పాద‌పూజ‌ల‌కు డ‌బ్బులు... ఇలా అయితే ఎంకరేజ్ చేయొచ్చు

ABN , First Publish Date - 2020-05-15T23:14:23+05:30 IST

చినజీయర్‌ స్వామి సమాజంలో ఉన్న రుగ్మతలను రిపేరు చేయాలనుకొనే ఆధ్యాత్మిక మెకానిక్‌. మానవ సేవే మాధవ సేవ అనే నినాదం బదులుగా మాధవసేవ సర్వప్రాణికోటి సేవ అనే నినదించే సమతావాది.

పాద‌పూజ‌ల‌కు డ‌బ్బులు... ఇలా అయితే ఎంకరేజ్ చేయొచ్చు

కాషాయం కట్టుకుంటే శమ్ర లేకుండా పళ్లు, సంభావనలు వస్తాయి

రాజకీయాల్లోనూ మంచి వాళ్లున్నారు, చెడ్డవాళ్లున్నారు

ఈ రోజుల్లో దొంగతనం చేయలేం.. సేఫ్‌ కూడా కాదు

ఇలా వేషం వేసుకుని డిస్కో డాన్స్‌ చేస్తాననంటే తప్పు

క్రిస్టియన్లు, ముస్లింలు రోజూ చదువుతారు.. హిందువులు మాత్రం

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో శ్రీ చిన్న జీయర్ స్వామీజీ


చినజీయర్‌ స్వామి సమాజంలో ఉన్న రుగ్మతలను రిపేరు చేయాలనుకొనే ఆధ్యాత్మిక మెకానిక్‌. మానవ సేవే మాధవ సేవ అనే నినాదం బదులుగా మాధవసేవ సర్వప్రాణికోటి సేవ అనే నినదించే సమతావాది. ప్రస్తుతం ఉన్నది భక్తా? వాపా?.. సమాజంలో కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరముందనే సంస్కరణవాది. ఆయన 60వ తిరునక్షత్రోత్సవ సందర్భంగా- ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆయనతో 6-11-2016న జరిగిన ఓపెన్‌ హార్ట్‌ విత ఆర్కే కార్యక్రమం కోసం సంభాషించారు. ఆ విశేషాలు..

 

ఆర్కే: నమస్కారం స్వామి

చినజీయర్‌స్వామి: జైశ్రీమన్నారాయణ

 

ఆర్కే: 60 దీపావళిలు చూశారు. ఇప్పటికీ ఇంత యవ్వనంగా ఉండటానికి కారణం ఏంటి?

చినజీయర్‌స్వామి : పాడుపనులు చేయం. అవసరం లేనివి ఆలోచించం. రోజూ వ్యాయామం చేస్తాం. అంతకంటే కారణం ఏమీ లేదు. అవసరం లేనివి ఆలోచించం.

 

ఆర్కే: పాడు ఆలోచనలు కూడా రావు

చినజీయర్‌స్వామి: అవసరం లేదు.అవసరం లేనివి ఆలోచించం.

 

ఆర్కే: ఈ మధ్యకాలంలో కాషాయం వేసుకునే వారి సంఖ్య పెరిగింది. మీలాంటి కొద్దిమంది తప్పితే మిగతావాళ్లందరూ అప్రతిష్ట కూడా తెస్తున్నారు. దానిపై మీరెప్పుడైనా మదనపడుతుంటారా?

చినజీయర్‌స్వామి: ఉత్తరభారతదేశంలో కాస్త వైరాగ్యం కలగగానే వెంటనే కాషాయం ధరించే ఒక పద్ధతి ఉంది. రెండోది యువతగా ఉన్నప్పుడే ఉత్తేజం, ప్రేరణతో కాషాయం ధరించి ధర్మ ప్రచారం చేసే వాళ్లు ఉన్నారు. కాషాయం కట్టుకుంటే యాచకుడిగా ఉండటానికి ఒక అధికారం ఎర్పడుతుంది అనే భావన వల్ల అలాంటి వాళ్లు ఉత్తర భారతదేశంలో కనిపిస్తారు. దక్షిణ భారతంలో ఇలాంటి వారు తక్కువే.

 

ఆర్కే: ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో సెల్ఫ్‌ డిక్లేర్డ్‌ పీఠాధిపతులు వచ్చేస్తున్నారు కదా?

చినజీయర్‌స్వామి: కాషాయం కట్టుకుంటే బయటకు రాగానే నమస్కారాలు ఎక్కువవుతాయి.శమ్ర అక్కర్లేకుండా పళ్లు, సంభావనలు వస్తాయి.వాటిమీద ఆశ ఉండే వాళ్లు సహజంగానే అలాంటివాటిని ప్రిఫర్‌ చేస్తుంటారు.ఇతరత్రా బతకడానికి అవకాశాలు లేవు అనుకున్నప్పుడు ఇటువైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలాకాకుండా చాలా మంది వస్తుండవచ్చు.

 

ఆర్కే: దీనివల్ల హిందు ధర్మానికి అపచారం జరగదా? ప్రజల్లో అపనమ్మకం ఏర్పడదా?

చినజీయర్‌స్వామి : ఎప్పుడైనా మంచి, చెడులు అన్ని చోట్ల ఉంటాయి. వెలుగు ఉన్నప్పుడు నీడ తప్పదు. కొంతమంది కొన్ని పాడుపనులు చేసినంత మాత్రాన అందరిపైనా ఆరోపణలు చేయటం విజ్ఞత కలిగిన సమాజం చేయదు. ఎవరినైనా వ్యక్తిగా గుర్తిస్తాం. చెడు ఉంటే అది వ్యక్తికి ఆపాదిస్తాం. మంచి ఉంటే ఆ వ్యక్తిని తయారుచేసినటువంటి వెనకాల ఉన్న ఆ పరంపరకు ఆపాదిస్తాం. రాజకీయాల్లోనూ మంచి వాళ్లున్నారు, చెడ్డవాళ్లున్నారు. వ్యాపారాల్లో ఉన్నారు.

 

ఆర్కే : వాళ్లలో ఉండటం వేరు, ధర్మప్రచారకర్తల్లో ఉండటం వేరు కదా?

చినజీయర్‌స్వామి: కాషాయం కట్టగానే ఇతనొక ప్రామాణికుడు అనే భావన సమాజంలో ఉంది.

 

ఆర్కే: ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి అనుకుంటారు కదా..

చినజీయర్‌స్వామి: నిజానికి అది సరికాదు. కాషాయం కట్టాలంటే యోగ్యత కావాలి. దానిని సాధించే పరంపర, ప్రక్రియ మనకున్నాయి. దాని ద్వారా వచ్చిన వ్యక్తులైతే అధికారికంగా ఉండగలుగుతారు. అలా లేకుండా వస్తే గాలి ఎటువీస్తే అటు సాగుతుంటారు. మనకు పరంపరగా సాగేటువంటి కొన్ని పీఠాలున్నాయి. అలాంటి పీఠాల్లో ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి పెట్టరు. ఒక శిక్షణ, దానికి కట్టుబాటు, ఒక నడవడి దాంతో పాటు శాస్త్రం వాళ్లకు అందించి దాంట్లో వాళ్లు నిష్ణాతులు అని నిరూపణ జరిగిన తరువాతే వాళ్లను ప్రవేశపెడుతుంటారు. లేదా వాళ్లను ప్రవేశపెట్టిన తరువాత ఆ శిక్షణను అందించడమైనా చేస్తారు. ఇది అధికారికంగా ఉండాలనుకునే వారి స్థితి. అలాకాకుండా స్వేచ్ఛగా ఉండాలనుకునే వాళ్లకు హద్దు ఉండదు. వాళ్లు చెప్పినా ప్రమాణం కూడా కాదు. కాని దురదృష్టం కొద్దీ సమాజం కూడా అలాలేదు. దేనికి పబ్లిసిటీ ఉంటే అది గొప్పది అనుకునే కాలం. పనికిరాని ఒక వస్తువైనా దాన్ని రోజూ టీవీలో ఒక ఇరవై సార్లు చూపిస్తే గొప్ప వస్తువు కాబోలు అనే భావన కలుగుతోంది. ఆ రకమైన పబ్లిసిటీ లేకపోతే ఇది వస్తువే కాదని అనుకునే లక్షణం సమాజంలో ఉంది. అలాంటి వాటి వల్ల సమాజం నిలబడదు. అలాంటి వారి వల్ల సమాజం నాశనం కాదు కూడా. తాత్కాలికంగా కొంత ఉపద్రవం జరగడం వాస్తవం. ఎవరైతే శాస్త్రం చదువుకుని, పరంపరను నేర్చుకుని ఇవ్వగలిగేంత విజ్ఞానం వాళ్ల దగ్గర ఉంటుందో అలాంటి వాళ్లు పదికాలాల పాటు చెప్పగలిగింది చెబుతుంటారు, చేయగలిగింది చేస్తుంటారు. మిగతావి పొంగులాగా వస్తాయి కొంత కాలం తరువాత కాలంలో కలిసి పోతాయు.

 

ఆర్కే: కొంతమంది స్వాములు ఇంటికెళ్లి కాళ్లు కడిగితే డబ్బులు తీసుకుంటారు. పూజంటే డబ్బులు.. ప్రతిదానికి డబ్బుతో లింక్‌ ఉంది. దీనివల్ల నిజమైన భక్తులకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలియదు. కానీ...

చినజీయర్‌స్వామి: దీన్ని రెండు రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. సమాజంలో రకరకాలుగా ఆర్జన చేసే వాళ్లున్నారు. వాళ్లు సమాజహితం కోసం ఖర్చుపెట్టరు. వాళ్లకు సమాజంలో చాలా అవసరాలున్నాయి. బీదవాళ్లు ఎంతో మంది ఉన్నారు. చదువు లేకుండా ఎంతో మంది ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ అవి చేద్దామనే మనసు రాదు. అలాంటివాళ్లలో కూడా కొంతమంది ఈ ఆర్జించినది ఏదోరకంగా కొంత ప్యూరిఫై అవుతుందని పూజో, పునస్కారమో, యజ్ఙమో చేస్తే తగ్గుతుందని చేస్తారు. ఆ ద్రవ్యాన్ని తీసుకున్న వ్యక్తులు మళ్లీ ఆ ద్రవ్యాన్ని సామాజిక హితకార్యాలకు ఉపయోగిస్తే వాళ్లు పాదపూజలు చేయించుకున్నా, సంభావనలు పుచ్చుకున్నా కొంత ఎంకరేజ్‌ చేయవచ్చు.

 

ఆర్కే: ఇటీవలి కాలంలో భక్తి ఒకరకమైన వ్యాపారంలాగా కూడా మారింది కదా? మీరు ఏ పాపం చేసినా పర్వాలేదు. సాయంత్రం ఈ దీపారాధాన చేస్తే సరిపోతుంది అని చెప్పే వాళ్లు పెరిగారు. దాన్ని అరికట్టడం ఎలా?

చినజీయర్‌స్వామి : వ్యక్తిలో బలహీనత ఉంది అని తెలియగానే దాని రకరకాలుగా దుర్వినియోగం చేయాలనే వ్యక్తులు వేల మంది ఉంటారు. ఒకసారి 1986లో కరీంనగర్‌లో అనుకుంటా. ఉదయం నాలుగు గంటలకు స్నానానికి వెళ్తుంటే.. ఒక ఆవిడ తన ఇద్దరమ్మాయిలను తీసుకువచ్చి- ‘‘స్వామి! మా చేయి చూస్తారా?’’ అని అడిగింది. కారణమడిగా. ‘‘మాకు అబ్బాయిలు కావాలండి. అబ్బాయిలు పుడతారా? లేదా.. చెప్పండి చాలు’’ అంది. ‘‘మాకు తెలియదు. ఇంకోసారి ఎవరిని ఇలా అడగకు. నువ్వు చేయి చూపించి అడిగితే- నీలో ఉన్న బలహీనతను వాడుకోవటానికి ఆ పూజ చేస్తాం..బంగారం పట్టుకురా అనే వాళ్లు ఉండచ్చు. నువ్వు తీసుకువచ్చిన తర్వాత మళ్లీ మాయమయిపోవచ్చు’’ అని చెప్పాం. వాస్తవానికి ఆమె భక్తురాలుట. ఇద్దరు మగపిల్లలు యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత దేవుడిని పూజించటం మానేసింది. ‘‘మగపిల్లలు ఏదో చేస్తారు.. ఆడపిల్లలు ఏదో చేయరనే భావన వద్దు.. దేవుడిని పూజించు..నీకు మేలు జరుగుతుంది..’’ అని చెప్పి పంపేసా. తమ చుట్టుపక్కల వాళ్లను చూసి స్టేటస్‌కు మించిన కోరికలు కలుగుతూ ఉంటాయి. వీటిని తీర్చుకోవటానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు.


ఆర్కే : మీరు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

చినజీయర్‌స్వామి : మేం ఎంచుకున్నది కాదిది. మా గురువు గారు ఇలా ఉండాలని నిర్దేశం చేశారు. మేం ఈ మార్గంలోకి వచ్చాం. 1979 డిసెంబర్‌ 31 వైకుంఠ ఏకాదశి నాడు మా పెద్దస్వామి సిద్ది పొందారు. వారు సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుండేవారు. మనదేశంలో హరిజనకాలనీలో పక్కా ఇళ్లను నిర్మించింది మా పెద్దస్వామి వారే. వారు సిద్ది పొందడానికి ముందు తిరుపతి కొండపై 1008 గుండాలతో పెద్ద యాగం చేయాలి అని కావలసిన పూర్వరంగాన్ని అంతా సిద్ధం చేశారు. వారు పరమపదించిన తరువాత అప్పటి పెద్దలంతా ఆ కార్యం జరగాలంటే ఎవరో ఒకరు నిలబడాలి అని నిర్ణయించారు. అప్పటికే పెద్దస్వామి వారు ఆ కార్యాన్ని నేను చేస్తే బాగుంటుందని భావించారు. మా గురువుగారిపైన విశ్వాసం, ప్రేమ చేత వారి మార్గంలో నడవాలనుకున్నాం. దాంతో మేం కొనసాగిస్తాం అని తీసుకున్నాం. ఇప్పటి దాకా వారు ఆశించిన సంకల్పాలకి విరుద్దంగా అయితే ఏమీ చేయడం లేదు. ఆశించినంత చేయలేకపోయినా కొంత చేస్తున్నాం.


కోపం వచ్చేవాడికి కోపం వచ్చి వెళ్లేదాకా తెలియదు


ఆర్కే: ప్రారంభంలో మీరు కనీసం విదేశాలకు వెళ్లడానికి కూడా నిరాకరించారు కదా! తర్వాత ఎందుకు మార్చుకున్నారు అభిప్రాయాన్ని ?

చినజీయర్‌స్వామి: దానికి కూడా రెండు కారణాలు. 1992 అప్పట్లో మమ్మల్ని యు.ఎస్‌కు వస్తారా అని అడిగారు. ఐ సెడ్‌ నో. అక్కడ కూడా చాలా మంది ఇంట్రెస్ట్‌ ఉండేవాళ్లు ఉన్నారు. వస్తే బావుంటుంది అని అడిగారు. అక్కడికి వెళితే ఇంగ్లీషు రావాలి. మేమేమో తెలుగు మీడియం చదువుకున్నవాళ్లం. ఇంగ్లీషు కూడా పెద్దగా రాదు. అందువల్ల రాము అన్నాం. 92లోనే నాకొక డాక్టర్‌ గారు ఉన్నారు విజయవాడలో డాక్టర్‌ నాగేశ్వరరావు గారు. ఆయన వైఫ్‌ సుధ వాళ్లిద్దరు రావడానికి మీ ఆబ్జెక్షన్‌ ఏమిటి? అని అడిగారు. ఒకటి నీళ్లు. రెండవది ఆహారం. అక్కడి ఆహారం ఎట్లా ఉంటుందో తెలియదు కదా! కాకపోతే ఆహారానికి ఇబ్బందేమీ ఉండదు మనకు తగిన శాకాహారమే దొరుకుతుంది. కానీ నీళ్లకేమిటి ఆబ్జెక్షన్‌ అంటే, మేము స్టాక్‌ ఉండే నీటిని యూజువల్‌గా వాడం. బావి, చెరువు. డైరెక్టెగా టాప్‌ చేసిన నీరైతే తీసుకుంటాం. మధ్యలో ఎవరైనా తాకినవైతే తాగడానికి మాకు ఇష్టంఉండదు.


ఆర్కే: మీరు బాటిల్‌ నీరు తాగరా

చిన్నజీయర్‌ స్వామి: తీసుకోం.

 

ఆర్కే: అనివార్య పరిస్థితి వస్తే?

చిన్నజీయర్‌ స్వామి: రాలేదు ఇప్పటిదాకా. అదర్‌వైజ్‌ నేరుగా టాప్‌ చేసిన నీళ్లైతే తీసుకుంటాం. మేము గమనించినంత వరకు మన ఇండియన్‌ సినేరియాలో ఈ టాప్‌, డ్రైనేజ్‌ కలసి ఒక దానిలోంచే సాగుతుంటాయి యూజువల్‌గా. ఐ థింక్‌ దటీస్‌ నాట్‌ గుడ్‌ అని మేము వాడం. ఈ విషయమై మేము అక్కడికి వెళ్లి ఈ దృష్టితో వెళ్లి చూసి వస్తాం అన్నారు. అలా అమెరికా వెళ్లి తిరిగి వచ్చాక మాతో చెప్పారు. నీటి కంటామినేషన్‌ అక్కడ ఉండదండి. ఎందుకంటే తాగే నీరు రోడ్డుకు రెండు వైపులనుంచీ వెళతాయి. డ్రైనేజ్‌ పైపులు ఇంకో వైపునుంచి వెళతాయి. రెండవది నేరుగా భూమిలోంచి వచ్చే నీరు ట్యాంక్‌లోకి ప్యూర్‌గానే వెళతాయి తప్ప మధ్యలో ఎవరో చేయి పెట్టే పరిస్థితి ఉండదు. మూడవది వాటర్‌ ఫ్లో ఎప్పుడూ ఆగదు. ఆగితే కదా స్టాక్‌ అయ్యేది! వాటర్‌ కాన్‌స్టాంట్‌లీ ఇట్స్‌ కీప్‌ ఆన్‌ ఫ్లోయింగ్‌. అంచేత దట్స్‌నాట్‌ ఏ ఇష్యూ అండీ అని చెప్పారు. అలా చెప్పినా అప్టట్లో మాకు వెళ్లాలనిపించలా.

 

ఆర్కే: మీరు ఆగిన నీరు అని చెప్పారు కదా! చెరువులో నీరు ఆగే ఉంటుంది కదా!

చిన్నజీయర్‌ స్వామి: భూమితో టచ్‌ అయి ఉంటుంది కదా! 1993లో నరక చతుర్దషి నాడు, బాస్టన్‌లో డాక్టర్‌ అమణి అనే ఒక ట్రేడిషనల్‌ లేడీ ఉండేది. ఆమె అమెరికా వెళ్లినా ఇండియన్‌ డ్రెస్‌లోనే ఉంటారు. ఆవిడ వచ్చారు. మీరు రాకపోతే ఎట్లాగండి అన్నారు. ప్రస్తుతానికైతే నేను రాదలుచుకోలేదు. అయినా ఆలోచిస్తాంలెండి అన్నాం. దీపావళి ఫంక్షన్‌ జరిగింది. ఆ మరునాడు ఆరాం చేసుకునే పెరుమాళ్లు బయటికి వెళ్లిపోయాడు. ఆశ్రమంలో దొంగతనం జరిగింది. మా పెద్ద స్వామి గారి వద్దనుంచి వచ్చిన పూజసామగ్రిని, దొంగలు తీసుకుపోయారు.ఒక మూడు రోజులు పెరుమాళ్లు బయటే ఉండి ఆ తర్వాత కోటేశ్వరరావనే ఒక పోలీస్‌ ఆఫీసర్‌ ద్వారా తిరిగి వచ్చేశారు. ఎందుకిలా బయటికి వెళ్లిపోయాడు. అసలెందుకు ఇలా జరిగిందనేది మాకసలు అర్థం కాలేదు. మే బి దటీజ్‌ ఎవే ఆఫ్‌ ఎ వరల్డ్‌. అయినా మేము ఆ తర్వాత ఎందుకిట్లా జరిగిఉంటుందని ఆలోచన చేశాం. అయితే పోలీసాఫీసర్‌... ఈ విగ్రహాలను విదేశాలకు ఎక్ప్‌పోర్ట్‌ చేయడం కోసం తీసుకువెళ్లారని చెప్పారు అది విని బహుషా ఈయనకు విదేశాలకు వెళ్లాలనిపించి ఉంటుంది. అనుకున్నాం.అయినా నన్ను వదిలేసి వెళ్లిపోవడానికా.. నీకు వెళ్లాలనిపిస్తే, మేమూ వస్తాం కదా! అనుకున్నాం. దట్‌ ఈజ్‌ ద థాట్‌ వాట్‌ క్రాస్డ్‌ థ్రూ....ఈ సంఘటన జరగ్గానే మేము అమెరికా వస్తామని చెప్పేశాం.


ఆర్కే: మీరు ఇంగ్లీష్‌తో పాటు మరికొన్ని ఇతర భాషల్లో కూడా పట్టుసంపాదించారు కదా!

చిన్నజీయర్‌ స్వామి: ఆ తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది.

 

ఆర్కే: మొత్తంగా మీకు ఎన్ని భాషలు వచ్చు?

చిన్నజీయర్‌ స్వామి: తెలుగు వచ్చును వస్తుందో రాదో నాకు తెలియదుకానీ, అనుకుంటున్నాం వచ్చునని. ఇంగ్లీష్‌ కొద్దిగా నడుస్తూ ఉంటుంది ఫరవాలేదు. ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి హిందీ వ చ్చింది. తమిళనాడు వైపు తిరగడం వ ల్ల తమిళం వచ్చింది. అప్పుడప్పుడు నేపాల్‌ దేశానికి వెళుతుంటాం. అక్కడ చాలా మంది ధార్మికులు ఉంటారు. అక్కడక్కడ తిరగడం వల్ల కొద్దికొద్దిగా అది కూడా మాట్లాడుతుంటాను. చదువుకున్న గ్రంధాలన్నీ అవే కాబట్టి సంస్కృతం వచ్చింది.

 

ఆర్కే: మీరింత సౌమ్యంగానూ, న వ్వుతూ, చమత్కారంగానూ మాట్లాడుతున్నారు కదా! అప్పుడప్పుడు మీకు చిరుకోపం లాంటిది కూడా వస్తుందట కదా! ఎటువంటి సందర్భాల్లో కోపం వస్తుంది?

చిన్న జీయర్‌స్వామి: కోపం వచ్చేవాడికి కోపం వచ్చి వెళ్దేదాకా తెలియదు కదా!


ఇలా వేషం వేసుకుని డిస్కో డాన్స్‌ చేస్తాననంటే తప్పు


ఆర్కే: కోపం రాదా మీకు?

చిన్నజీయర్‌ స్వామి: కోపం రానివాడు మనిషెలా అవుతాడు?


ఆర్కే: మీకు కోపం రాకూడదు కదా! వాటన్నింటినీ కంట్రోల్‌ చేసుకోవాలి కదా!

చిన్నజీయర్‌ స్వామి: భూమ్మీద మనిషై పుట్టినతర్వాత ప్రకృతి ప్రభావం తప్పనిసరిగా మనిషి మీద ఉంటుంది. లేదనుకున్నాడంటే, వాడు మోసం చేస్తున్నాడని అర్థం.


ఆర్కే: మరైతే కామక్రోధమధ మాత్సర్యాలను వదిలేయాలని ఎలా చెప్పారు? 

చిన్నజీయర్‌ స్వామి: వదిలేయాలంటే అవి పోయేవి కాదు కదా! వదిలేస్తే శరీరంతో పాటే అవి పోతాయి. రామచంద్రుని గురించి రామాయణంలో చెప్పాడు. జితక్రోదః అంటూ కోపం కూడా రాముడికి ఉంది. అది అవసరమైనప్పుడు వస్తుంది. అవసరం లేనప్పుడు రాదు. ఊరికే కనిపించిన వాడిమీదల్లా చిటపటలాడటం దటీజ్‌ బ్యాడ్‌ థింగ్‌. కోసం లేకుండా మనిషి ఎలా ఉంటాడండి! ఒక మనిషి తప్పు చేస్తున్నాడు. తప్పంటే నాకు తప్పు చేస్తే హాని అని నేననుకోను. కానీ పది మందికి హాని చేస్తే నేను తప్పనుకుంటాను. అలా హాని జరుగుతున్నప్పుడు ఆపగలిగే శక్తి నీకు ఉంది. కనీసం అది తప్పు అని చెప్పగలిగే యోగ్యత నీకు ఉంది. చె ప్పకుండా కూర్చున్నావంటే ఆ తప్పులో ఎక్కువ శిక్ష నీకే వేయాలి. తప్పు చేసినవాడికి కాదండి. జరిగే తప్పును చూస్తూ కూర్చున్నవాడికి ఎక్కువ శిక్ష వేయాలి. బికాస్‌ ఆదర్‌వైజ్‌ హీ ఈజ్‌ ఎంకరేజింగ్‌ దట్‌. మమ్మల్నంటే మాకేం పెద్ద కోపం రాదు మమ్మల్ని తిట్టే వాళ్లు బోల్డుమంది ఉంటారు. కానీ, సమాజానికి హాని కలిగించే సిచువేషన్‌ ఏదైనా ఏర్పడినప్పుడు సహజంగానే కోపం వస్తుంది. చాలా తీవ్రంగా కూడా వస్తుంది. ఒక్కోసారి ఔట్‌ ఆఫ్‌ ద వే వెళ్లిపోతుంటాం. ఔట్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అయిపోతుంటాం.

 

ఆర్కే: అంత కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తుంటారు?

చిన్నజీయర్‌ స్వామి: మామూలు వాళ్లయితే తలుపులు పగల కొడతారు. రోడ్లమీద తిరుగుతారు, కార్లను పగలకొడతారు. ఆడవాళ్లయితే గరిటలూ, అప్పడాల కర్రలూ విసురుతారు. మా దగ్గర అలా వేయడానికి ఏమీ ఉండవు. చేతిలో దండం ఉంటుంది. అది విసరడానికి పనికొచ్చేది కాదు. మా దగ్గర ఉండేది మాట ఒక్కటే కనుక సమాజానికి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. చెడు జరిగేది సమాజానికే. లేదా చరిత్రకి. చరిత్రను రక్షించుకోవడం అన్నది సమాజపు కర్తవ్యం. సమాజం అంటే వ్యక్తులే కదా! అదంతా వ్యక్తుల బాధ్యత. వ్యక్తులు తమ బాధ్యతను వాళ్లు గుర్తించలేకుండా ఉండి ఉంటే, అలాంటి వారికి ఇది నీ బాధ్యతయ్యా అని చెప్పడం మా బాధ్యత. ప్రభుత్వాలు గానీ మరిచిపోతే ప్రభుత్వాలకు చెప్పడం మా బాధ్యత. చెప్పగలిగి ఉండీ, లేదా అదేమిటో తెలిసి కూడా మేము మౌనంగా కూర్చున్నామూ అంటే, మేము కూడా దోషులకిందే లెక్క. మాకెప్పుడైనా కోపం రావడం అంటే అలాంటివి జరిగినప్పుడే కోపం వస్తుంది.

 

ఆర్కే: అలాంటప్పుడు నోటికి పనిచెప్పడమే. చేతికి పని చెప్పలేరు కనుక.

చిన్నజీయర్‌ స్వామి: దానికి వినకపోతే వినిపించేటంత వరకు కృషి చేద్దామనిపిస్తుంది. అప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటాం.

 

ఆర్కే: మీరు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇదే ఆహార్యమా?

చిన్నజీయర్‌ స్వామి: సేమ్‌. ముక్కు మారదు, కళ్లు మారవు. చెవులూ మారవు. ఏదీ మారదు.అలాంటప్పుడు డ్రెస్‌ మాత్రం ఎందుకు మారడం?


ఆర్కే: ఈ దండ ఒక్కొక్కరి వద్ద ఒక్కోలా ఉంటుంది అసలీ ఈ దండం ప్రాశస్త్యం ఏమిటి?

చిన్నజీయర్‌ స్వామి: ఇది వ్యక్తి యొక్క తత్వాన్ని చెబుతుంది. ఒక విశ్వాసాన్ని మీకు కలిగి ఉన్నాం. ఇది మా విశ్వాసానికి ప్రతీక ఈ దండం. కొంత మంది ఏక దండులు ఉంటారు. వాళ్లకు తత్వం ఒకటి. మాకు తత్వాలు మూడు. మేము మూడు తత్వాలను విశ్వసిస్తాం. మనం చూసే ఈ ప్రకృతి అంతా వాస్తవం. కొంతమంది ఈ ప్రకృతి వాస్తవం కాదంటారు. ఇదంతా మాయ. ఇదంతా కల. ఇదంతా అవాస్తవం. ఇదొక మిథ్య అంటూ ఉంటారు. అది మాకు వేదం చెప్పలేదు. అందుకే దాన్ని మేము అంగీకరించం. ఇందులో కనిపించే ప్రతివస్తువూ వాస్తవమే. ప్రతి భావనా వాస్తవమే.

 

ఆర్కే: అసలు ప్రకృతి మిథ్య అని ఎవరైనా ఎలా అనగలరు?

చిన్నజీయర్‌ స్వామి: దానికి వాళ్లేం చెప్పారంటే మనకు కల వస్తోంది. కలలో ఎన్నో కనిపిస్తున్నాయి. మెలుకువ రాగానే ఏమైపోతున్నాయి ఇవన్నీ ఇండ్యువల్‌గా కలిగే తాత్కాలికంగా కలిగే చిన్న భావనలు.

 

ఆర్కే: అలా చెప్పేవాళ్లు క్యారీ చేసే దండం అది కూడా వెదురు బొంగే కదా! అది ప్రకృతిలోంచి వచ్చిందే కదా! అది మిధ్య ఎలా అవుతుంది?

చిన్నజీయర్‌ స్వామి: వాళ్ల శాస్త్రాలు చెప్పాయి కదా! ఏకదండం కూడా తీసుకోవచ్చునని కూడా శాస్త్రం చెప్పింది. కాన్సెప్ట్‌ అది. తమదైన స్థాయి ఉంటుంది. అదొక రకమైన ఆలోచనా విధానం. తప్పు కాదది. ఆ ఆలోచన ఉండవలసిన స్థాయి ఒకటి. ఆ స్థాయి వాళ్లకు ఆ ఆలోచన తప్పు కాదు. వాళ్లలా ప్రవ ర్తించగలుగుతున్నప్పుడు. అలా ఉండి ఇలా ప్రవర్తిస్తానంటే తప్పు. ఇలా వేషం వేసుకుని డిస్కో డాన్స్‌ చేస్తాననంటే తప్పు. ఒక్కొక్క స్థాయి. దానికొ ఒక్కొక్క నియమం, దానికొక దారణ ఇవి మనకు నియమాలు. మేము మూడు తత్వాలు చెబుతాం. నాలుగవ దానికి పర్సస్‌ ఉంది. మాకు ప్రపంచంలో కనిపించే ప్రతిదీ, ప్రతి భావనా ఏది మన ఆలోచనల్ని క్రాస్‌ చేస్తుందో అవన్నీ సత్యాలు, వాస్తవాలు. కాబట్టి వాస్తవాల్లో బతుకు. వాస్తవ ప్రపంచంలో అవాస్తమైన మాటలు మాట్లాడతానంటే ఎలా?


వైష్ణవం అనేది ఎవరో ఒకరు కొత్తగా పుట్టించిన కాన్సెప్ట్‌కాదు


ఆర్కే: మీరు సామాజిక కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు కదా?

చినజీయర్‌స్వామి: భక్తులు సహకరించినంత మేరలో మేం చేస్తున్నాం. చాలా మంది మమ్మల్ని ఆక్షేపిస్తుంటారు. ఒకవైష్ణవ సంప్రదాయానికి చెందిన స్వాములై ఉండి ఆ సంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోక హెల్త్‌క్యాంప్‌లు, ట్రైబర్‌ ఏరియాస్‌లో యాక్టివిటీస్‌ ఏంటి? అని ఆక్షేపిస్తుంటారు. సామాజిక కార్యక్రమం అనేది దైవకార్యక్రమంలో ఒక భాగం.


ఆర్కే: మానవసేవే మాధవసేవ అన్నారు కదా? 

చినజీయర్‌స్వామి:మా దృష్టిలో అది కాదు. మానవసేవయే మాధవ సేవ అనుకున్న వాళ్లు మనిషిని తప్ప మిగతావాటిని చూడటం మానేశారు. దానివల్ల ఈరోజు ఓజోన్‌పొరకు రంధ్రం పడటం దగ్గర్నుంచి చెట్లు నాశనం అయ్యాయి. నీళ్లు కంటామినేట్‌ అయ్యాయి. ఎర్త్‌పొల్యూట్‌ అయింది. ఇవన్నీ దీనివల్ల వచ్చిన దోషాలే. మానవసేవయే మాధవ సేవ అంటే మిగతావి కాదు అని అర్థం.


ఆర్కే: పరంపరకు మూలపురుషుడైన రామానుజాచార్యుల వారు నారాయణ అష్టాక్షరీ మంత్రం అందరికీ చేరువ కావడం కోసం నరకానికి పోవడానికి సిద్ధమని అన్నారట కదా? మరి ఇందులో వైరుద్యం ఉండాల్సిన అవసరం ఏముంది?

