విలీనంతో వెలవెల

ABN , First Publish Date - 2022-07-15T06:09:58+05:30 IST

గత ఏడాది విద్యార్థులతో కళకళలాడింది. నాడు నేడు పథకంలో సర్వాంగ సుందరంగా మారింది.

విలీనంతో వెలవెల
ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్న చినకోండ్రుపాడు ప్రాధమిక పాఠశాల

నాడు 155 మంది.. నేడు ఆరుగురే

ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థుల మొగ్గు

రూ.12 లక్షలతో నాడునేడులో పాఠశాల అభివృద్ధి

నిరుపయోగంగా చినకోండ్రుపాడు ప్రాథమిక పాఠశాల 

ప్రత్తిపాడు, జూలై 14: గత ఏడాది విద్యార్థులతో కళకళలాడింది. నాడు నేడు పథకంలో సర్వాంగ సుందరంగా మారింది. అలాంటి పాఠశాల నేడు విద్యార్థులు లేక వెలవెలపోతోంది. మండల పరిధిలోని చినకోండ్రుపాడు మెయిన్‌ ప్రాధమిక పాఠశాలలో గత ఏడాది 155 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలను గత ఏడాది నాడు నేడు కింద రూ.12 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విశాలంగా ఉన్న పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ఆహ్లాదకరంగా మార్చారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం పాఠశాలల విలీన కార్యక్రమం చేపట్టింది. దీంతో ఈ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను పక్కనే ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కలిపారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాథమిక పాఠశాలలో కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే మిగిలారు. వంద మంది వరకు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించగా నలభై మంది విద్యార్థులు జడ్పీ పాఠశాలకు వెళ్తున్నారు. దీంతో విశాలమైన ప్రాంగణంతో పాటు తరగతి గదులు  మొత్తం నిరుపయోగంగా మారాయి. పలు గదులను పూర్తిగా మూతేశారు.  ఇదే పరిస్థితి మండలంలో చాలా పాఠశాలల్లో నెలకొంది.


Updated Date - 2022-07-15T06:09:58+05:30 IST