ఎమ్మెల్యే తనయుడి వార్నింగ్.. చీరాల వైసీపీలో హైటెన్షన్

ABN , First Publish Date - 2020-09-05T17:07:03+05:30 IST

ఆయనకు కోపమొచ్చింది.. పార్టీ కోసం ఇంత చేస్తే తనకు పూర్తిస్ధాయిలో సపోర్ట్‌ చేయకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తనపై ఛాలెంజ్‌లు విసురుతున్నా తనకు అనుకూలంగా ఒక్కరు

ఎమ్మెల్యే తనయుడి వార్నింగ్.. చీరాల వైసీపీలో హైటెన్షన్

ఆయనకు కోపమొచ్చింది.. పార్టీ కోసం ఇంత చేస్తే తనకు పూర్తిస్ధాయిలో సపోర్ట్‌ చేయకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తనపై ఛాలెంజ్‌లు విసురుతున్నా తనకు అనుకూలంగా ఒక్కరు కూడా మాట్లాడక పోవటంతో ఆయనకు బాగా కోపమొచ్చింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తమ పార్టీనే అధికారంలోకి రావటంతో అక్కడ ఆయన పెత్తనమే సాగుతుందనుకున్నారంతా. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసి రావాలనే తమ అధినేత ప్రకటనతో ప్రశాంతంగా ఉన్న ఆయనకు.. వెనుకదారిన అధినేతకు మద్దతునిచ్చి ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకోవటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. వచ్చిన వాళ్లు తన పని తాను చేసుకోకుండా అన్నింటికి అడ్డుతుగులుతున్నారని తన కేడర్ భావిస్తున్నా.. అంతా మన పార్టీ వారే కదా సర్దుకుంటాయిలే అని అధిష్టానం మిన్నకుండి పోవటంతో గుర్రుగా ఉండటం తప్ప ఏమి చేయలేని పరిస్ధితిలోకి వెళ్ళి పోయారు. ఇంతకీ ఎవరా నేత.. ఏంటా స్టోరీ.. ప్రత్యేక కథనం మీకోసం..


ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అంతర్మథనంలో పడ్డారట. చీరాల నియోజక వర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు రాష్ట్ర్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య ఉండటంతో ఆయన అండతో జిల్లాతో పాటు రాష్ట్ర్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. కాపు సామాజిక వర్గంలో గట్టి నేతగా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి అధికార పార్టీ నేత వల్ల ఇబ్బందులకు గురవుతున్నానని భావించారు. తన సన్నిహితుల చొరవతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి టీడీపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు నియోజకవర్గంలో తన హవాను కొనసాగించారు. గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా తన ప్లేటును ఫిరాయించి వైసీపీలో చేరిపోయారు. చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. తాను ఓడిపోయినా వైసీపీ రాష్ట్ర్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో నియోజకవర్గంలో తిరిగి పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం ప్రారంభించారు. 


అంతా ఒక్కటవడంతో ఒంటరిగా...

సిట్టింగ్ ఎమ్మెల్యేగా కరణం ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ఆయనే ఎమ్మెల్యేలా చెలాయించేందుకు ప్రయత్నించేవారట. ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం వచ్చినా అక్కడ తన వర్గీయులతో నానా యాగి చేయించేవారట. అలాగైనా కరణం అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే తాను అనధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన వచ్చని ఆశించారట. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కరణం బలరాం ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో తన కుమారుడు కరణం వెంకటేష్‌ను వైసీపీలో చేర్చి తాను కూడా వైసీపీ మద్దతు తెలపటంతో ఆమంచి జీర్ణించుకోలేక పోయారట. సిట్టింగ్ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకువస్తూ తనమాట కూడా తీసుకోక పోవటంతో అప్పటి నుండే అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. కరణం బలరాంతో పాటు అప్పటి వరకూ నియోజకవర్గంలో తనకు రాజకీయ శత్రువులుగా ఉన్న నేతలందరూ వైసీపీ గూటికి చేరటంతో ఆయన ఒంటరి నేతగా మిగిలిపోయారు. అధికారిక కార్యక్రమాల్లో వాళ్ళందరూ కలసి పాల్గొంటూ ఉండటంతో చేసేదేమీ లేక తన పని తాను చేసుకుపోతున్నారట. అయితే కరణంతో పాటు ఇతర నేతలు వైసీపీలోకి రావటం ఇష్టం లేని ఆమంచి అభిమానులు ఆయా కార్యక్రమాల్లో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం.. ఆ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించటం పరిపాటిగా మారిపోయింది. దీంతో చీరాల నియోజకవర్గంపై దృష్టి సారించిన వైసీపీ అధిష్టానం ఈ గొడవలకు ఫుల్ స్టాప్‌ పెట్టాలనే యోచనలోకి వచ్చిందట. ప్రస్తుతం చీరాల నియోజక వర్గం పక్కనే ఉండే పర్చూరు నియోజకవర్గం ఇన్‌ చార్జ్‌ భాద్యతలు అప్పగించేందుకు సిద్దపడిందట..అయితే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉండటం.. ఆయన ఆ సామాజిక వర్గంపై తన నోటి దురుసును చూపించి ఉండటంతో అక్కడ పోటీ చేస్తే తాను గెలవలేననే అభిప్రాయంతో తాను నియోజకవర్గం మారేది లేదని చెప్పేశారట. కరోనాతో గత కొద్దికాలంగా పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరగక పోవటంతో ప్రస్తుతానికి అంతా బాగుందనుకున్నారంతా. 


