డ్రాగన్‌.. యుద్ధోన్మాదం

ABN , First Publish Date - 2020-09-02T07:07:30+05:30 IST

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. తరచూ ఘర్షణలకు కారణమవుతున్న డ్రాగన్‌ దేశం చైనా మంగళవారం స్వరం పెంచింది. యుద్ధానికి సిద్ధమవుతామంటూ తన కరపత్రమైన చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ద్వారా చెప్పింది...

డ్రాగన్‌.. యుద్ధోన్మాదం

  • భారత్‌తో సమరానికి మేం సిద్ధం
  • అమెరికా మద్దతున్నా ఓటమే.. మిలటరీని మూసేయాలనుకుంటే దిగండి
  • 1962 నాటి యుద్ధానికి మించి మరణాలను చవి చూస్తారు.. 
  • అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ద్వారా భారత్‌కు చైనా హెచ్చరికలు
  • వ్యూహం ప్రకారమే పాంగాంగ్‌కు 500 మంది సైనికులతో ఆపరేషన్‌
  • సరిహద్దుల్లో ఇరుదేశాల యుద్ధ ట్యాంకులు.. కమాండర్‌ స్థాయిలో చర్చలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. తరచూ ఘర్షణలకు కారణమవుతున్న డ్రాగన్‌ దేశం చైనా మంగళవారం స్వరం పెంచింది. యుద్ధానికి సిద్ధమవుతామంటూ తన కరపత్రమైన చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ద్వారా చెప్పింది. యుద్ధమే వస్తే.. చైనా దీటుగా ఎదుర్కొంటుందని.. భారత్‌కు ఓటమి తప్పదంటూ తన యుద్ధోన్మాదాన్ని వెళ్లగక్కింది. భారత్‌ కంటే శక్తిసామర్థ్యాల్లో చైనా ఎన్నోరెట్లు ముందుందని, అసలు చైనాకు భారత్‌ సమ ఉజ్జీ కానే కాదని గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకీయంలో పేర్కొంది.


‘‘అమెరికా వెంట ఉంటుందనే భ్రమల్లో భారత్‌ ఉంది. అమెరికా ఎందుకు సహకరిస్తుంది? చైనాను ఆక్రమించుకోవడానికా?? ఆ భ్రమలను వదలాలి. అమెరికా సైన్యంతో కలిసి పోరాడినా.. యుద్ధంలో భారత్‌ గెలవదు. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ చైనా ప్రజలు అంగీకరించరు. వారంతా చైనా ప్రభుత్వం వెంటే ఉన్నారు. చైనాలోని ప్రతి అంగుళాన్ని కాపాడే సత్తా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కి ఉంది. సరిహద్దుల్లో భారత్‌వి ‘పోకిరి’చర్యలు. ఆ చర్యలను చైనా భరిస్తుందని భారత్‌ అనుకుంటుంది. పాంగాంగ్‌ సరస్సు వద్ద ఘర్షణే జరిగితే.. భారత సైన్యానికి కొత్త ఓటమి తప్పదు. భారత్‌ తన మిలటరీ విభాగాన్ని పూర్తిగా మూసివేయాలనుకుంటే.. యుద్ధానికి సిద్ధం కావొచ్చు’’ అని ఘాటు వ్యాఖ్యానాలు చేసింది.


యుద్ధమే వస్తే.. 1962లో జరిగిందే పునరావృతమవుతుందని, అప్పటికంటే ఎక్కువ మరణాలను భారత్‌ మూటకట్టుకుంటుందని ఆ సంపాదకీయంలో పేర్కొంది. సవాళ్ల విషయంలో చైనా సున్నితమైనది కాదని తెలిపింది. చైనా అధికార పత్రిక ఇలా విషం కక్కుతుంటే.. భారత్‌పై తాము మొదట యుద్ధం చేయబోమని చైనా ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. ఎల్‌ఏసీ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలపై జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోభాల్‌ సైన్యాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ కూడా ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. సైన్యాధికారి ఎంఎం నరవణే కూడా పరిస్థితిని దగ్గరి నుంచి సమీక్షిస్తూ.. సేనలకు అవసరమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. వైమానిక దళం కూడా ఆ ప్రాంతంలో సుకోయ్‌, జాగ్వార్‌, మిరాజ్‌ యుద్ధ విమానాలను మోహరించింది. తాజా ఘర్షణలపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడారు. ‘‘చైనా తాజా చర్యలు గత ఒప్పందాల ఉల్లంఘనే. ఎల్‌ఏసీ వెంబడి పాటించాల్సి స్టేట్‌సకోను చైనా ఉల్లంఘించింది’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం కూడా చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిందని, భారత్‌ దాన్ని దీటుగా ఎదుర్కొందని తెలిపారు.



