Abn logo
Jun 14 2021 @ 00:00AM

చెట్టుపై కాపురం

పలమనేరు రూరల్‌, జూన్‌ 14: ఏనుగుల వరుసదాడులతో బెంబేలెత్తిన ఓ రైతన్న పంటను కాపాడుకోవడానికి చెట్టుపై కాపురం పెట్టేశాడు. పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ చిన్నకుంట గ్రామానికి చెందిన నాగరాజుకు భార్య, ఇద్దరు సంతానం. ఉన్న రెండెకరాల పొలంలో వచ్చే అదాయమే ఆ కుటుంబానికి ఆధారం. ఈ ఏడాది రూ.1.10 లక్షలు వెచ్చించి వరిపంట పండించాడు. ఇందులో అర ఎకరాకు పైగా ఏనుగుల దాడుల్లో ధ్వంసమైంది.మిగిలిన ఒకటిన్నర ఎకరా పొలంనైనా కాపాడుకోవాలని నాగరాజు తన పొలం పక్కనే ఉన్న చింతచెట్టుపై చిన్నపాటి గుడారం వేసుకున్నాడు. వెలుతురు ఎక్కువగా ఉంటే ఏనుగులు భయపడి దగ్గరకు రావని పొలం చుట్టూ లైటింగ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. సాయంత్రం పొద్దువాలగానే భార్య, పిల్లలతో పాటు తన వద్ద ఉన్న శునకాన్ని తీసుకొని చింతచెట్టుపైకి ఎక్కి గుడారంలో జాగారం చేస్తూ వచ్చాడు. ఏనుగుల అలజడిని శునకం గుర్తించి మొరగడం ప్రారంభించగానే, నాగరాజు కుటుంబసభ్యులు అప్రమత్తమై చుట్టూ అమర్చిన లైట్లను ఆన్‌ చేస్తారు. వారివద్ద ఉన్న టార్చ్‌ లైట్లు వేసి కేకలు వేయడంతో ఏనుగులు వెనకడుగు వేశాయి. దీంతో నెల రోజులుగా చింతచెట్టుపై ఏర్పాటుచేసుకున్న గుడారంలో ఉంటూ ఏనుగులు తన పంటపైకి ప్రవేశించకుండా చేసి ఉన్న పంటను రక్షించుకోగలిగానని నాగరాజు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.