చినజీయర్‌స్వామి: ఎగ్జాట్లీ. అర్థం చేసుకోవడంలో తేడాలుంటాయి కదా విషయం అదే అయినా. గీత అదే, ఉపనిషత్తు అదే, బ్రహ్మసూత్రాలు అవే. అర్థం చేసుకున్న వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా భాష్యాలు రాశారు. లా ఒక్కటే ఇంటర్‌ప్రిటేషన్‌లు వేరు. రామానుజాచార్యుల వారే ఇందుకు ఆద్యులు కాదు. రామానుజాచార్యులకు ప్రేరణనిచ్చిన గురువులున్నారు. వాళ్లకు ప్రేరణనిచ్చిన రుషులున్నారు. వాళ్లకు ప్రేరణనిచ్చిన ఉపనిషత్తులున్నాయి. వైష్ణవం అనేది ఎవరో ఒకరు కొత్తగా పుట్టించిన కాన్సెప్ట్‌కాదు. రామానుజాచార్యుల గురువు పేరు యావనాచార్యులు. అత్యంత ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తి. కానీ వయసు పెద్దది. అంతేకాకుండా చొచ్చుకుపోయే స్వభావం లేదు. దానివల్ల సిద్ధాంతాన్ని సమాజంలోకి సమర్ధవంతంగా తీసుకురాలేకపోయారు. అదే సమయంలో సిద్ధాంతాన్ని సమర్ధవంతంగా ఎవరు తీసుకెళ్లగలరు అని గమనిచింనపుడు వారికి రామానుజాచార్యుల వారు కనిపించారు.


ఆర్కే: వేదాలలో ఎక్కడైనా ప్రాతిపదిక ఉందా? దళితులు, శూద్రులు అని మెన్షన్‌ చేయడానికి..

చినజీయర్‌స్వామి: వర్ణవ్యవస్థ ఉంది. మనుషుల్లో కెపాసిటీస్‌ను బట్టి ఎవరు ఏం చేయాలో అది చేస్తున్నారు. వారు చేస్తున్న ఉద్యమానికి, పనికి తగిన పేరు పెడతారు. వ్యక్తుల్లో తారతమ్యాలు బైనేచర్‌ ఉంటాయి.


ఆర్కే: అంటరానితనం అనేది...

చినజీయర్‌స్వామి: జామ, కొబ్బరి, మామిడి... ఈ మూడు నేచర్‌లో నుంచి వచ్చాయి. నేచర్‌లో నుంచే వచ్చిన కేటగిరీలు వేరు. అయితే మామిడి గొప్ప జామ గొప్పది కాదు అనడం తప్పు. దేనిలో ఉండే గుణాలు దానివి. అన్ని అన్నింట్లో గొప్పవి కావు. కొన్నింట్లో గొప్పవి అవుతాయి. దాన్ని మనం గుర్తించగలిగితే కాంట్రవర్సీ ఉండదు.


ఆర్కే: మీరు ఇంత విడమరిచి చెబుతున్నా సమాజంలో ఎందుకు మార్పు రావడం లేదు?

చినజీయర్‌స్వామి: చాలా కారణాలున్నాయి. మా పెద్దస్వామి వారు ప్రచారం ప్రారంభించకముందు మహిళలు సమాజ కార్యక్రమాల్లోకి రావడం లేదు. పండితులు పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడమే తప్ప పక్కవాడితో మాట్లాడటం లేదు. బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు కలిసి కార్యక్రమంలో పాల్గొన్నది లేదు. వైష్ణవులు, శైవులు ఎప్పుడూ కలిసే వారు కాదు. ఇది ఆనాటి వాతావరణం. మాస్వామి వారు కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత ప్రతి శుక్రవారం పూజలు చేయాలి అని కృష్ణాజిల్లాలో గ్రామగ్రామాన నడిచి తిరిగారు. దాంతో శుక్రవారం వచ్చేటప్పటికి మహిళలందరూ ఒకచోట కలవడం, పూజలు చేయడం మొదలుపెట్టారు. అది అప్పట్లో మహోద్యమంలా సాగింది. ఒక సభావేదిక పెట్టి పండితులందరినీ మాట్లాడమని చెప్పాడు. సాయంకాలం పూట సాముదాయక పూజలన్నీ చేయించేవారు. బ్రాహ్మణ, అబ్రాహ్మణ తేడా లేకుండా వేలమంది కలిసి పూజలు చేసేవారు. ఇప్పటికీ మేం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. మేం చేసేది మరింత విస్తృతం అయింది. గ్రామగ్రామాలకు వెళ్లాం. ఈ మాత్రమైనా చేయగలుగుతున్నాం అంటే ప్రజల్లో ఆ రకమైన మార్పు, శ్రద్ధ వచ్చిందని అనుకోవచ్చు.


ఆర్కే: భక్తి చిన్నప్పటి నుంచి ఉందా? యవ్వనంలో నాస్తిక భావాలుండేవి అంటారు, నిజమేనా?

చినజీయర్‌స్వామి: యస్‌, కమ్యునిస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉండేవారు. మార్క్సిస్ట్‌, లెనినిస్ట్‌ ఫ్రెండ్స్‌ కూడా ఉండేవారు.


ఆర్కే: ఇప్పటికీ మీ పాత మార్క్సిస్ట్‌ ఫ్రెండ్స్‌ టచ్‌లో ఉంటారా?

చినజీయర్‌స్వామి: తర్వాత మళ్లీ ఎప్పుడూ మేము పెద్ద కలిసినట్లు లేదు


ఆర్కే: మీమీద వాళ్ల ప్రభావం పడిందా?

చినజీయర్‌స్వామి: చాలా... వాళ్లతోటి కలిసి తిరుగుతుండే వాళ్లం. అప్పట్లో జీవనాడి అని పత్రిక ఉండేది. దాంట్లో అప్పుడప్పుడు రాస్తుండటం చేసేవాళ్లం. చిన్నప్పుడు భక్తి ఉండేదా, లేదా అని చెప్పలేం. ఇంట్లో పూజలు చేసేవారు. ధనుర్మాసం వస్తే గోదాదేవి పాటలు పాడేవాళ్లం. పదో తరగతి వచ్చేటప్పటికీ ఆత్మ, పరమాత్మ, క్రియేషన్‌, ఇన్నర్‌ వరల్డ్‌, ఎక్స్‌టర్నల్‌ వరల్డ్‌ గురించి ఆలోచనలు. ఇంట్లో చాలా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలుండేవి. ఖగోళశాస్త్రంకు సంబంధించి సీరిస్‌ ఆఫ్‌ బుక్స్‌ ఉండేవి. వాటిని చదవడం వల్ల కలిగిన ఆలోచనలు, సందేహాలను పరిచయం ఉన్న వారిని అడిగేవాళ్లం. ఇప్పుడు చదవడం తగ్గింది. క్రిస్టియన్లు రోజూ చదువుతారు. ముస్లింలు చదువుతారు. మనం గణేశ్‌ నవరాత్రులు వస్తేనే పూజ, శ్రీరామనవమి, శివరాత్రి వస్తేనే చదవడం. అప్పట్లో మేం చదివినా సందేహ నివృత్తికి అవకాశాలు లేవు. పండితులను కలిసే అవకాశం లేదు. దాంతో మేం ఆ భావజాలంతోనే తిరుగుతుండేవాళ్లం. తరువాత ఏదో కారణం వల్ల స్వాముల వారి దగ్గరికి వచ్చాం.


ఆర్కే: ఎలా జరిగింది? 

చినజీయర్‌స్వామి: 1975లో అప్పటివరకు స్వామితో పరిచయమేలేదు. మేం స్వామిని చూడను కూడా చూడలేదు. ఒకరోజు రాజమండ్రి వెళ్లాం. అప్పుడు పెద్దస్వామి వారు కాకినాడలో ఉన్నారు. 108 యజ్ఞాలు చేయాలని పెట్టుకుని మూడో యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో వారికి పూజలు చేయించే ప్రతిమలు కావాల్సి వచ్చాయి. అవి రాజమండ్రిలో ఉన్నాయి. పూజలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అందరూ అక్కడకు వెళ్లిపోయారు. ప్రతిమలేమో రాజమండ్రిలో ఉండిపోయాయు. మాకు అర్జంటుగా కావాలి పంపించండి అని స్వామి వారు సమాచారం పంపించారు. మేం తప్ప అక్కడ ఎవ్వరూలేరు. సరే నువ్వు తీసుకెళ్లి ఇవ్వు అని మా అమ్మగారు పంపించారు. తీసుకెళ్లి ఇచ్చినపుడు రెండు ప్రశ్నలు వేయమని మా అమ్మగారు చెప్పారు. ఒకటి మాకు అప్పటికి ఉపనయనం కాలేదు. అది ఎప్పుడు చేస్తారో కనుక్కోమంది. రెండోది బోలెండత ఫిలసాఫిక్‌ లిటరేచర్‌ ఉంది. దాన్నేం చేయమంటారు అని అడగమంది. ఉపనయనం గురించి అడిగితే 1975 ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌లో లక్ష్మీనారాయణ మందిరంలో చేస్తున్నాం ఆసక్తి ఉంటే అక్కడికి రావచ్చు అని చెప్పారు. గ్రంథాలు ఏం చేయాలి? అని అడిగితే చదువుకోండి అన్నారు.

