Apr 7 2021 @ 15:59PM

చిరు ఒప్పుకోవడం లేదు..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని కరోనా ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే.. ప్రత్యక్షంగా చూసిందే. గత ఏడాది నుంచి సినిమా నిర్మాతలు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఆల్రెడి కొబ్బర కాయకొట్టుకున్న సినిమా నుంచి షూటింగ్ మొదలై ఆగిపోయిన సినిమాలు..రిలీజ్‌కి రెడీ అయిన సినిమాల నిర్మాతలకి నిద్ర పట్టని రాత్రిళ్ళు ఎన్నో గడపాల్సి వచింది..ఇంకా వస్తోంది. కరోనా కాస్త కంట్రోల్‌లోకి వచ్చి పరిస్థితులు చక్కబడి 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'పుష్ప', 'సర్కారు వారి పాట'..ఇలా దాదాపు అన్నీ సినిమాల షూటింగ్స్ మళ్ళీ ప్రారంభమై శరవేగంగా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజై మళ్ళీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకు వస్తున్న నేపథ్యంలో కరోనా విజృంభణ మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో మొదలై ఒక్కొక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇక్కడా... అక్కడా అని లేకుండా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ సినిమాల రిలీజ్ నిలిపి వేశారు. థియోటర్స్ కూడా తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా 'ఆచార్య' రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వాస్తవంగా ఈ పాటికే షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఓ కొలిక్కి వచ్చేయాల్సింది. కానీ ఇంకా కొంత షూట్.. అలాగే వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్ ఉన్న కారణంగా మే 13న అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. కానీ ఇందుకు మెగాస్టార్ మాత్రం ససేమిరా అంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్‌కి 'ఆచార్య' వచ్చేయాల్సిందే అని దర్శకుడికి గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. వీఎఫెక్స్ కోసం పెద్ద టీంని తీసుకుందామనుకున్నా కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలిస్తాయా అన్నది అర్థం కాకుండా ఉందట. మరి ఇలాంటి పరిస్థితుల్లో 'ఆచార్య' అనుకున్న డేట్‌కి వస్తాడా లేదా అన్నది పెద్ద డైలమాగా ఉంది అంటున్నారు.