Jun 14 2021 @ 17:47PM

వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డే: రక్తదానం చేసిన చిరు దంపతులు

వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డేని పురస్కరించుకుని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు రక్తదానం చేశారు. సతీ సమేతంగా బ్లడ్‌ డొనేట్‌ చేస్తున్న పిక్‌ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన చిరు.. తన బ్లడ్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ''వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డేని పురస్కరించుకుని రక్తదాతలందరినీ.. మరీ ముఖ్యంగా బ్లడ్‌ డొనేట్‌ చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన నా బ్లడ్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ని అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఎంతో విలువైన ప్రాణాన్ని నిలబెట్టగలం. అలాగే మన రక్తం ఇచ్చి.. తోటి మానవులతో బాండింగ్‌ ఏర్పరచుకోవడం అనేది నిజంగా ఎంతో అదృష్టం.." అని చిరంజీవి తెలిపారు.


ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంకే కాకుండా కరోనాతో ఆక్సిజన్‌ అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు.. కోట్లలో ఖర్చుపెట్టి 'చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌'ను స్థాపించి.. మహత్తర కార్యక్రమానికి మెగాస్టార్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ అందక ఇంకెవరూ చనిపోకూడదని.. రామ్‌ చరణ్‌ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరు ఈ బ్యాంకులను నెలకొల్పుతున్నారు. మెగాభిమానుల పూర్తి మద్దతుతో ఈ ఆక్సిజన్‌ బ్యాంకులు విశిష్ట సేవలను అందిస్తున్నాయి.