చైనాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి.. అనుమానితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-04T21:44:40+05:30 IST

భారత్‌కు చెందిన విద్యార్థి చైనాలో తన హాస్టల్ గదిలో శవమై కనిపించిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. సదరు విద్యార్థిని హత్య చేసినట్టు భావిస్తున్న పోలీసులు అనుమానితు

చైనాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి.. అనుమానితుడి అరెస్ట్

బీజింగ్: భారత్‌కు చెందిన విద్యార్థి చైనాలో తన హాస్టల్ గదిలో శవమై కనిపించిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. సదరు విద్యార్థిని హత్య చేసినట్టు భావిస్తున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  బిహార్‌లోని గయకు చెందిన అమన్ నాగ్‌సేన్(20) అనే యువకుడు ఉన్నత చదువుల కోసం చైనా వెళ్లాడు. ఇక్కడ ఫారెన్ స్టడీస్ యూనివర్సీటిలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో జూలై 23న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు కూడా. ఆ తర్వాత నుంచి భారత్‌లోని కటుంబ సభ్యులు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించడం లేదు. ఈ క్రమంలో అతని కోసం వెతగ్గా.. జూలై 29న హాస్టల్ గదిలో శవమై కనిపించాడు.



ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నరబలిలో భాగంగా నాగ్‌సేన్‌ హత్యకు గురైనట్టు భావిస్తున్న పోలీసులు విచారణలో భాగంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారని చైనా విదేశాంగశాఖ వెల్లడించింది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు.. ఫారెన్ స్టడీస్ యూనివర్సిటీకి చెందినవాడేనని పేర్కొంది. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇండియన్ ఎంబసీకి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు చెప్పింది. ఇదిలా ఉంటే.. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు ఏ దేశానికి చెందిన వాడనే వివరాలను చైనా విదేశాంగశాఖ బయటపెట్టలేదు. 


Updated Date - 2021-08-04T21:44:40+05:30 IST