సీఎం జగన్‌తో చిరంజీవి బృందం భేటీ.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2022-02-10T18:46:12+05:30 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి బృందం సమావేశమైంది.

సీఎం జగన్‌తో చిరంజీవి బృందం భేటీ.. ఏం జరుగుతుందో..!?

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి బృందం సమావేశమైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్‌తో భేటీ అయింది. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి, ఆలీ, ఆర్ నారాయణమూర్తి, దిల్ రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


శుభం కార్డు పడేనా..!?

ఈ భేటీలో చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, జీవో నంబర్ 35లో సవరణలు, సినిమా టికెట్ ధరల పెంపు, ఏసీ, నాన్‌ ఏసీ థియేటర్లలో కనీస, గరిష్ట ధరలపెంపుతో పాటు పలు కీలక విషయాలపై సీఎం జగన్‌కు చిరు బృందం నిశితంగా వివరించనుంది. కాగా.. ఇప్పటికే ఈ సమస్యలపై ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఆ కమిటీ నిశితంగా నివేదికను అందజేయడం జరిగింది. అయితే ఈ భేటీతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది. ఇదివరకే మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ్టితో అన్ని సమస్యలకు శుభం కార్డు పడుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భేటీ ముగిసిన అనంతరం సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో మాట్లాడి వివరాలు వెల్లడించనున్నారు.


ఏం జరుగుతుందో..!?

కాగా.. సమావేశం అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలోనే జగన్‌తో కలిసి వీరంతా భోజనం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ సినిమా సమస్యలపై చర్చలు జరుపుతారు. టాలీవుడ్ ప్రముఖుల చర్చలకు ముందే.. సినిమా టికెట్లపై హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నివేదిక సిద్ధం చేసింది. గ్రామాలు, పట్టణాలతో సంబంధం లేకుండా.. ఎక్కడైనా నాన్‌ ఏసీ థియేటర్లలో కనీస టికెట్‌ ధర రూ.40.. ఏసీ థియేటర్‌లో 70 రూపాయలు ఉండాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. రాష్ట్రప్రభుతం గత డిసెంబరులో నిర్ణయించిన ధరలతో పోలిస్తే ఈ మొత్తం బాగా ఎక్కువ. దీంతో... ముఖ్యమంత్రి స్పందనపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. నేటి భేటీతో టికెట్ల ధరలపై దాదాపు స్పష్టత రావచ్చని తెలుస్తోంది.


ఆ ఇద్దరు రాలేదు..!?

నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని భావించారు. అయితే ఇద్దరూ ఈ భేటీకి దూరంగా ఉన్నారు. ఇవాల్టితో సమస్యకు తెరపడుతుందని భావిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. కాగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి అందరికంటే ముందుగా ఆలీ, పోసాని, ఆర్ నారాయణమూర్తి చేరుకున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2022-02-10T18:46:12+05:30 IST