Ladakh : దళాల ఉపసంహరణపై చైనా మిలిటరీ ప్రకటన

ABN , First Publish Date - 2022-09-09T17:53:47+05:30 IST

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి తూర్పు లడఖ్ (Eastern

Ladakh : దళాల ఉపసంహరణపై చైనా మిలిటరీ ప్రకటన

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి తూర్పు లడఖ్ (Eastern Ladakh), గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ -15 నుంచి దళాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని చైనా సైన్యం శుక్రవారం ధ్రువీకరించింది. ఈ ప్రాంతంలో ఏర్పడిన ప్రతిష్టంభన పరిష్కారం దిశగా ఇది మరొక ముందడుగు. 


మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ (పీపీ-15) ప్రాంతం నుంచి భారత్, చైనా దళాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు తెలిపింది. ఇదే విధంగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, చైనా-ఇండియా కార్ప్స్ కమాండర్ లెవెల్ 16వ విడత చర్చల్లో కుదిరిన అంగీకారం ప్రకారం జియానన్ డబన్ (పీపీ15 ప్రాంతం) నుంచి చైనీస్, భారతీయ దళాల ఉపసంహరణ ప్రారంభమైందని తెలిపింది. ఈ ఉపసంహరణ సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాలకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. 


గాల్వన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి భారత్, చైనా దళాలు 2020లో వెనుకకు వెళ్ళాయి. అదేవిధంగా 2021 ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు నుంచి,  2021 ఆగస్టులో గోగ్రాలోని పీపీ17ఏ నుంచి ఇరు దేశాల దళాల ఉపసంహరణ జరిగింది. దెమ్‌చోక్, డెప్సాంగ్‌లలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 


Updated Date - 2022-09-09T17:53:47+05:30 IST