Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 06 Jul 2022 22:33:35 IST

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ గ్రాఫ్‌ను మరింతగా పెంచిన సినిమా అదే!

twitter-iconwatsapp-iconfb-icon

నెల రోజుల తేడాతో విడుదలైన రెండు చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలో గొప్ప మార్పు తెచ్చాయని చెప్పాలి. ఆ చిత్రాలు.. ‘అడవి దొంగ’, ‘విజేత’. ముఖ్యంగా ‘అడవి దొంగ’ చిత్ర విజయంతో చిరంజీవితోనూ భారీ చిత్రాలు నిర్మించవచ్చనే నమ్మకం అగ్ర నిర్మాతల్లో  కలిగింది. ఆ నాటి నంబర్ వన్ హీరో ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆయన అధిష్టించిన అగ్రాసనం ఖాళీ అయింది. అక్కినేని సహా పలువురు అగ్ర తారలు ఉన్నా, పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న హీరో కృష్ణ ఆ స్థానం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలోనే ‘ఖైదీ’ చిత్రం విడుదలైంది. ఆ సినిమాతో చిరంజీవికి ఓవర్ నైట్ స్టార్ డం వచ్చింది. ఎవరి అండదండలు లేకుండా కృషినే నమ్ముకొని ఎదిగిన చిరంజీవి ‘ఖైదీ’ తర్వాత మరికొన్ని జనరంజకమైన చిత్రాల్లో నటించి అభిమానుల సంఖ్య పెంచుకున్నారు. ఏడాది తిరగకుండానే హీరో కృష్ణతో పోటీ పడే స్థాయికి చేరుకొన్నారు. అటువంటి నేపథ్యంలో 1985లో విడుదలైన ‘అడవి దొంగ’ చిత్రం మెగాస్టార్ కెరియర్ గ్రాఫ్‌ను మరింత పెంచింది.


ఎన్టీఆర్ తరానికి చెందిన భారీ చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు.. చిరంజీవితో చేతులు కలపడంతో ఆయన కెరీర్‌కు మరింత ఊపు వచ్చింది. సోలో హీరోగా చిరంజీవి,  రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తొలి సినిమా ఇదే. మెగాస్టార్ చిత్రాల వ్యాపార పరిధిని బాగా పెంచి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. ఆ సమయంలో సూపర్ స్టార్‌గా వెలుగుతున్న కృష్ణ చిత్రాలకు సమానంగా ఈ సినిమా బిజినెస్ కావడం విశేషం. అలాగే తొలి వారం దాదాపు రూ. 84 లక్షలు వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్య పరిచింది. రాఘవేంద్రరావు మార్క్ పాటలతో, చిరంజీవి నృత్యాలతో ఒక సరికొత్త మాస్ కాంబినేషన్‌కు ‘అడవి దొంగ’ తెర తీసింది. చిరంజీవి సినిమాను ఎంత ఖర్చు పెట్టి తీసినా.. వసూళ్లకు ఢోకా ఉండదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. అలాగే ఎన్టీఆర్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ సినిమాలు తీయాలంటే చిరంజీవితోనే సాధ్యం అని ‘అడవి దొంగ’ తోనే ముందుకు రావడం మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ గ్రాఫ్‌ను మరింతగా పెంచిన సినిమా అదే!

ఈ సినిమాలో చిరంజీవి టార్జాన్ పాత్ర పోషించారు. ఇంటర్వెల్ వరకూ ఆయనకు మాటలే ఉండవు. ఈ విషయంలో రాఘవేంద్రరావు మెగా అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు కూడా. రాధ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 1985 సెప్టెంబర్ 19న విడుదలైంది. హైదరాబాద్‌లో దేవి, సత్యం, కోణార్క్, జ్యోతి థియేటర్లలో విడుదల చేశారు. విడుదల రోజున నాలుగు థియేటర్లలో ఐదు షోలు ప్రదర్శించడం హైదరాబాద్ సిటీ హిస్టరీ‌లో అదే తొలిసారి.

-వినాయకరావు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement