Oct 27 2021 @ 15:35PM

‘తడప్’ ట్రైలర్ కు మెగాస్టార్ ప్రశంస

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి.. బాలీవుడ్ లో హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘తడప్’ అనే ప్రేమకథా చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ , ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో మిలన్ లూథిర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రానికిది రీమేక్ వెర్షన్. తారా సుతారియా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. సినిమా డిసెంబర్ 3న విడుదలవుతోంది. అహన్ శెట్టి హ్యాండ్సమ్ లుక్స్, తారా సుతారియా గ్లామర్ అపీరెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్.ఎక్స్. 100’ కథని అహన్ ఎంట్రీకి అనుగుణంగా.. కాస్తంత హీరోయిజం డోస్ పెంచుతూ సినిమా తెరకెక్కిస్తున్నట్టు అర్ధమవుతోంది. రీసెంట్ గా ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి.. దాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో స్పందించారు. ‘రా అండ్ ఇంటెన్స్ .. సాజిద్ నడియావాలా ‘తడప్’ ట్రైలర్ చాలా బాగుంది. అహన్ శెట్టి అండ్ టీమ్ కు నా ప్రేమ పూర్వక శుభాభినందనలు’.. అంటూ  ట్వీట్ చేశారు.