చిన్న ఆసుపత్రులను కాపాడుకుందాం!

ABN , First Publish Date - 2022-08-08T05:35:26+05:30 IST

రాష్ట్రంలో చిన్న ఆసుపత్రులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరాజు, నందకిశోర్‌ వెల్లడించారు.

చిన్న ఆసుపత్రులను కాపాడుకుందాం!
మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ శ్రీనివాసరాజు

అదనపు చార్జీల నుంచి మినహాయించండి

ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం

కరోనా సేవలలో మరణించిన వైద్యులకు పరిహారం చెల్లించాలి

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరాజు, నందకిశోర్‌ 


నెల్లూరు (వైద్యం), ఆగస్టు 7 : రాష్ట్రంలో చిన్న ఆసుపత్రులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరాజు, నందకిశోర్‌  వెల్లడించారు. ఆదివారం ఐఎంఏ సర్వసభ్య సమావేశానికి నెల్లూరుకు వచ్చిన వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు, మెయింటింగ్‌ చార్జీలు తదితర చార్జీల పేరుతో 50 పడకల నిర్వాహణ ఏడాదికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని తెలియచేశారు. ఇంత ఖర్చు భరించలేక ఆ భారం రోగులపై వేయక తప్పటం లేదన్నారు. ఈ నేపఽథ్యంలో 20 పడకలు ఉన్న చిన్న ఆసుపత్రులకు ఈ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే ఆసుపత్రిపై ఎవరైనా దాడి చేస్తే మూడేళ్ల శిక్ష  ఉందని, దీనిని ఏడేళ్లు అమలు చేసేలా చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వం కొత్తగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అందుబాటులోకి తీసుకు వస్తోందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్‌ ఇంటికి వైద్యుడు వెళ్లి పరీక్షించే విధానం సరికాదన్నారు. 104 అంబులెన్స్‌ వద్దకు ఆ రోగిని తీసుకు వస్తే వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేస్తారని, అవసరమైతే పెద్దాసుపత్రికి సిఫారసు చేస్తారన్నారు. కరోనాలో  వైద్యసేవలు అందించి ప్రాణాలు కోల్పోయిన 80 మంది వైద్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.50లక్షల బీమా కూడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర కోశాధికారి సుబాష్‌ చంద్రబోస్‌, జిల్లా అధ్యక్షుడు భక్తవత్సలం, జిల్లా కన్వీనర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-08T05:35:26+05:30 IST