బీజింగ్: చైనాకు చెందిన 60ఏళ్ల ఓ పెద్దాయన 14 ఏళ్లుగా బీజింగ్ విమానాశ్రయంలోనే నివాసం ఉంటున్నాడు. అదేంటని అడిగితే నాకు ఇక్కడ స్వేచ్ఛగా ఉంది.. ఇంటికి వెళ్తే భార్య, పిల్లల పోరు పడలేనంటూ షాకింగ్ సమాధానం చెబుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన వీ జియాంగువో వయసు ఇప్పుడు దాదాపు 60ఏళ్లు. ఒకప్పుడు వాంగ్జింగ్లోని తన సొంత ఇంట్లో ఫ్యామిలీతో కలిసే జీవించేవాడు. అయితే, 40 ఏళ్ల వయసులో జియాంగువో జాబ్ పోయింది. ఆ నైరాశ్యంలో డ్రింకింగ్‌కు అలవాటుపడ్డాడు. అంతే.. క్రమంగా మద్యం, ధూమపానానికి అడిక్ట్ అయిపోయాడు. ఆ రెండు లేకుండా బతకడం అతడికి కష్టంగా మారిపోయింది. అయితే, అతను అలా చేయడం భార్య, పిల్లలకు ఎంతమాత్రం నచ్చేదికాదు. వాటికి దూరంగా ఉండాలని వారు పలుమార్లు జియాంగువోకు చెప్పారు. కానీ, వారి మాటలను పెడచెవిన పెట్టేవాడు. దాంతో విసిగెత్తిపోయిన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండాలంటే మద్యం, స్మోకింగ్ మానేయాల్సిందేనని తెగేసి చెప్పేశారు. అంతేగాక అతనికి నెలవారీగా వచ్చే వెయ్యి యువాన్ల(రూ.12వేలు) పింఛన్ డబ్బులు కూడా తమకే ఇచ్చేయాలని వారు ఆదేశించారు.
కుటుంబ సభ్యులు అలా చెప్పేసరికి జియాంగువోకు మొదట ఏమీ తోచలేదు. అటు మద్యం, సిగరేట్ మానే ఆలోచన అతనికి ఏమాత్రం లేదు. అందుకే తన మకాం మార్చేశాడు. సూట్ కేసు సర్దుకుని బీజింగ్ ఎయిర్‌పోర్టుకు తరలిపోయాడు. అలా 14ఏళ్లుగా ఎయిర్‌పోర్టులోనే ఉంటున్నాడు. ఓ చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్‌తో పాటు ఇతర కొన్నిసామాన్లు మాత్రమే తనతో పాటు తెచ్చుకున్నాడు. దాంతో వంట చేసుకుని తింటూ అక్కడే ఉంటున్నాడు. కొన్నిసార్లు విమానాశ్రయంలోని హోటళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటాడట. కాగా, జియాంగువోను విమానాశ్రయం నుంచి పంపించేందుకు అక్కడి భద్రతా సిబ్బంది చాలాసార్లు ప్రయత్నించారట. పోలీసుల సాయంతో అతని ఇంటి వద్ద విడిచిపెట్టినా.. వెంటనే తిరిగి అక్కడికి చేరుకుంటాడని అధికారులు తెలిపారు.
జియాంగువోను పలకరిస్తే.. "నేను ఇంటికి వెళ్లాలంటే ఇప్పుడైనా వెళ్లగలను. కానీ వెళ్లను. ఎందుకంటే అక్కడ ఫ్రీడం లేదు. నేను ఇంట్లో ఉండాలంటే నాకు వచ్చే పింఛను(1000 యువాన్లు) మొత్తాన్ని వారికి ఇచ్చేయాలంట. అలా చేస్తే మందు, సిగరెట్లను నేను ఎలా కొనుక్కోగలను?" అని అంటున్నాడు. ఇక ఈ పెద్దాయన కథ తెలుకున్న నెటిజన్లు హాలీవుడ్లో దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ డైరెక్షన్లో టామ్ హ్యాంక్స్ హీరోగా 2004లో వచ్చిన హాలీవుడ్ మూవీ 'ద టెర్మినల్'ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో హీరో.. స్వదేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తి, పాస్‌పోర్ట్ చెల్లకుండా పోవడంతో 18 ఏళ్లు పారిస్ ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోతాడు. మూవీలో కథనాయకుడు అలా ఉండిపోవడానికి 'రాజకీయ సంక్షోభం' కారణమైతే.. ఇక్కడ మన హీరోకు 'ఇంటి పోరు' అన్నమాట అని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి