పథకం ప్రకారమే హత్య

ABN , First Publish Date - 2020-06-06T17:43:28+05:30 IST

చిన్నమండెం మండలంలో సంచలనం సృష్టించిన..

పథకం ప్రకారమే హత్య

పోలీసుల విచారణలో వెల్లడి

22మంది నిందితుల అరెస్టు

నిందితులలో 14 ఏళ్ల బాలుడు


చిన్నమండెం(కడప): చిన్నమండెం మండలంలో సంచలనం సృష్టించిన పల్లపు శంకరయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప, చిన్నమండెం ఎస్‌ఐ హేమాద్రి హత్య జరిగిన తీరును విలేకరుల సమావేశంలో వివరించారు. పడమటికోన వడ్డిపల్లెకు చెందిన పల్లపు శంకరయ్య మూడు బస్తాల వేరుశనగ కాయలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయం వలంటీర్‌ ముత్తన శ్రీనివాసులు చెప్పడంతో అతడి పినతండ్రి ముత్తన రెడ్డెప్ప మే 29వ తేది శంకరయ్య ఇంటికి వెళ్లి డబ్బు అడిగాడు. దీనిపై ఇద్దరూ గొడవ పడుతూ రామాలయం వద్దకు చేరుకున్నారు.


ఇంతలో శంకరయ్య అన్న పల్లపు రెడ్డెయ్య మరికొందరు వచ్చి  వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఇంతలో శ్రీనివాసులు చిన్నాన్న నారాయణ కత్తితో పల్లపు రెడ్డెప్ప తలపై నరికాడు. రామచంద్ర కట్టెతో కొట్టాడు. స్థానికులు ఇరువర్గాలను మందలించడంతో అందరూ వెళ్లిపోయారు. గాయపడ్డ రెడ్డెప్పను ఆసుపత్రికి తీసుకుపోయి రాత్రి 10.30 గంటల సమయంలో మహేష్‌, సురేంద్ర, ధనుంజయ, కిశోర్‌, శంకరయ్య మోటరు సైకిళ్లపై పల్లెకు బయలుదేరారు. ఈ విషయం తెలిసి ముత్తన శ్రీనివాసులు వర్గీయులు కలిబండ రోడ్డులో వీరిని అడ్డుకొని దాడి చేయాలని పథకం వేశారు. 8మంది ఆడవాళ్లు కారంపొడి, కట్టెలతో.. శంకరయ్య, శ్రీనివాసులు, నారాయణ, యల్లప్ప కత్తులతో, మరో 10 మంది మగవాళ్లు కట్టెలు రోకటి బండలతో వారు రాగానే దాడి చేశారు.


ఈదాడిలో పల్లపు శంకరయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మహేష్‌, సురేంద్ర, ధనుంజయ తీవ్రంగా గాయపడ్డారు. కిశోర్‌ తప్పించుకున్నాడు. గాయపడ్డ మహేష్‌ తిరుపతిలో చికిత్స పొందుతున్నా అతని పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు కొందరు చిన్నమండెం స్టేషన్‌కు వచ్చి లొంగిపోగా మిగిలిన వారిని రామాపురం బస్టాప్‌లో అరెస్టు చేసి తీసుకువచ్చామని పోలీసులు తెలిపారు. మొత్తం 22 మంది నిందితులను ప్రత్యేక వాహంలో పోలీసు బందోబస్తు మద్య కోర్టుకు తీసుకువెళ్లారు. ముందుగా వీరికి వైద్య పరీక్షలు, కోవిడ్‌-19 పరీక్షలు చేసిన అనంతరం జైలుకు తరలిస్తారని తెలిపారు.


పది పరీక్షలు రాయాల్సి ఉంది

హత్యకేసు నిందితులలో ఒక బాలుడు(14) కూడా ఉన్నాడు. ఈ బాలుడు జూలై 10 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. 

Updated Date - 2020-06-06T17:43:28+05:30 IST