చైనా అధీనంలో 1,000 చ.కిలోమీటర్లు? 

లద్దాఖ్‌ వద్ద ఎల్‌ఏసీ వెంబడి పలు ప్రదేశాల్లో భారత్‌కు చెందిన దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్లు ‘ద హిందూ’ పత్రిక వెబ్‌సైట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. దెప్సాంగ్‌ నుంచి చుశుల్‌ వరకు ఈ ఆక్రమణలు జరిగాయి. దెప్సాంగ్‌ మైదానంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 10 నుంచి 13 వరకు 900 చదరపు కిలోమీటర్లు చైనా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. గల్వాన్‌ లోయలో 20 చదరపు కిలోమీటర్లు, హాట్‌స్ర్పింగ్‌ ప్రాంతంలో 12 చదరపు కిలోమీటర్లు, పాంగాంగ్‌ వద్ద 65 చదరపు కిలోమీటర్లు, చుశుల్‌ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది. తాజాగా పాంగాంగ్‌ వద్ద ఉన్న ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-8 వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఉన్న భూభాగంపై చైనా కన్నేసిందని ఆ అధికారి వివరించినట్లు ‘ద హిందూ’ కథనం పేర్కొంది.


ఇరువైపులా యుద్ధ ట్యాంకులు

ముందు నుంచే పక్కా వ్యూహంతో ఉన్న చైనా.. పాంగాంగ్‌ దక్షిణ తీరానికి సులభంగా యుద్ధ ట్యాంకులను చేర్చేలా రోడ్డును నిర్మించింది. అయితే.. ఆ రోడ్డుపై కదలికలను.. భారత్‌ ఆధీనంలోని మూడు హిల్‌టా్‌పల పైనుంచి సులభంగా గుర్తించే అవకాశం ఉంది. తాజా వివాదం తర్వాత చైనా కాలా హిల్‌టాప్‌ కింద యుద్ధ ట్యాంకులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం కమాండర్‌ స్థాయి చర్చలు జరుగుతున్నా.. భా రత సైన్యం కూడా యుద్ధ ట్యాంకులను సిద్ధం చేసింది. కాలా హిల్‌టాప్‌ సమీపంలో బలగాలు మోహరించాయి. ఇరు దేశాల యు ద్ధ ట్యాంకులు పరస్పరం కాల్పులు జరిపేందుకు అనువైన దూరం(టార్గెట్‌)లో ఉన్నాయి. హిల్‌టా్‌పపై భారత్‌ పట్టు ఉండటంతో.. యుద్ధట్యాంకులను చైనా ముందుకు కదలించలేని పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 




భారతే చొచ్చుకొచ్చింది: చైనా

చైనా తన కవ్వింపు చర్యలను కప్పిపుచ్చుకుంటూ.. నెపాన్ని భారత్‌పై వేస్తోంది. శనివారం అర్ధరాత్రి ఏం జరిగిందో చెప్పకుండా.. భారత బలగాలు సోమవారం మూడు కిలోమీటర్ల మేర చైనా భూభాగంలోకి చొరబడ్డాయని ఆరోపించింది. తాజా వివాదంపై మంగళవారం ఉదయం ఇరుదేశాల సైన్యానికి చెందిన కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య భారత్‌ పరిధిలోని చుశుల్‌ బేస్‌ వద్ద చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఒక బెటాలియన్‌ బలగాలతో చుశుల్‌ ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ చర్చల్లో చైనా అధికారులు ఆ మూడు హిల్‌టా్‌ప్సపై భారత సైన్యం ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాంగాంగ్‌ వద్ద మూడు కిలోమీటర్ల మేర చైనా భూభాగంలోకి చొచ్చుకువచ్చారని, రిక్విన్‌ పాస్‌(రేచిన్‌ లా)ను ఆక్రమించుకున్నారని ఆక్షేపించారు. భారత్‌ కూడా అందుకు దీటుగా సమాధానమిస్తూ.. థాకుంగ్‌లోని భారతీయ సైనిక పోస్టుకు సమీపంలో మోహరించిన చైనా బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్చలు బుధవారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి.


