శ్రీలంకకు తరలిన.. చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5

ABN , First Publish Date - 2022-08-05T06:43:08+05:30 IST

జిత్తులమారి చైనా మరోమారు భారత్‌తో గిల్లికజ్జాలకు సిద్ధమైంది. భారత సార్వభౌమాధికారానికి సవాల్‌ విసురుతూ.. హిందూ మహాసముద్రంలో తన..

శ్రీలంకకు తరలిన.. చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5

భారత్‌ ఆందోళన.. పట్టించుకోని డ్రాగన్‌

దక్షిణభారతమంతా దాని నిఘా పరిధిలోకి


న్యూఢిల్లీ, ఆగస్టు 4: జిత్తులమారి చైనా మరోమారు భారత్‌తో గిల్లికజ్జాలకు సిద్ధమైంది. భారత సార్వభౌమాధికారానికి సవాల్‌ విసురుతూ.. హిందూ మహాసముద్రంలో తన అధునాతన నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5ను మోహరించనుంది. ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ నౌక శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయంలో తిష్టవేయనుంది. ఈ విషయాన్ని శ్రీలంక రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ నలిన్‌ హేరథ్‌ గురువారం అధికారికంగా నిర్ధారించారు. నిజానికి ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన శ్రీలంక.. చైనా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో హంబన్‌బొట నౌకాశ్రయాన్ని చైనా మర్చంట్‌ పోర్ట్‌ హోల్డింగ్స్‌కు లీజుకు ఇచ్చింది. దీన్ని అవకాశంగా మలచుకుంటున్న డ్రాగన్‌ దేశం.. ఆ పోర్టును సైనిక అవసరాల కోసం ఉపయోగించడాన్ని ప్రారంభించిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


భారత్‌ ఆందోళన ఎందుకంటే..?

చైనా నౌక యువాన్‌ వాంగ్‌-5 ఉపగ్రహ ఆధారిత నిఘాను కొనసాగిస్తుంది. దానికి 750 కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్షిపణులతోపాటు.. అణు కేంద్రాలు, రక్షణ కేంద్రాలపై గగనతలం నుంచి నిఘా పెట్టగలదు. దాదాపు దక్షిణ భారతమంతా దాని నిఘా పరిధిలో ఉంటుంది. అంటే.. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కీలకమైన రక్షణ విభాగాలు, ఆరు భారతీయ పోర్టులు, కూడంకుళం సహా.. పలు అణు పరిశోధన కేంద్రాలపై నిఘా పెట్టేందుకు చైనాకు వీలుంటుంది. ఈ నౌక తన నిఘా పరిధిలోని కీలక సంస్థల సమాచారాన్ని సేకరించగలదు. అందుకే ఇప్పటికే భారత్‌ ఈ విషయంలో శ్రీలంకతో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-08-05T06:43:08+05:30 IST