Abn logo
Sep 14 2021 @ 17:45PM

క్వాడ్ దేశాల సదస్సుపై చైనా అక్కసు

బీజింగ్ : భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి ఒకే వేదికపైకి రావడం చైనాకు నచ్చడం లేదు. సెప్టెంబరు 24న ఈ దేశాల అధినేతలు వ్యక్తిగతంగా సమావేశం కాబోతున్న నేపథ్యంలో చైనా తీవ్రంగా అక్కసు వెళ్ళగక్కింది. ఇలాంటి ప్రాంతీయ సహకార వేదికలకు ఆదరణ, భవిష్యత్తు ఉండబోవని శాపం పెట్టింది. 


క్వాడ్ దేశాలు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల సమావేశం ఈ నెల 24న అమెరికా నేతృత్వంలో వాషింగ్టన్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ దేశాల నేతలు వ్యక్తిగతంగా పాల్గొంటారు. ఐక్య రాజ్య సమితి సాధారణ సభ సమావేశాలు న్యూయార్క్‌లో జరిగే సమయంలోనే క్వాడ్ సదస్సు కూడా జరగబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాన మంత్రి యొషిహిడే సుగ, ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్ అమెరికా పర్యటన ఖరారైంది. 


ఈ నేపథ్యంలో క్వాడ్ సదస్సుపై స్పందించాలని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ను విలేకర్లు మంగళవారం కోరారు. ఝావో మాట్లాడుతూ, క్వాడ్ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదన్నారు. ప్రాంతీయ సహకార సంఘం ఏదైనప్పటికీ, సమకాలిక ధోరణికి తగినట్లుగా ఉండాలన్నారు. ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని, సహకారాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలని తెలిపారు. మూడో పక్షాన్ని లక్ష్యం చేసుకోరాదని, మూడో పక్షం ప్రయోజనాలకు విఘాతం కలిగించకూడదని పేర్కొన్నారు. ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసుకోవడం దేశ ఆకాంక్షలకు అనుగుణ్యమైనది కాదని, ఇటువంటివాటికి ఆదరణ, భవిష్యత్తు ఉండబోవని పేర్కొన్నారు. 


ఆసియా పసిఫిక్‌లో ఆర్థిక వృద్ధికి చైనా ఓ ఇంజిన్ మాత్రమే కాకుండా శాంతి పరిరక్షణలో ప్రధాన శక్తి అని నొక్కివక్కాణిస్తున్నానని చెప్పారు. చైనా వృద్ధి చెందడమంటే ప్రపంచంలో శాంతి శక్తులు పెరగడమని, ఈ ప్రాంతానికి శుభవార్త అని చెప్పారు. సంబంధిత దేశాలు పాతకాలపు జీరో-సమ్ గేమ్ థింకింగ్‌ను, సంకుచిత భౌగోళిక రాజకీయ భావాలను వదిలిపెట్టాలని హితవు పలికారు. చైనా అభివృద్ధిపట్ల సరైన దృక్పథాన్ని కలిగియుండాలని కోరారు. ఈ ప్రాంతంలో ప్రజల మనసులను గౌరవించాలన్నారు. ప్రాంతీయ దేశాల సమైక్యత, సహకారాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలన్నారు. 


ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ముఖ్యమైన సముద్ర మార్గాలు ఎటువంటి ప్రాబల్యాలు లేకుండా ఉండాలనే లక్ష్యంతో సమన్వయ వ్యూహాన్ని రూపొందించడమే క్వాడ్ ఉద్దేశం. 2017 నవంబరులో దీనికి ఓ రూపం వచ్చింది. అయితే, తనకు వ్యతిరేకంగానే క్వాడ్ ఏర్పడిందని చైనా గట్టిగా నమ్ముతోంది. దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో తన పలుకుబడిని ఎదిరించడానికే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసినట్లు భావిస్తోంది.