నిత్యం వివాదాలకు అవకాశం: వాంగ్‌ యీ

ఎల్‌ఏసీని కచ్చితంగా నిర్ణయించలేదని, అందుకే.. భారత్‌తో నిత్యం వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయంటూ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన పారి్‌సలోని ఫ్రెంచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ‘‘ఇటీవల ప్రపంచ దేశాల దృష్టి భారత్‌-చైనా సంబంధాలపై మళ్లింది. ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మేం సిద్ధం. ఇరు దేశాలు అభివృద్ధి సాధిస్తే ప్రపంచంలో 270 కోట్ల మంది ఆధునికత వైపు అడుగు వేసినట్లే. భారత్‌-చైనా కలిస్తే.. 1+1 అనేది 11 అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.


చైనా కుట్రను ఇలా అడ్డుకున్నారు

భారత్‌ వైపు చడీచప్పుడు లేదు.. పాంగాంగ్‌ సరస్సు నిశ్శబ్దంగా ఉంది.. శుక్ల పక్ష చంద్రుడి వెలుగు.. వీటన్నింటినీ అవకాశంగా మలచుకుని, సరిహద్దుల్ని మార్చేయాలని పీఎల్‌ఏ భారీ స్కెచ్చే వేసింది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ ఉదంతం తర్వాత భారత్‌ పాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరంపైనే దృష్టిసారిస్తుందనే ఉద్దేశంతో.. దక్షిణ తీర ప్రాంతాన్ని ఏకపక్షంగా ఆక్రమించేయాలని భావించింది. ఒకటీ రెండు ప్లటూన్లుగా కాకుండా.. ఏకంగా 500 మందికిపైగా సైనికులను ఆ పనికి పురమాయించింది. శనివారం రాత్రి వారంతా.. ట్రెకింగ్‌ పరికరాలు, తాళ్లతో ఆ ప్రాంతం వైపు కదలికలు ప్రారంభించారు. కానీ, చైనా ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతుందని పసిగట్టిన భారత సైన్యం.. పాంగాంగ్‌ వద్ద వ్యూహాత్మకమైన మూడు హిల్‌టా్‌ప్సపై   నిఘాను కొనసాగించింది. వాటి పైనుంచి.. చైనా భూభాగంలో పీఎల్‌ఏ కదలికలను సులభంగా పసిగట్టవచ్చు. అర్ధరాత్రి చైనా సైన్యాలు భారత్‌వైపు వస్తుండటంతో.. వెంటనే స్పందించి, చొరబాటు యత్నాలను తిప్పికొట్టింది. ప్రస్తుతం పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరం భారత్‌ నియంత్రణలోనే ఉందని అధికారులు ప్రకటించారు.


చైనా దుస్సాహసాలను తిప్పికొడతాం: అమెరికా

భారత్‌ సహా.. అనేక దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా దుస్సాహసాలను తిప్పికొడతామని అమెరికా డిప్యూటీ సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ స్టీఫెన్‌ బీగన్‌ అన్నారు. సోమవారం భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం నిర్వహించిన ‘లీడర్‌షిప్‌ సమ్మిట్‌’లో ఆయన మాట్లాడుతూ.. చైనాను అన్ని విధాలుగా నిలువరించేందుకు సమష్టి కృషి చేస్తున్నామన్నారు. చైనాను ప్రతి విషయంలోనూ తిప్పికొట్టడమే తమ వ్యూహమని చెప్పారు. చైనా అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్థిక విధానాలను ఎదుర్కోవడంపై ట్రంప్‌ సర్కారు దృష్టి పెట్టిందన్నారు.



Updated Date - 2020-09-02T07:07:30+05:30 IST