్‌ పేరుతో చిట్టీలను నిర్వహించేదని వివరించారు. ఆమెను నమ్మి చాలామంది రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్టీలు  కట్టారని  వివరించారు. నమ్మకంగా ఉంటుండటంతో బంధువులు, స్నేహితులతో కూడా చిట్టీలు వేయించామన్నారు. ఇలా సుమారు 200 మంది నుంచి అంజలీదేవి రూ. 15 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. గత ఏడాది డిసెంబర్‌ 7న ఇంటికి తాళం వేసి భర్త పిల్లలతో వెళ్లిపోయిందని ఆరోపించారు. చిట్టీలు పాడిన వారు, డబ్బులు కట్టాల్సిన వారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వస్తోందని అన్నారు.  అప్పటి నుంచి ఆమె కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, ఆమెపై తొలుత చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశామని, గత నెల 12న నగర సీసీఎ్‌సలో ఫిర్యాదు చేశామని వివరించారు. పోలీసులు కైరమ్‌ నెంబర్‌ 187/2020 లో కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తు మాత్రం ఒక్క అడుగు కూడా  ముందుకు పడటం లేదన్నారు. ఆమె ముందస్తు బెయిల్‌ తీసుకుందని తమకు తెలిసిందని, ఆస్తులు విక్రయించి అమెరికాలో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆమె బెయిల్‌ రద్దు చేయించాలని,  వెంటనే అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. సమావేశంలో పలువురు బాధితులు, బీజేపీ నాయకుడు రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T06:41:35+05:30 IST