ఆమంచికి పరోక్ష వార్నింగ్...

అయితే తాజాగా జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పరోక్షంగా ఆమంచి కృష్ణమోహన్‌పై చేసిన వ్యాఖ్యలు ఆమంచికి ఆగ్రహాన్ని తెప్పించాయి. కార్యక్రమానికి హాజరైన కరణం వెంకటేష్ పరోక్ష వ్యాఖ్యలతో ఆమంచిపై విరుచుకుపడ్డారు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని తాము వైసీపీలో చేరే రోజునే ప్రమాణం చేశామంటూ ప్రారంభించిన ఆయన.. ఆ మాటకు కట్టుబడి చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామని, చీరాలలో గతంలో మాదిరిగా ఆరాచకాలు, బెదిరింపులు ఇక్కడ కొనసాగవని హెచ్చరించారు. కుప్పిగంతులు వేస్తే ఎవరూ చూస్తూ కూర్చోరని జాగ్రత్తగా ఉండాలని చీరాలను అభివృద్ధి చేయడానికే వైసీపీలోకి తాము వచ్చామన్నారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయత్వంలో అందరం కలిసి పనిచేసి చీరాలను మరింత అభివృద్ది చేసుకుందామంటూ ముగించారు. 


మంత్రి అండతోనే..

వెంకటేశ్ వ్యాఖ్యలతో ఆమంచి మరింత రగిలిపోయారట. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండతోనే గతంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కరణం బలరాం మంత్రి బాలినేనితో కలసి పాల్గొన్నారని, ఆయన వల్లే వీరంతా వైసీపీలోకి రాగలిగారని తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. తనపై నేరుగా వ్యాఖ్యలు చేసే ధైర్యం లేకనే ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశారని, ధైర్యం ఉంటే తనపై నేరుగా విమర్శలు చేయాలంటూ తన అనుచరుల వద్ద బహిరంగంగానే మాట్లాడారట. మంత్రి బాలినేని సపోర్టు ఉండటం వల్లే తనపై వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారట. మంత్రి బాలినేనిపై తనకు వచ్చిన కోపాన్ని ఆయనకు తాను కూడా పరోక్షంగా తెలియజేసేందుకు ఈ ఘటన జరిగిన గంటల్లోనే మంత్రి బాలినేనికి సంభందించిన ఆఫీషియల్ వార్తల వాట్పాప్ గ్రూప్‌ నుండి ఆయన వైదొలిగారట. పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాల పట్ల ఆమంచి అంతర్మధనంలో పడ్డారట. సొంత పార్టీ నుండే తనకు మద్దతు లేకుంటే భవిష్యత్తులో ఎలా నెట్టుకు రావాలనే ఆలోచన లోకి వెళ్లారట. మొత్తం మీద చీరాల పరిణామలు అటు వైసీపీ కేడర్‌తో పాటు ఇటు ఆ పార్టీ అభిమానులను సైతం అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ గొడవలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేలా పార్టీ అధిష్టానం ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - 2020-09-05T17:07:03+05:30 IST