ప్రతి పరీక్షలో ఏ గ్రేడ్‌ రాదు

ABN , First Publish Date - 2020-09-20T05:30:00+05:30 IST

ఒక వైపు సినిమాల్లో నటిస్తూ.. మరో వైపు పరీక్షలకు ప్రిపేర్‌ కావటం ఎవరికైనా కష్టమే! మలయాళ కుట్టి మాళవిక మాత్రం రెండు పడవల్లో కాలు పెట్టి ప్రయాణం సాగిస్తోంది. ‘ఒరేయ్‌ బుజ్జి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాళవికను ‘నవ్య’ పలకరించింది...

ప్రతి పరీక్షలో ఏ గ్రేడ్‌ రాదు

ఒక వైపు సినిమాల్లో నటిస్తూ.. మరో వైపు పరీక్షలకు ప్రిపేర్‌ కావటం ఎవరికైనా కష్టమే! మలయాళ కుట్టి మాళవిక మాత్రం రెండు పడవల్లో కాలు పెట్టి ప్రయాణం సాగిస్తోంది. ‘ఒరేయ్‌ బుజ్జి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాళవికను ‘నవ్య’ పలకరించింది. అప్పుడు ఆమె చెప్పిన కబుర్లు ఇవే..



కరోనా సమయం నాకెంతో నేర్పింది. వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా.. ఎత్తుపల్లాలెన్నో.  ప్రస్తుతం యువతీయువకులు ఏదో సాధించాలనే తపనతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వారందరికీ కరోనా బ్రేక్‌ ఇచ్చింది. మొదట్లో భయపడ్డారు. నెమ్మదిగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారు. జీవితంలో ప్రాథమ్యాలు నిర్ణయించుకొనేందుకు సమయం చిక్కింది. నా విషయాన్నే తీసుకుందాం. కరోనా ముందు ఎప్పుడూ పరిగెడుతూ ఉండేదాన్ని. చదువు.. పని.. ఈ రెండే నా జీవితాన్ని శాసించేవి. లాక్‌డౌన్‌ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. మనశ్శాంతి, ఆరోగ్యం- ఈ రెండే మనకు ముఖ్యమని.. మిగిలినవన్నీ అదనపు ఆనందాలే అని తెలుసుకున్నా. బాహ్య సౌందర్యం ముఖ్యం కాదనే విషయమూ తెలిసింది. 


హార్మోన్ల ప్రభావమెంతో..

గతంలో రాత్రి మెలుకువగా ఉండి చదువుకొనేదాన్ని. ఉదయం నాలుగు గంటలకు నిద్రపోతే 11 గంటలకు మేలుకొనేదాన్ని. దీని ప్రభావం హార్మోన్లపై పడేది. కోపం.. దుఖం, నిరాశ.. ఇలా అనేక భావోద్వేగాలకు గురయ్యేదాన్ని. ముఖ్యంగా అమ్మాయిలపై హార్మోన్ల ప్రభావం ఎక్కువుంటుంది. ఎక్కువ మంది నిద్రకు ప్రాధాన్యం ఇవ్వరు. సరిగ్గా తిండి తినరు. కంటి నిండా నిద్రపోరు. నీళ్లు తాగరు. ఈ ప్రాథమిక విషయాలను పట్టించుకోకపోతే శారీరకంగా, మానసికంగా అలసిపోతాం. ఆర్యోగంగా ఉండాలంటే కీటో డైట్‌ చేయాల్సిన అవసరం లేదు. సమయానికి తిని, నిద్రపోతే సరిపోతుంది. ప్రస్తుతం రాత్రి 11 గంటలకు నిద్రపోయి ఉదయం 7 గంటలకు లేస్తున్నా. ఎంతో హాయిగా ఉంది. 


ప్రేక్షకుల చేతిలో..

నేను ఒకవైపు చదువుకుంటూ.. మరోవైపు సినిమాల్లో చేశా. రెండింటిలోను పేరు తెచ్చుకోవాలనుకొనేదాన్ని. దీనితో తీవ్రమైన ఒత్తిడి ఉండేది. ప్రతి పరీక్షలో ఏ గ్రేడ్‌ రావటం ఎంత కష్టమో.. ప్రతి సినిమా విజయం సాధించటం కూడా అంతే కష్టం. వాస్తవానికి చదువు నా చేతిలో ఉంది. నేను కష్టపడితే మార్కులు వస్తాయి. సినిమా నా చేతిలో లేదు. ప్రేక్షకులే జయాపజయాలు నిర్ణయిస్తారు. వారిని మనం ప్రభావితం చేయలేం. మనం ప్రభావితం చేయలేని అంశాలపై ఆలోచించి ప్రయోజనం ఏముంది? కరోనా సమయంలో ఈ పాఠం నేర్చుకున్నా. అయితే ప్రేక్షకులు, విమర్శకులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటా. వారి అభిప్రాయాలకు విలువనిస్తా. 


కారణం లేదు..

ఎవడే సుబ్రమణ్యం.. సినిమా తర్వాత మలయాళంలో నటించలేదు. దీనికి కారణం కూడా ఏమి లేదు. ఆ సినిమా సమయంలో నేను ఢిల్లీలో ఉన్నా. తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడే చదువుకుంటున్నా. తెలుగు సినిమాలపై దృష్టి పెట్టడంతో మలయాళంలో సినిమాలు చేయలేదు. నేను ఇటు తెలుగు, అటు మలయాళ సినిమాలు చేశాను కాబట్టి రెండు పరిశ్రమల గురించి బాగా తెలుసు. మలయాళంలో 30 రోజుల్లో సినిమా పూర్తి చేస్తారు. తెలుగులో కనీసం 60 రోజులు తీసుకుంటారు. అక్కడ నటీనటులు, దర్శకులపై ఒత్తిడి ఎక్కువ. ఇక అక్కడ వేర్వేరు కథలు సినిమాలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే చదవటం మలయాళీల సంస్కృతిలో ఒక భాగం. సినిమా కథల్లో కూడా అది ప్రతిఫలిస్తుంది. మా అమ్మమ్మకి 80 ఏళ్లు. ఆవిడ ఇప్పటికీ ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటారు. ఫ


సమస్యలు వదిలేసి..

సుశాంత్‌ మంచి నటుడు. అతను చనిపోవటం దురదృష్టకరం. మన దేశంలో సుశాంత్‌ కేసుతో పాటుగా అనేక సమస్యలున్నాయి. జీడీపీ, కోవిడ్‌, ఆర్థిక మాంద్యం- ఇలాంటి ముఖ్యమైన విషయాలను వదిలేసి సుశాంత్‌ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నామా అనిపిస్తుంది.


Updated Date - 2020-09-20T05:30:00+05:30 IST