Abn logo
Oct 20 2021 @ 00:02AM

కల్యాణ వైభోగమే..

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

వైభవంగా చిన వెంకన్న కల్యాణం

ద్వారకా తిరుమల  , అక్టోబరు 19 : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడి కల్యాణం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా కల్యాణ మూర్తులైన స్వామి, అమ్మవార్లను వివాహ వేడుక వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి పుష్పాలంకరణ చేశారు. అనంతరం హారతులు పట్టి కల్యాణ వేడుకను ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టి కల్యాణ క్రతువు నిర్వహించారు. అనంతరం వెండి గరుడ వాహనంపై కోవెల ఉత్సవం జరిపారు. . కల్యాణ వేడుకల ఏర్పాట్లను ఆలయ ఈవో సుబ్బారెడ్డి పర్యవేక్షించారు. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, ఏలూరు ఆర్డీవో రచన, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లు సింహ వాహనంపై విహరించారు. ముందుగా ఆలయ అర్చకులు ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి, అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పుష్పాలం కరణ చేసి, హారతులు పట్టి ఉత్సవం ప్రారంభించారు. ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు.