చైనా ‘ప్రతీకార పర్యాటకం’.. పోటెత్తిన లక్షలాదిమంది

ABN , First Publish Date - 2020-10-02T01:04:24+05:30 IST

కరోనా వైరస్ లాక్‌డౌన్లు, ఆంక్షల కారణంగా దాదాపు ఏడాదిపాటు ప్రజలు ఇళ్లలోనే గడపడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు

చైనా ‘ప్రతీకార పర్యాటకం’.. పోటెత్తిన లక్షలాదిమంది

బీజింగ్: కరోనా వైరస్ లాక్‌డౌన్లు, ఆంక్షల కారణంగా దాదాపు ఏడాదిపాటు ప్రజలు ఇళ్లలోనే గడపడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు నింపేందుకు చైనా సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ‘ప్రతీకార పర్యాటకం’ (రివేంజ్ టూరిజం)ను తెరపైకి తీసుకొచ్చింది. చైనా జాతీయ దినోత్సవం, మధ్య-శరత్కాల పండుగ మధ్య వచ్చే 8 సెలవు దినాల్లో ఈ ప్రతీకార పర్యాటకానికి ప్రజలు పోటెత్తుతారని భావిస్తోంది. దాదాపు 550 మిలియన్ల మంది పర్యటిస్తారని అంచనా వేస్తోంది. 


జాతీయ సెలవుల్లో తొలి రోజు అయిన మంగళవారం పర్యాటకులు ఊహించినట్టే పోటెత్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్యాటకులతో టూరిస్ట్ స్పాట్స్ పోటెత్తిపోయి ఉండడం ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అలాగే, రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. హోటళ్లు, పర్యాటక ప్రదేశాల టికెట్లు పూర్తిగా అమ్ముడుపోవడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక పర్యాటకుల వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదలడం అసాధ్యంగా మారింది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన యునాన్ ప్రావిన్స్‌లోని దాలి, లిజియాంగ్‌తోపాటు హైనాన్‌లోని సన్యా, దక్షిణ చైనాలోని దీవిలోని హోటల్ బుకింగ్స్ రెండింతలైనట్టు ట్రావెల్ బుకింగ్ సైట్ కునార్ పేర్కొంది. 


పోటాపోటీ రాయితీలతో ట్రావెల్ సైట్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా, డిమాండ్ తీర్చేందుకు విమానయాన సంస్థలు కొత్త రూట్లను ఆఫర్ చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న 500కుపైగా సుందర ప్రదేశాలు పర్యాటకులకు ఉచిత అడ్మిషన్, రాయితీలు ప్రకటించాయి. అధికారులు ఈ ప్రయాణాలను ప్రోత్సహించారు. ఈ ప్రయాణాలను ‘ప్రతీకార పర్యాటకం’, ‘ప్రతీకార పర్యాటకం’గా ప్రభుత్వం అభివర్ణించింది. ‘గోల్డెన్ వీక్’గా పిలిచే వార్షిక సెలవు దినాల్లో చైనీయులు ఎక్కువగా పర్యటనల్లో గడుపుతుంటారు. ఈసారి ఈ గోల్డెన్ వీక్ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2020-10-02T01:04:24+05:30 IST