ప్రకాశం జిల్లాలో సర్వే ఫీవర్.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో..!

ABN , First Publish Date - 2022-07-25T23:57:51+05:30 IST

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 8 మంది వైసీపీ (Ycp) ఎమ్మెల్యేలు గెలుపొందారు. చీరాల (Chirala) నుంచి...

ప్రకాశం జిల్లాలో సర్వే ఫీవర్.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 8 మంది వైసీపీ (Ycp) ఎమ్మెల్యేలు గెలుపొందారు. చీరాల (Chirala) నుంచి గెలిచిన టీడీపీ  (Tdp) ఎమ్మెల్యే కరణం బలరామ్ (Karanam Balaram) వైసీపీకి మద్దతు పలకడంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. మరో మూడు నియోజక వర్గాల్లో వైసీపీ ఇంచార్జ్‌ల పెత్తనం కొనసాగుతోంది. పార్టీ అధికారంలో ఉండటంతో నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు తాము చెప్పిందే వేదం..చేసిందే చట్టం అన్నట్టుగా మారింది. మూడేళ్లుగా నేనే రాజు...నేనే మంత్రి అన్నట్టు రెచ్చిపోతున్నారు. 


అయితే నియోజక వర్గాల్లో సొంత పార్టీ నేతల పని తీరుపై ఇప్పటికే రెండుసార్లు జగన్ సర్వే చేయించారు. సొంత పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేతలకు, కుటుంబ పాలన చేయిస్తున్న ఎమ్మెల్యేలకు గతంలోనే సీఎం జగన్ (Cm jagan)  క్లాస్ పీకారు. కానీ నాయకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదట. నియోజక వర్గంలో అధికార హవా చెలాయించడం తప్ప స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కారంపై జిల్లాలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు ఇప్పటివరకు పట్టించుకున్న పాపానపోవడం లేదు. దీంతో మూడేళ్లకే జగన్ ప్రభుత్వంపై విసుగెత్తిపోయిన జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 


మరోవైపు చీరాల, పర్చూరు, దర్శి, సంతనూతలపాడు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లకు వ్యతిరేకంగా మరో గ్రూపు ఏర్పాటైంది.  ప్రస్తుతం నియోజకవర్గంలో నిరంకుశ ధోరణిలో పెత్తనం చలాయిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా తొలగించాలని డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడోసారి జగన్ సర్వే చేయించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లకు టెన్షన్ మొదలైంది.


ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పీకే టీంతో పాటూ ఇంటెలిజెన్స్ సిబ్బంది వేరువేరుగా సర్వేలు నిర్వహిస్తున్నారట. సర్వే రిపోర్టు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఉంటాయని జగన్ తేల్చి చెప్పడంతో ఇప్పటి వరకూ నియోజక వర్గాల్లో చెలరేగిపోయిన నాయకులకు సర్వే టెంపరేచర్ పెరిగిందట. తమ పని తీరుపై చేయిస్తున్న సర్వేలో రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొందట. నియోజకవర్గాల్లో అధికార పెత్తనం చెలాయిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పొలిటికల్ ఫ్యూచర్‌ని తేలుస్తానని జగన్ హెచ్చరించడంతో నేతలు హైరానా పడుతున్నారట. 


సర్వే రిపోర్టులో ఏం వస్తుందోనని ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు కలవరపడుతున్నారట. సొంత పార్టీ నేతలపై జగన్ చేయిస్తున్న సర్వే రిజల్ట్స్ ఆపార్టీ నాయకుల పొలిటికల్ ఫ్యూచర్‌ని ఎలా మలుపుతిప్పుతాయో వేచి చూడాలి.



Updated Date - 2022-07-25T23:57:51+05:30 IST