నేపాల్‌కు చైనా అభయహస్తం!

ABN , First Publish Date - 2021-05-08T02:26:48+05:30 IST

కొవిడ్-19 కారణంగా మందుల కోసం అల్లాడుతున్న నేపాల్‌కు చైనా అండగా నిలిచింది. కరోనా మహమ్మారిపై నేపాల్ పోరాటంలో సాయపడేలా..

నేపాల్‌కు చైనా అభయహస్తం!

బీజింగ్: కొవిడ్-19 మందులు, వ్యాక్సీన్ల కోసం అల్లాడుతున్న నేపాల్‌కు చైనా అండగా నిలిచింది. కరోనా మహమ్మారిపై నేపాల్ పోరాటంలో సాయపడేలా మందులు, సహాయక సామగ్రి పంపనున్నట్టు ఇవాళ డ్రాగన్ ప్రకటించింది. ‘‘నేపాల్ మాకు స్నేహపూర్వక పొరుగుదేశం. వ్యూహాత్మక సహకార భాగస్వామి. సాధ్యమైనంత త్వరగా నేపాల్‌కు అత్యవసర సరఫరాలు సేకరించి పంపిస్తాం..’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. చైనాలోని స్థానిక ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా నేపాల్‌కు వైద్య సామగ్రి పంపనున్నట్టు ఆయన తెలిపారు. కొవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన విపత్కర పరిస్థితుల నుంచి నేపాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు వెన్‌బిన్ పేర్కొన్నారు. నేపాల్‌లో ఒక్కసారిగా కరోనా వైరస్ విజృంభించడంతో ప్రభుత్వం ఈ నెల 12 వరకు లాక్‌డౌన్ విధించింది. అత్యవసర సేవలు మినహా అన్ని మార్కెట్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, రవాణా సేవలను మూసివేసింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేసింది. నేపాల్‌లో ఇప్పటి వరకు 377,603 మందికి కరోనా సోకగా.. 3,579 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2021-05-08T02:26:48+05:30 IST