ఆకాశం నుంచి పెనుప్రమాదం..!

ABN , First Publish Date - 2021-05-06T07:39:51+05:30 IST

ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుండగా.. తాజాగా ఆ దేశం కారణంగా మరో పెనుప్రమాదం పుట్టుకొచ్చింది. బీజింగ్‌ ప్రయోగించిన 21 టన్నుల భారీ రాకెట్‌ లాంగ్‌ మార్చ్‌ 5బీ గతి తప్పింది...

ఆకాశం నుంచి పెనుప్రమాదం..!

  • భూమిపైకి దూసుకురానున్న చైనా రాకెట్‌

వాషింగ్టన్‌, మే 5: ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుండగా.. తాజాగా ఆ దేశం కారణంగా మరో పెనుప్రమాదం పుట్టుకొచ్చింది. బీజింగ్‌ ప్రయోగించిన 21 టన్నుల భారీ రాకెట్‌ లాంగ్‌ మార్చ్‌ 5బీ గతి తప్పింది. దాని నియంత్రణపై చైనా పట్టు కోల్పోయింది. ఇది ఎక్కడ పడుతుందన్నది తెలియకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా అంతరిక్ష శకలాలు సముద్రతలాలపై పడుతుంటాయి. కానీ చైనా రాకెట్‌ శకలాలు మాత్రం జనావాసాలపైనే పడేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్‌, మ్యాడ్రిడ్‌, బీజింగ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో పడేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. 


ఈ రాకెట్‌ను ఎందుకు ప్రయోగించారంటే..

చైనా అంతరిక్షంలో టియాన్హీ పేరిట ఒక స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తోంది. దాన్ని పూర్తి చేసే క్రమంలోనే లాంగ్‌ మార్చ్‌ 5బీని గత నెల 29న నింగిలోకి పంపించింది. అయితే.. ఈ రాకెట్‌ తొలి మాడ్యూల్‌ను విడిచిపెట్టిన తర్వాత తాత్కాలిక కక్ష్యలోకి వెళ్లిపోయింది. అనంతరం.. నియంత్రణ తప్పిపోయింది. భూమి వాతావరణంలోకి ప్రవేశించే ఈ వస్తువైనా వాస్తవంగా మండిపోవాలి. కానీ ఈ రాకెట్‌ చాలా పెద్దది కావడంతో అలా మండిపోవడం అసాధ్యమని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జొనాథన్‌ మెక్‌డవల్‌ అభిప్రాయపడుతున్నారు. గతంలో లాంగ్‌ మార్చ్‌ 5బీ తొలి భాగాన్ని లాంచ్‌ చేసినప్పుడూ చైనా విఫలమైందని.. అవి ఐవరీ కోస్ట్‌ ప్రాంతంలో పడి పలు భవనాలను ధ్వంసం చేశాయని ఆయన గుర్తు చేశారు. ఈ వారాంతంలో భూమి వాతావరణంలోకి లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ ప్రవేశించే అవకాశం ఉంది. అమెరికా స్పేస్‌ కమాండ్‌ రాకెట్‌పై కన్నేసి ఉంచిదని దేశ రక్షణ శాఖ ప్రతినిధి మైక్‌ హొవార్డ్‌ తెలిపారు. మరోవైపు చైనాకు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక మాత్రం ఈ రాకెట్‌ జనావాసాలు లేని ప్రాంతంలోనే పడుతుందని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా.. చైనా మున్ముందు మరిన్ని రాకెట్‌లను లాంచ్‌ చేసి, తమ స్పేస్‌ స్టేషన్‌ను పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తైతే.. చైనా స్పేస్‌ స్టేషన్‌ బరువు ఏకంగా 100 టన్నులు ఉంటుంది. అన్నట్లు.. భారత్‌లో కొవిడ్‌ పరిస్థితిని హేళన చేస్తూ.. అక్కడ చితిమంటలు, ఇక్కడ రాకెట్‌ మంటలు అంటూ చైనా ప్రభుత్వ సంస్థ ఒకటి వీబోలో పోస్టు పెట్టిన సంగతి గుర్తుందా..? ఆ సంస్థ గొప్పగా పేర్కొన్న రాకెట్‌ ఇదే!


Updated Date - 2021-05-06T07:39:51+05:30 IST