లిపులేక్‌ సరిహద్దుల్లో భారీగా చైనా మొహరింపులు

ABN , First Publish Date - 2020-08-02T03:22:07+05:30 IST

చైనా తన బుద్ధి మళ్లీ బయటపెట్టింది. లడాఖ్ వద్ద సైన్యాన్ని వెనక్కు తీసుకుంటూనే మరో పక్క ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ వద్ద భారీగా..

లిపులేక్‌ సరిహద్దుల్లో భారీగా చైనా మొహరింపులు

న్యూఢిల్లీ: చైనా తన బుద్ధి మళ్లీ బయటపెట్టింది. లడాఖ్ వద్ద సైన్యాన్ని వెనక్కు తీసుకుంటూనే మరో పక్క ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ వద్ద భారీగా సైన్యాన్ని మొహరిస్తోంది. దాదాపు మూడు నెలలుగా లడాఖ్ సరిహద్దు వద్ద భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిని నియంత్రించేందుకు ఇరుదేశాలూ ఉన్నత స్థాయిలో చర్చలు జరిపాయి. వాటి ఫలితంగా చైనా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటన చేసి రోజులు కూడా గడవక ముందే మళ్లీ తన వంకర బుద్ధి బయటపెట్టింది. లిపులేక్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఉత్తర ప్రాంతాల్లోని భారత సరిహద్దు ప్రాంతాల్లో భారీగా సైనిక మొహరింపులు ప్రారంభించింది. ఈ మేరకు భారత ఉన్నత సైనికాధికారులు చెబుతున్నారు. దీంతో భారత సైన్యం కూడా అక్కడకు చేరుకుంటోందని, నేపాల్‌పై కూడా దృష్టిసారించిందని వివరించారు. ‘చైనాను ఎప్పటికీ నమ్మలేం.


ఇప్పటికే లడాఖ్ ప్రాంతంలో వెనక్కి వెళుతున్నామని చెబుతూనే ఎల్‌ఏసీ(వాస్తవాధీన రేఖ) వెంబడి శాశ్వత సైనిక స్థావరాలను నిర్మించుకుంటోంది. అందుకే భారత సైన్యం కూడా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటోంది. చలికాలంలో చైనా వెనక్కి తగ్గుతుందా లేదా అనేదానితో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సైన్యాన్ని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నా’మని సైనికాధికారులు వెల్లడిస్తున్నారు.


ఇదిలా ఉంటే లిపులేక్ ప్రాంతాన్ని నేపాల్ తమ దేశంలోని భాగంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ ప్రాంతంపై ప్రస్తుతం చైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితులు మరింత జటిలమయ్యేలా కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-08-02T03:22:07+05:30 IST