తాలిబన్లకు చైనా హెచ్చరిక

ABN , First Publish Date - 2021-08-17T21:37:11+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మార్చొద్దని తాలిబన్లను

తాలిబన్లకు చైనా హెచ్చరిక

బీజింగ్ : ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మార్చొద్దని తాలిబన్లను చైనా హెచ్చరించింది. రహస్యాలు లేని, సమ్మిళిత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే చైనా ఈ హెచ్చరిక చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిపై భద్రతా మండలిలో సోమవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఐక్య రాజ్య సమితికి చైనా ఉప శాశ్వత ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఈ విధంగా హెచ్చరించారు. 


తాలిబన్లు అకస్మాత్తుగా, వేగంగా ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం భారత దేశం అధ్యక్షతన  జరిగింది. జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ ఎంత మాత్రం ఉగ్రవాదులకు అడ్డాగా మరోసారి మారకూడదని చెప్పారు. ఆ దేశంలో భవిష్యత్తు రాజకీయ పరిష్కారాలకు ఇదే కీలకమని స్పష్టం చేశారు. తాలిబన్లు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారని, ఉగ్రవాద సంస్థలతో తెగదెంపులు చేసుకుంటారని  ఆశిస్తున్నట్లు తెలిపారు. భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చాలన్నారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదంపై పరస్పర సహకారంతో పోరాడాలన్నారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా, ఎటిమ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్థాన్‌లో అరాచకాన్ని తమకు అనుకూలంగా మలచుకోకుండా ఉగ్రవాద సంస్థలను నిరోధించేందుకు అన్ని దేశాలు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. 


అల్ ఖైదాకు అనుబంధంగా ఎటిమ్ (ఈస్ట్ తుర్క్‌మెనిస్థాన్ ఇస్లామిక్ మువ్‌మెంట్) అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడింది. ఇది చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఏర్పాటైంది. ఈ ప్రావిన్స్‌లో దాదాపు ఓ కోటి మంది వీఘర్ ముస్లింలు ఉన్నారు. ఈ ప్రావిన్స్‌కు స్వాతంత్ర్యం ప్రకటించాలని ఎటిమ్ డిమాండ్ చేస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అల్ ఖైదా ఆంక్షల కమిటీ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఎటిమ్ ఉంది.


Updated Date - 2021-08-17T21:37:11+05:30 IST