పాకిస్థాన్ మీడియాపై నియంత్రణకు చైనా యత్నాలు

ABN , First Publish Date - 2021-12-15T00:23:03+05:30 IST

పాకిస్థాన్‌ను చైనా బాగా వాడుకుంటోందని అమెరికన్

పాకిస్థాన్ మీడియాపై నియంత్రణకు చైనా యత్నాలు

వాషింగ్టన్ : పాకిస్థాన్‌ను చైనా బాగా వాడుకుంటోందని అమెరికన్ మీడియా తెలిపింది. పాశ్చాత్య దేశాలు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పాకిస్థాన్ మీడియాను ఉపయోగించుకోబోతోందని పేర్కొంది. ఇదంతా ఉమ్మడి ఏర్పాటుగా పైకి కనిపించినప్పటికీ, పాకిస్థాన్ దేశీయ మీడియాపై చైనా నియంత్రణ సాధిస్తోందని తెలిపింది.


అమెరికన్ మీడియా కథనం ప్రకారం, 2021 సెప్టెంబరులో మొదటిసారి చైనా-పాకిస్థాన్ మీడియా ఫోరం సమావేశం జరిగింది. ఇరు దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనడంపై ఈ సమావేశంలో చర్చించారు.  తమకు వ్యతిరేకంగా ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశంపై చర్చించారు. ఉభయ దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొడతామని ప్రతినిధులు శపథం చేశారు. చైనా-పాకిస్థాన్ మీడియా కారిడార్‌ను ఏర్పాటు చేసి, సమన్వయంతో ఎదుర్కొంటామని పేర్కొన్నారు. 


పాకిస్థాన్‌కు చైనా రాయబారి నోంగ్ రోంగ్ మాట్లాడుతూ, ఇరు దేశాలు దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. సత్యం, న్యాయం, నిష్పాక్షికతలను ప్రోత్సహించేందుకు, ప్రచారం చేసేందుకు ఉభయ దేశాల మీడియా వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు సకారాత్మక శక్తిగా ఏర్పడాలన్నారు. 


అయితే పాకిస్థాన్ మీడియాపై చైనా నిఘా పెడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయని అమెరికన్ మీడియా కథనం పేర్కొంది. ప్రచురించవలసిన వార్తలు, సెన్సార్‌షిప్ వంటివాటిని చైనాయే చూసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అభిప్రాయాలను రూపొందించేవారు, మేధావుల సహకారంతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, ప్రజాభిప్రాయాన్ని పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఈ మీడియా కారిడార్‌లో ఇరు దేశాల ప్రతినిధులు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌లోని దౌత్య కార్యాలయం ద్వారా చైనా ఆధిపత్యం చలాయించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 


Updated Date - 2021-12-15T00:23:03+05:30 IST