వీఘర్లను తుదముట్టించేందుకు చైనా ప్రయత్నిస్తోంది : రుషన్ అబ్బాస్

ABN , First Publish Date - 2020-08-12T03:42:43+05:30 IST

వీఘర్ మహిళలపై చైనీయులు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని

వీఘర్లను తుదముట్టించేందుకు చైనా ప్రయత్నిస్తోంది : రుషన్ అబ్బాస్

వాషింగ్టన్ : వీఘర్ మహిళలపై చైనీయులు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ‘కాంపెయిన్ ఫర్ వీఘర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రుషన్ అబ్బాస్ ఆరోపించారు. ఆధునిక ప్రపంచంలో జింజియాంగ్ ప్రావిన్స్‌లోని వీఘర్ మహిళలు తీవ్రమైన హింసకు గురవుతున్నారని చెప్పారు. 


ఈస్ట్ టుర్కిస్థాన్ (జింజియాంగ్)లోని వీఘర్ మహిళలను నేరస్థులుగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. వీఘర్ల సహజ సిద్ధ స్థానికత, మతం కారణంగా మహిళలు అత్యాచారాలకు, గర్భస్రావాలకు గురవుతున్నారని చెప్పారు. వారిని చైనా ప్రభుత్వానికి ముప్పుగా భావిస్తున్నారని చెప్పారు. 


వీఘర్ మహిళలు అత్యాచారాలు, బ్రెయిన్ వాషింగ్, బలవంతపు గర్భస్రావాలు, ఊహింప శక్యం కానటువంటి అన్యాయాలకు గురవుతున్నారని చెప్పారు. చైనా ప్రభుత్వమే ఈ దురాగతాలకు కారణమవుతుండటం వల్లే ప్రపంచమంతా మౌనంగా ఉంటోందా? అని ప్రశ్నించారు. చైనా జన హననానికి పాల్పడుతోందని, సెలబ్రిటీలు, ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. 


వీఘర్ ముస్లింలను నిర్మూలించేందుకు చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వీఘర్ మహిళలు బిడ్డలకు జన్మనిచ్చేందుకు అనుమతించడం లేదని, లక్షలాది మంది వీఘర్లను కాన్సంట్రేషన్ క్యాంపులలో నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఫ్యాక్టరీలలో లక్షలాది మందిని ఉద్యోగాల పేరుతో పంపిస్తూ, వారిని అక్షరాలా బానిసలుగా మార్చి, పని చేయిస్తున్నారని చెప్పారు. వీఘర్ మహిళలకు బలవంతంగా చైనీయులతో పెళ్లిళ్లు చేస్తున్నారని తెలిపారు. 


Updated Date - 2020-08-12T03:42:43+05:30 IST