వృద్ధుడిని చంపిన హంతకుడికి చైనా ప్రజల మద్దతు! అరెస్టు చేయవద్దంటూ విన్నపాలు! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-19T03:21:38+05:30 IST

ఓ వృద్ధుడిని, అతడి కోడలిని చంపిన ఓ హంతకుడికి చైనా ప్రజలు అండగా నిలిచారు. అతడిని అరెస్టు చేయవద్దంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే..

వృద్ధుడిని చంపిన హంతకుడికి చైనా ప్రజల మద్దతు! అరెస్టు చేయవద్దంటూ విన్నపాలు! అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ వృద్ధుడిని, ఆయన కోడలిని చంపిన హంతకుడికి చైనా ప్రజలు మద్దతు ప్రకటించారు. అతడిని అరెస్టు చేయవద్దంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే.. పరారీలో ఉన్న అతడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ హంతకుడి పేరు ఓవ్. అతడి ముగింపును చూసి ప్రస్తుతం దేశ ప్రజలందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. 


ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓవ్‌కు తన పక్కింటి వ్యక్తితో కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. అతడు తన స్థలంలో ఓ చిన్న గుడిసె వేసుకుని నివసిస్తున్నాడు. కొత్త ఇల్లు కట్టుకోవాలని అతడు ప్రయత్నిస్తుంటే పక్కింటి కుటుంబం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం అతడు స్థానిక అధికారులను, పోలీసులను, చివరికి రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఉపయోగం లేకపోయింది. పక్కింటి వ్యక్తితో వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అతడు ఈ నెల 12న మరోసారి పక్కింటి వ్యక్తితో గొడవపడ్డాడు. వివాదం ముదరడంతో ఓవ్.. పక్కింటి వ్యక్తిని వృద్ధుడని కూడా చూడకుండా హత్య చేశాడు. అతడి కోడలిని కూడా చంపేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. 


ఈ క్రమంలో మీడియాలో పలు కథనాలు వచ్చాయి. మూడు దశాబ్దాల క్రితం..సముద్రంలో మునిగిపోతున్న బాలుడిని అతడు తన ప్రాణాలకు తెగించి మరీ రక్షించాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. కొన్ని డాల్ఫిన్లను కూడా అతడు అపాయం నుంచి రక్షించాడట. ఇలా మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన అతడు చివరికి హంతకుడిగా ముద్ర వేయించుకుని జీవితాన్ని చాలించడం అక్కడి ప్రజల్ని కలిచి వేసింది. చైనాలోని రెవెన్యూ వ్యవస్థ, అధికారయంత్రాంగం, రాజకీయాలే ఓ మంచి మనిషిని హంతకుడిగా మార్చాయంటూ అక్కడి ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులు చెబుతున్న వివరాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీరు పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. అసలు మీరు చెప్పింది నిజమనేందుకు రుజువేంటీ’’ అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-19T03:21:38+05:30 IST