మాకు చదవడం రాదు కదా అంటే రాకపోవడానికి ఏముంది, కావాలనుకుంటే అదే వస్తుంది అన్నారు. అక్కడికి అది అయిపోయింది. వారికి గుంటూరు నరిగెడ్డపాలెంలో ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్లాల్సిన ప్రోగ్రామ్‌ ఉంది. మధ్యలో రాజమండ్రిలో కాసేపు ఆగుతాం. ఏర్పాట్లు చేయండి మాకు చెప్పారు. ఏర్పాట్లు చేసి పెట్టాం. సాయంత్రం వస్తారనుకుంటే అందరూ పడుకున్నాక రాత్రి మూడు గంటలకు వచ్చారు. తెల్లవారి తీర్థఘోష జరిగేటప్పుడు అనౌన్స్‌ చేస్తున్నారు. మాకు స్టెనోగ్రాఫర్‌ కావాలి, ఎవరైనా ఉంటే చూడండి అని. అప్పటికే నేను టైప్‌, షార్ట్‌హ్యాండ్‌ పాసయ్యాను. హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. అయితే స్వాముల వారు పెద్ద బస్సులో వచ్చారు. స్వామితో ఉంటే దేశమంతా తిరగొచ్చు కదా అనిపించింది. దాంతో అయ్యా, నేను స్టెనోగ్రాఫర్‌ని కావాలంటే మీతో పాటు ఉంటాను అని అన్నాను. దానికి వారు నవ్వారు. మీ అమ్మగారిని అడిగి వారు పర్మిషన్‌ ఇస్తే రండి అన్నారు. మా అమ్మగారు వెళ్లమన్నారు. స్వామి వారి ఆఫీస్‌ కార్యక్రమాలు చూడటం కోసమని నన్ను తీసుకున్నారు. సౌతఇండియాలో టెంపుల్స్‌ను జీర్ణోద్దారణ చేసేందుకు ఒక కమిటీ పెట్టారు. ఇండియన్‌ టెంపుల్‌ రెనొవేషన్‌ కమిటి అని. దానికి సంబంధించిన పనులు చూసుకునేందుకు మమ్మల్ని తీసుకున్నారు. జాయిన్‌ అయినప్పటి నుంచి వారితోనే ఉన్నాను. సమయం దొరికనప్పుడు వారితో మాట్లాడం, సంశయాలు అడిగి తెలుసుకోవడం, వారి ప్రసంగాలు వినడం చేసేవాణ్ణి. 1977 ఫిబ్రవరిలో గోపాలాచార్య స్వామి వారని వారితోపాటు మొదటి నుంచి ధర్మప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే పండితుడాయాన. వారు, వీరు కలిసే కార్యక్రమాలు చేసే వారు. వారు గుంటూరులో నరిగెడ్డపాలెం దగ్గర ఉండేవాళ్లు. అక్కడ పాఠశాల నిర్వహిస్తుండేవారు. వేదాలు చదువుకొమ్మని మమ్మల్ని అక్కడికి పంపించారు. వారి దగ్గరకు వెళ్లాక క్రమక్రమంగా సందేహాలన్నీ తీరిపోయాయి.

 

రెండవది కదలే ప్రాణాలు చాలా ఉన్నాయి. కదలకుండానే బతికే ప్రాణులు ఉన్నాయి చెట్లూ చేమల్లాంటివి. వీటిల్లో చైతన్యం ఒక్కటి కనిపిస్తోంది కనుక చైతన్యాన్ని కలిగించే జీవులు వెనకాల ొందరు ఉన్నారు. అందువల్ల ఆ జీవులు కూడా వాస్తవం. ఆ జీవుడు కూడా ఒక తత్వం మాకు ప్రకృతి ఒక తత్వం, జీవుడు ఒక తత్వం, జీవుడుగా ఉండే మనం కూడా మన ఇష్టం వచ్చినట్లు మనమేమీ చేయట్లా. నేను నెలరోజులకు ప్లాన్‌ వేసి రేప్పొద్దుటికే అయిపోవచ్చును. అంచేత నీ చేతుల్లో కూడా లేదు. నిన్ను కూడా నడిపించే మరొకటేదో ఒక అదృశ్య శక్తి ఒకటి ఉంది. దానికి దేవుడు అని పేరు. భగవంతుడు అంటాం. బ్రహ్మతత్వం అంటాం. ఆ బ్రహ్మతత్వం కూడావాస్తవం. బ్రహ్మ, ప్రకృతి, జీవుడు ఈ మూడూ, మూడు తత్వాలు. ఈ మూడింటి కలయికే ఈ ప్రపంకమంతా అందువల్ల ఏ అణువు తీసినా, ఈ మూడూ కలిసే ఉంటాయి. ఇవి విడివిడినగా ఎప్పుడూ ఉండవు. ఇది తత్వం. ఈ మూడింటికీ మూడు దండాలు ప్రతీకలు. ఈ జ్ఞానం మనకు కలిగించే తత్వం ఆచార్యులు. నాలుగవది ఆచార్యదండం. ఈ నాలుగూ నాలుగుతత్వాలకు గుర్తు.


ఆర్కే: అయితే ఆ వస్త్రం?

చిన్నజీయర్‌ స్వామి: దాన్ని జలపవిత్రం అంటారు. మేము తీసుకునే ద్రవాలేవైనా దీంట్లోంచి ఫిల్టర్‌ చేసే తీసుకుంటాం. మేము దర్భం చేసిన వాటిని మేము పెట్టుకోం. మాకవి నిశుద్ధాలు. ఆహారానికి ఈ నియమం లేదు. నిజానికి మనం ఆచరిస్తున్న ప్రతిదానికీ ఒక రీజన్‌ ఉంటుంది. రీజన్‌ లేకుండా మనవాళ్లు ఎప్పుడూ ఏ ఆచరణనూ మనకు ఇంట్రొడ్యూస్‌ చేయలేదు. కాకపోతే దురదృష్టవశాత్తూ, రీజన్‌ తెలియకుండా చేసేవాళ్లు కొందరుంటారు. తమకు తోచిన పైత్యాలను అందులో చేర్చుకుని చేసే వాళ్లు కూడా కొందరుంటారు.


ఆర్కే: పరమాత్మా, పరబ్రహ్మ ఒక్కటేనంటారు కదా!

చిన్నజీయర్‌ స్వామి: జీవుడు పరమాత్మా ఒక్కటే అంటూ ఉంటారు. కానీ, జీవుడు, పరమాత్మా ఒక్కటే ఎలా అవుతారు? ఒక్కటే అయితే హాయిగా మనం అనుకున్న ఇష్టమైన ప్రపంచంగా మారిపోయి ఉండాలి. అలా కాలేదు కదా! మరి జీవుడు పరమాత్మా ఒక్కటి ఎలా అవుతారు? కాలేరు.


ఆర్కే: అలాగే వైదికంలో కూడా రకరకాల శాఖలు...

చిన్నజీయర్‌ స్వామి: శాఖలు ఆలోచనా ధోరణులను బట్టి వచ్చాయి. ఆలోచన అందరిదీ ఒకేలా ఉండదు కదా! కెమెసీ్ట్ర ఒక సబ్జెక్ట్‌, ఫిజిక్స్‌ ఒక సబ్జెక్ట్‌, ఫిలాసఫీ ఒక సబ్జెక్ట్‌, ఫిజియాలజీ ఒక సబ్జెక్ట్‌., ఆసా్ట్రనమీ ఒక సబ్జెక్ట్‌, ఓష్ణోగ్రఫీ ఒక సబ్జెక్ట్‌ ఇలా వేరు వేరు సబ్జెక్టులు ఉన్నాయి. లౌకికమైన చదువుల్లో భిన్నభిన్నమైన వాటి మీద ఫోకస్‌ చేసినప్పుడు ఎలా ఫ్యాకల్టీ అవుతోందో ఆధ్యాత్మికతలో కూడా ఒక్కోదాని మీద కాన్‌సెంట్రేట్‌ చేసింది ఒక్కో శాఖ అయ్యింది. శివ, శాక్తేయ, వైష్ణవ, ఇవన్నీ అలా వచ్చినవే కదా! వాటిని మనం తప్పు అనం, చెడ్డవీ అనం. అవి రావడానికి దేర్‌ ఈజ్‌ ఏ రీజన్‌ బిహైండ్‌. వాటిని ఆ క్రమంలో ముందుకు తీసుకు వెళ్లగలిగితే, మనిషి మేధాశక్తి పెరుగుతుంది. మన మేధ ఎంత విచిత్రమైందో తెలియడానికి ఇదొక కారణం. కనిపించే ఒక ఆకును డిసెక్ట్‌ చేయడం చాలా ఈజీ. కనపించని మనసును డిసెక్ట్‌ చేయడం ఎంత కష్టం? కనిపించని ఆత్మ గురించి, పరమాత్మ గురించి మాట్లాడటానికి అతనికి ఎంతటి అద్భుతమైన మేధ ఎంతటి ప్రతిభాపాటవాలు ఉండాలి? దాంట్లో వాళ్లు మాట్లాడుతున్నారూ అంటే అందులో వారు చేసిన అద్భుతమైన కృషి ఒకటుంది.


ఆర్కే: మీరు, మీతో పాటు కొంత మంది కూడా రాజకీయపరమైన లేదా సమకాలీన విషయాలమీద స్సందిస్తున్నారు. ముఖ్యంగా మీరు సర్జికల్‌ స్ట్రైక్స్‌ మీద స్పందించారు. మీ కెందుకు ఆ విషయాల మీద మాట్లాడాలనిపించింది? 

చిన్నజీయర్‌ స్వామి: మనం ఒక దేశంలో పుట్టాం. ఒక దేశంలో పెరిగాం. మనం ఆ దేశానికి సంబంధించిన ప్రొటెక్షన్‌ అనేటువంటిది ప్రధమ కర్తవ్యం,.దేశం బావుంటే మనం బావుంటాం. మనం బావుంటే మన విశ్వాసాలు బావుంటాయి. విశ్వాసాలు బావుంటే ధర్మమో మరొకటో బావుంటాయి. అసలు దేశానికే ఉపద్రవం కలిగితే మనం చేయగలిగేదేముంటుంది? దేశానికి ఒక కష్టమూ, ఒక న ష్టమూ కలుగుతున్నప్పుడు స్పందించకపోతే వాడు ఆ దేశవాసిగా ఉండడానికి అనర్హుడు. మన దేశానికి ఆ సమయంఓ ఒక ఉపద్రవం ఏర్పడింది. మనదేశం కోసం ప్రాణాలిచ్చి అహర్నిషలూ కష్టపడే వ్యక్తుల్ని పక్కదేశం వారు అన్యాయంగా చంపుతున్నారు. దాన్ని పట్టించుకోకుండా, ఆ విషయంలో స్పందించకుండా ఆ దేశంలో ఉన్నాడంటే వాడు ఆ దేశంలో ఉండడానికి అనర్హుడు. అందుచేత దానికోసం చేయాల్సిన కర్తవ్యం మనది. ఎంత చేతనైతే అంతా చేయాలి. దానితో పాటు మన ప్రధానమంత్రి ఒక ప్రకటన కూడా చేశారు. ఒక రూపాయైునా ప్రతి ఒక్కరూ ఇవ్వండని. అది కూడా మన బాధ్యతే కదా! దేశం కోసం అది కూడా చేస్తాం అని వాళ్లన్నప్పుడు చేయాలి. గతంలో దేశం కోసం మాట్లాడినవాళ్లు చాలా మంది ఉండి ఉండొచ్చు. కానీ, వాళ్లకు దేశం మీద ఎంత నిష్ట ఉన్నది మనకు తెలియదు. ఇప్పటి మన ప్రధానమంత్రికి మాట తోపాటు నిష్ఠకూడా ఉన్నాయి.


ఆ రిపోర్టర్‌కు కోపమొచ్చి మరింత వ్యతిరేకంగా మాట్లాడాడు


ఆర్కే: తిరుపతి విషయానికొస్తే అప్పుడెప్పుడో ఒక వివాదం జరిగింది. ఆ తర్వాత తిరుపతికి వెళ్లడం మానేశారా?

చిన్నజీయర్‌ స్వామి: దాదాపు మానేశాను. 


ఆర్కే: అలిగారా?

చిన్నజీయర్‌ స్వామి: మా మీద మాకు అలక వచ్చింది. దేవుడి మీద కాదు. దేవుడు రెండు రూపాల్లో ఉంటాడు. ఒకటి అంతటా వ్యాపించి రూపం. మనం దానికి ఏమీ చేయనక్కరలేదు. దాని గురించి వర్రీకానక్కర లేదు. రెండవది మనకోసం తీసుకున్న రూపం. మనకోసం తీసుకున్న రూపమైనప్పుడు దాని బాధ్యత మనదే అవుతుంది. మనకోసం ఏర్పడిన విగ్రహం కాబట్టి మనకోసం ఏర్పడిన ఆలయం కాబట్టి దాన్ని నియమబద్ధంగానూ, జాగ్రత్తగానూ చూసుకోవడం మన బాధ్యత. ఆ మాత్రం కూడా దేవుడంటే ఏమిటో తెలియకుండా రకరకాల స్థాయుల్లో దాని నిర్వహణకు పూనుకుంటే దాని వల్ల వ్యవస్థ పాడవుతుంది. ఆయన రక్షణలో ఉంటూ దాని మీద లక్షలు, కోట్లు సంపాదిస్తూ, కనీసం ఆయనకు ఏది అవసరమో అదైనా చూడకుండా ఉండడం పరమ దారుణమైన విషయం. ఇది తప్పు అని మేము చెప్పాం. తెలియలేదు. వాళ్లకు తెలియాల్సిన బాధ్యత ఉంది. తెలిసేటంత బాగా చెప్పలేకపోయామని మా మీద మాకు బాధేసింది. అందుకే మేము వెళ్లడం మానేశాం.


ఆర్కే: వేంకటేశ్వర స్వామి అందరి వాడు కదా! అక్కడున్న నిర్వాహకులు వినకపోవచ్చు అది వేరే విషయం. కానీ మీ ప్రయత్నాన్ని ఆపడం ఎందుకు? దాన్ని కొనసాగించవచ్చు కదా!

చిన్నజీయర్‌ స్వామి: మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా.


ఆర్కే: వెయ్యికాళ్ల మంటపం వద్దే కదా వివాదం మొదలయ్యింది?

చిన్న జీయర్‌ స్వామి: అదొకటి. దురదృష్టవశాత్తూ ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగాయి. అసలు వెయ్యికాళ్ల మంటపానికి సంబంధించి ఒక ఇష్యూ కానే కాదు. అయితే అక్కడున్న సిస్టమ్‌ను క్రమబద్ధం చేద్దామని వాళ్లు పిలిచారు. అంతకు ముందు కృష్ణయ్యగారని ఒక ఈవో ఉండేవారు. ఆయన తర్వాత అజయ్‌ కలామ్‌ వచ్చారు. ఆయన ఉండేటప్పుడూ మాకు ఒక లెటర్‌ రాశారు. ఈయన వచ్చాక మాకో లెటర్‌ రాశారు. ఇక్కడ వ్యవస్థ నియంత్రణలోలేకుండా ఉంది. దీన్ని చక్కదిద్దడానికి మీ సహకారం కావాలన్నారు. తప్పకుండా మాకు చేతనైనంత చేస్తామని చెప్పాం. మేము దాంట్లో పాలుపంచుకున్నాం. అందరూ కలిసికూర్చుని అక్కడ జరుగుతున్న 110 తప్పుల్ని వారు రాసుకోగలిగారు. వారిలో అర్చకులు, వంటవాళ్లు, జియ్యంగార్లు, ఏకాంగులు, అఫీషియల్స్‌, జేయీవోలు వీళ్లంతా ఉన్నారు.


ఆర్కే: అక్కడున్న తప్పుల్ని అందరూ ఒప్పుకున్నారా?

చిన్నజీయర్‌ స్వామి: ఒప్పుకున్నారు? కానీ, దురదృష్టవశాత్తు 2003 వ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు అనుకుంటాను. అజయ్‌ కలామ్‌ గారి నేతృత్వంలోనే మీటింగ్‌ జరిగింది. ఆఫీస్‌ హోల్డర్స్‌ అందరూ ఉన్న ఆ మీటింగ్‌లో అజయ్‌ కలామ్‌ గారు మాట్లాడుతూ ‘‘ ఇప్పటిదాకా ఇన్ని తప్పులు మనం చేస్తూ వస్తున్నాం. ఇవన్నీ మనం తెలిసే చేస్తున్నాం. ఇక్కడ తెలియక అనే ప్రశ్నేలేదు. మొత్తంగా చూస్తే తప్పు జరుగుతూనే ఉంది’’ అన్నారు. ఆ సమయంలో తీసిన వీడియో కూడా మా వద్ద ఉంది. ఇప్పటిదాకా మనం చేసిన తప్పుల్ని సవరించుకోవడం చాలా అవసరం. అలా చేస్తే మనకు మంచిది, మన రాష్ట్రానికి మంచిది. మన దేశానికి మంచిది. ప్రజలకు మంచిది. మనకెవరూ చెప్పేవారు లేక ఇప్పటిదాకా మనం వీటి మీద దృష్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది కనుక ఆర్నెళ్ల టైం తీసుకుని అన్నీ సవరించుకుందాం. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ఆర్నెళ్ల తర్వాత మళ్లీ ఒకసారి కూర్చుందాం. అని అంతా ఒక కన్సెసెస్‌కు వచ్చేశారండి. రెండు కార్యక్రమాల్ని ఆ మరునాటి నుంచే ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ అది జరగలేదు. ధర్మాన్ని, దైవాన్ని ఎంతమంచిగా వాడుకుంటే సొసైటీ అంత బాగుంటుంది. లేకపోతే సొసైటీ ఛిన్నాభిన్నం అవుతుంది. మాకావేళ అందుకే కోపం వచ్చింది. తప్పని చెప్పాం.


ఆర్కే: ఇప్పుడు పరిష్కారం ఏమిటి? మీరు మళ్లీ తిరుపతి వెళ్లాలంటే ఏం జరగాలి.

చినజీయర్‌స్వామి: జరిగిన వాస్తవం అన్‌ఫార్చునేట్‌గా ఇప్పటి వరకు మీడియా చెప్పలేదు. మాకు మీడియా విషయంలో అదొక అసంతృప్తి ఉంది.


ఆర్కే: అప్పటికి ఆంధ్రజ్యోతి నాచేతికొచ్చి ఉండదు. పైగా అప్పుడు ఎలక్ర్టానిక్‌ మీడియా విస్తృతంగా లేదు.

చినజీయర్‌స్వామి: పేరెందుగాని ఒక ఎలక్ర్టానిక్‌ మీడియా రిపోర్టర్‌ నాదగ్గరకు వచ్చాడు. స్వామీ మీరు అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఇలా చేస్తున్నారట కదా అని అడిగాడు. కూల్చిన తరువాత ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కూల్చక ముందు ఎందుకు అడగలేదు? అన్నాడు. అప్పుడు చెప్పాను. మేం ఎక్కడైనా ఉంటే ఆ చోటే మా కళ్లుంటాయి. మా మనసు అక్కడే ఉంటుంది. తిరుపతిలో కూల్చేముందు ఇలా కూల్చుతున్నాం అని ఒక పబ్లిక్‌ నోటీస్‌ను విడుదల చేసి ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాల్సింది. కానీ వారు ఆ పనిచేయలా. మీటింగ్‌ ఎజెండాలో లేనిదాన్ని పాసింగ్‌ ఇష్యూ కింద తీసుకుని రెజల్యూషన్‌ పాస్‌ చేసి ఆ యాక్టివిటీ చేశారు. చేసిన సిస్టమ్‌ రాంగ్‌. ఇప్పటికీ వాళ్లు రాంగ్‌గానే ప్రవర్తిస్తున్నారు. రెండోది తిరుపతి కింద ఉన్న వ్యక్తులకు కూడా అది కొడుతున్న విషయం తెలియదు. అంత జాగ్రత్తగా చేశారు. మాకంటే ఎక్కడో ఉన్నాం కాబట్టి తెలియలేదు. కళ్లున్న వారు కదా మీరు మీకేమైంది? కళ్లు మూసుకుపోయాయా? అని అడిగా. ఎక్కడో చర్చిగేట్‌ కూలితే ప్రపంచమంతా అల్లాడిపోయింది. మీడియానే కదా చూపించింది. అంత మంటపాన్ని రోజూ కూల్చేస్తుంటే మీడియాకేమైంది అని ప్రశ్నించా. దాంతో ఆ రిపోర్టర్‌కు కోపమొచ్చి తరువాత మరింత వ్యతిరేకంగా మాట్లాడాడు. అయినా మేమేమీ పట్టించుకోలేదు.


ఆర్కే: నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, కొండ మీద ఎప్పుడు అడుగుపెట్టబోతున్నారు?

చినజీయర్‌స్వామి : ఒక మాట అనుకున్నాం మేం. నా ఇంటిని ఎవరైనా కొడితే నేను ఎదురుతిరుగుతా. వాడ్ని అపుతా లేదా నా ప్రాణమైనా పోవాలి. మా నాన్నగారి ఇంటిని ఎవరైనా కొడితే వెంటనే ఆపుతా. నువ్వు నాకు తండ్రివి, తల్లివి, సర్వానివి. నీ దగ్గర జరిగే ఒక దోషాన్ని తొలగించగలిగే సామర్థ్యం లేని ఇన్‌కాపబుల్‌ పర్సన్‌ను అయ్యా నేను. ప్రయత్నం చేస్తా. నేను సాధించి నీ నియమానికి , ధర్మానికి తగ్గట్టుగా కొంతైనా సాధించగలిగితే నీ దగ్గర తల ఎత్తుకుని నిలబడగలుగుతా. అలాకానప్పుడు నీ దగ్గరకి తల ఎత్తుకుని ఎలారాను? దర్శనం చేసుకుని లడ్డూ తీసుకుని వెళ్లిపోవడానికే నీ భక్తున్నా?


ఆర్కే: ఆ కరెక్షన్‌ ఎప్పుడు జరుగుతుందని అనుకుంటున్నారు?

చినజీయర్‌స్వామి: మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది.


ఆర్కే: మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ థాంక్యూ.

..................................

 

మాకు సంప్రదాయంలో నేర్పింది ఏంటంటే భగవంతుడ్ని మనం ఎలా చూడగలుగుతాం. భగవంతుడు అన్ని రూపాల్లోనూ, వస్తువుల్లోనూ ఉంటాడు అని చెప్పినపుడు మనం ఎలా చూస్తాం. భగవంతుడు ఆత్మ, ఈ ప్రపంచమంతా శరీరమైతే నువ్వు భగవంతుడి మీద ప్రేమను దేని ద్వారా చూపించాలి. శరీరం ద్వారా చూపించాలన్నప్పుడు నీళ్లు శరీరమైతే నీళ్లు పొల్యూట్‌ చేయకు. గాలి శరీరమైతే గాలి పొల్యూట్‌ చేయకు. జంతువులు శరీరమైతే జంతువులను అవసరానికి మించి నాశనం చేయకు. ఒక చీమకు ప్రకృతిలో బతకడానికి ఎంత అధికారం ఉందో మనిషికి అంతే ఉంది. నువ్వు వాటితో కలిసి బతుకు. వాటిని నాశనం చేసి బతకాలని అనుకోకు. ఇది మా వికాసతరంగిణి స్లోగన్‌. మాధవసేవగా సర్వప్రాణిసేవ అని మేం చెబుతాం. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఇది మా ఆర్గనైజేషన్‌ రెండో సూత్రం.ను ఒక్క కులంలో పుట్టా. ఒక వర్గంలో పుట్టా. నాదేదో దాన్ని ఆరాధించుంటాను. మరొకడు మరొక కులంలో, మరొక యోగ్యతో పుట్టాడు. నేను దాన్ని ఆరాధించను కానీ గౌరవిస్తాను. వారు కూడా తనది ఆరాధించుకోని, నాదాన్ని గౌరవిస్తే చాలు. 


దానికంటే గొప్పది అన్నప్పుడే సమస్యలు వస్తాయి. మా నాన్న చాలా గొప్పోడు అన్నప్పుడు ఏ సమస్యాలేదు. మీనాన్న కంటే మానాన్న చాలా గొప్పోడు అన్నప్పుడు సమస్యలు వస్తాయి. మామతం చాలా గొప్పది అనొచ్చు. మీ మతం కంటే అనడం తప్పు. 

Updated Date - 2020-05-15T23:14:23+05:30 IST