వావ్.. 1000 కిలోమీటర్ల ప్రయాణం, రెండున్నర గంటల్లో..

ABN , First Publish Date - 2021-07-20T21:15:25+05:30 IST

అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న చైనా మరో అద్భుతం చేసింది. గంటకు గరిష్ఠంగా 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల మాగ్లెవ్ రైలును తాజాగా ఆవిష్కరించింది.

వావ్.. 1000 కిలోమీటర్ల ప్రయాణం, రెండున్నర గంటల్లో..

ఇంటర్నెట్ డెస్క్: అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న చైనా మరో అద్భుతం చేసింది. గంటకు గరిష్ఠంగా 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల మాగ్లెవ్ రైలును తాజాగా ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చైనా ఈ రైలును తయారు చేసింది. అయస్కాంత శక్తి ఆధారంగా నడిచే(మాగ్లెవ్ టెక్నాలజీ) మాగ్లెవ్ రైలు.. పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ మందుకెళుతుంది. ఈ విధానంలో రైలుకు, పట్టాలకు మధ్య సహజంగా ఉండే రాపిడి సమసిసోయి మెరుపు వేగాన్ని అందుకోగలదు. నేలపై అత్యధిక వేగంతో ప్రయాణించగల వాహనం ప్రపంచంలో ఇదొక్కటేనని ఈ సందర్భంగా చైనా మీడియా పేర్కొంది.


వాస్తవానికి రెండు దశాబ్దాలుగా మాగ్లెవ్ రైళ్లపై ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే.. షాంఘాయ్‌లోని పుడాంగ్ ఎయిర్ పోర్టు నుంచి సమీప నగరానికి వెళ్లేందుకు ఓ మాగ్లెవ్ సర్వీసు అందుబాటులో ఉంది. కానీ.. ఈ కొత్త మాగ్లేవ్ రైలు దాన్నిమించిన వేగంతో ప్రయాణించగలదు.  చైనా ఈ రైళ్లను దేశమంతటా విస్తరించాలనే యోచనలో ఉంది. ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలను మాగ్లెవ్ రైళ్లతో అనుసంధానం చేయాలనేది చైనా పరిశీలిస్తున్న ప్రతిపాదనల్లో ముఖ్యమైనది. ఇది కార్యరూపం దాలిస్తే.. బీజింగ్ నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరాన ఉన్న షాంఘైకు కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. ఇదే ప్రయాణానికి విమానంలో అయితే 3 గంటలు, ఇతర హైస్పీడ్ రైళ్లలో అయితే ఐదున్నర గంటలు పడుతుంది. జపాన్ నుంచి జర్మనీ వరకూ అనేక దేశాలు మాగ్లెవ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే.. ఇందుకు కోసం భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమవుతుండటంతో.. ఈ రైళ్లను వినియోగించేందుకు అనేక దేశాలు వెనకడుగు వేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-07-20T21:15:25+05:30 IST