గాల్వాన్ లోయలో జెండా ఎగరేసిన చైనా సైనికులు.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు

ABN , First Publish Date - 2022-01-03T17:57:57+05:30 IST

కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఇండియా-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు కొందరు మరణించారు. అయితే సరిహద్దులో శాంతి అవసరమని ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపి సానుకూల పరిస్థితి తీసుకువచ్చారు. అయితే భారత్ ఈ విషయంపై కట్టుబడి ఉన్నప్పటికీ..

గాల్వాన్ లోయలో జెండా ఎగరేసిన చైనా సైనికులు.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు

న్యూఢిల్లీ: గాల్వాన్ లోయలో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా జనవరి 1న గాల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఇండియా-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు కొందరు మరణించారు. అయితే సరిహద్దులో శాంతి అవసరమని ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపి సానుకూల పరిస్థితి తీసుకువచ్చారు. అయితే భారత్ ఈ విషయంపై కట్టుబడి ఉన్నప్పటికీ చైనా మాత్రం వీలు దొరికినప్పుడల్లా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.


చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’లో ఓ వీడియోను షేర్ చేస్తూ ‘‘ఇండియాకు సరిహద్దుకు సమీపంలో ఉన్న గాల్వాన్ లోయలో ‘ఒక ఇంచు స్థలం పోనివ్వం’ అని రాసున్న అక్షరాల కింద పీపుల్స్ ఆఫ్ లిబరేషన్ ఆర్మీ సైనికులు జనవరి 1, 2022న చైనా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు’’ అని ట్వీట్ చేశారు. ఇక గాల్వాన్ లోయలో చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మరో వీడియోను షేర్ చేస్తూ ‘‘2022 నూతన సంవత్సరం సందర్భంగా గాల్వాన్ లోయలో చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గాల్వాన్ లోయలో ఎగురవేసిన ఈ జాతీయ జెండా చాలా ప్రత్యేకమైంది. ఈ జెండాను బీజింగ్‌లోని టియాన్‌మెన్ స్వేర్‌లో ఎగురవేశారు’’ అని రాసుకొచ్చారు.


కాగా, గాల్వాన్‌లో చైనా సైనికులు తమ జాతీయ జెండాను ఎగురవేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వ అసమర్ధత వల్లే సరిహద్దులో చైనా జెండా ఎగురవేసిందని, అయినప్పటికీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని దుయ్యబడుతున్నారు. ఈ విషయమై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘కొద్ది రోజుల క్రితమే 1971లో భారత్ సాధించిన విజయంపై మనం సంబరాలు చేసుకున్నాం. దేశ భద్రత, విజయం కోసం బలమైన, వ్యూహాత్మకమైన నిర్ణయాలు అవసరం. కేవలం మాటలు గెలిపించలేవు’’ అని ట్వీట్ చేశారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘గాల్వాన్‌లో మన తిరంగా కూడా ఎగురవేసి చైనాకు గట్టి సమాధానం చెప్పాలి. మోదీజీ.. మౌనం వీడండి’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2022-01-03T17:57:57+05:30 IST