చినుకు పడితే చెరువే!

ABN , First Publish Date - 2022-10-03T05:21:08+05:30 IST

పట్టణంలోని మెయిన్‌ రోడ్డు అడుగడుగునా గోతులతో అధ్వానంగా వుంది.

చినుకు పడితే చెరువే!
లక్ష్మీ థియేటర్‌ సమీపంలో చెరువును తలపిస్తున్న మెయిన్‌రోడ్డు

- చెరువులను తలపిస్తున్న మెయిన్‌రోడ్డుపై గోతులు

- రాకపోకలకు నరకాన్ని చూస్తున్న ప్రజలు

- చేష్టలుడిగి చూస్తున్న అధికారులు, నాయకులు


పాయకరావుపేట, అక్టోబరు 2: పట్టణంలోని మెయిన్‌ రోడ్డు అడుగడుగునా గోతులతో అధ్వానంగా వుంది. ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వర్షం పడితే నీరు మొత్తం రోడ్డుపైన, గోతుల్లో నిలిచిపోయి చెరువును తలపిస్తున్నది. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. రోడ్డు విస్తరణ సంగతి దేవుడెరుగు.. కనీసం గోతులు అయినా పూడ్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 పాయకరావుపేట పట్టణంలో తాండవ వంతెన నుంచి జాతీయ రహదారిలో ‘వై’ జక్షన్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మెయిన్‌ రోడ్డు వాహనాలతో రద్దీగా వుంటుంది. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి సుమారు పదేళ్ల క్రితం రూ.4 కోట్లతో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే 10 శాతం పనులు కూడా జరక్కుండానే కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. మళ్లీ నాలుగేళ క్రితం అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత    వీఎంఆర్‌డీఏ(వుడా) అధికారులతో మాట్లాడి, మెయిన్‌ రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పంచింది రూ.6.50 మంజూరు చేశారు. అయితే ఆర్‌అండ్‌బీ పరిధిలో వున్న ఈ రహదారిని వీఎంఆర్‌డీఏకి బదలాయించాలని షరతు పెట్టారు. ఇందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. కానీ కొంతమంది నిర్వాసితులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పలు వాయిదాల అనంతరం.. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో తగు న్యాయం చేయాలని సుమారు ఐదు నెలల క్రితం కోర్టు   ఉత్తుర్వు జారీచేసినట్టు తెలిసింది. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు ఇంతవరకు నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేయలేదు. కనీసం రోడ్డుపై గోతులు కూడా పూడ్చలేదు. ఈ నేపథ్యంలో మెయిన్‌ విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వి.అనిత ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఇటీవల పట్టణంలో ఆందోళన చేశారు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మెయిన్‌రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ద్విచక్రవాహనదారులు గోతుల్లో పడి ఆస్పత్రి పాలవుతున్నారు. వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరోవైపు ఈ రోడ్డు ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ ఆధీనంలో వుంది. తిరిగి ఆర్‌అండ్‌బీకి బదలాయిస్తేనే విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలవుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై  గోతులు పూడ్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2022-10-03T05:21:08+05:30 IST